Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్.. జయమ్మగా రష్మిక మారిందిలా..

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

By:  M Prashanth   |   5 April 2026 1:32 PM IST
బర్త్ డే స్పెషల్.. జయమ్మగా రష్మిక మారిందిలా..
X

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల స్టార్ హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న ఆమె.. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ లో ఫుల్ స్పీడ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం రణబాలి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం అంతా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే నేడు రష్మిక పుట్టినరోజు సందర్భంగా రణబాలి మూవీ టీమ్ స్పెషల్ విషెస్ తెలియజేసింది. 'పచ్చి పసుపు కొమ్మ.. మా జయమ్మ' అంటూ ఎమోషనల్ మెసేజ్ తోపాటు ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో రష్మిక సెట్స్‌ కు చేరుకున్నప్పుడు టీమ్ ఆమెకు స్వాగతం పలకడం, పాత్ర గురించి డైరెక్టర్ వివరించడం, రష్మిక జయమ్మ గెటప్‌ లోకి మారడం వంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ చూపించారు.

అంతే కాదు.. సినిమాలోని ఏందయ్యా పాటలో విజయ్, రష్మికకు సంబంధించిన విజువల్స్‌ ను కూడా యాడ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సూపర్ జయమ్మ.. హ్యాపీ బర్త్ డే జయమ్మ అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

అయితే సినిమాలో రష్మిక జయమ్మ అనే పవర్ ఫుల్ గ్రామీణ యువతి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల అనంతపురం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ పూర్తయింది. అక్కడి ప్రజలు చూపించిన ఆదరణకు విజయ్, రష్మిక ప్రత్యేక వీడియో ద్వారా అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు.

ఇక సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం, ఒక శాపానికి గురైన నేల చుట్టూ తిరిగే కథగా సినిమా ఉండబోతోందని సమాచారం.

చరిత్రలో చాలా మందికి తెలియని, తప్పుగా చిత్రీకరించిన అనేక సంఘటనలు సినిమాలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. అజయ్-అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడోసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో రణబాలిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడం ప్రాజెక్ట్‌ కు మరింత హైప్ తెచ్చింది. ఏదేమైనా సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశముంది.