ట్రెండీ టాక్: బాలీవుడ్‌లో ఏకైక సౌత్ క్వీన్ రష్మిక!
ఇండియన్ సినిమాలో ఒక ప్రాంతీయ పరిశ్రమ నుండి వచ్చి దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ గా వెలిగిపోతూ తిరుగులేని డిమాండ్ సంపాదించుకున్న నటీమణులు చాలా అరుదుగా ఉంటారు.
By: Sivaji Kontham | 2 Jun 2026 7:00 PM ISTఇండియన్ సినిమాలో ఒక ప్రాంతీయ పరిశ్రమ నుండి వచ్చి దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ గా వెలిగిపోతూ తిరుగులేని డిమాండ్ సంపాదించుకున్న నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. గతంలో అతిలోక సుందరి శ్రీదేవి, ఆ తర్వాత జయప్రదలకు మాత్రమే ఉత్తరాది చిత్రసీమలో ఈ స్థాయి ఆదరణ, పట్టు దక్కాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రష్మిక మందన్న భారతదేశంలోనే అత్యంత క్రేజీ హీరోయిన్ గా ఎదగడం విశేషం. సౌత్ నుంచి గతంలో చాలామంది నాయికలు హిందీలో ప్రయత్నించినా ఎవరికీ దక్కనంత క్రేజ్ ఇప్పుడు రష్మికకు మాత్రమే దక్కింది. ఈ కన్నడ బ్యూటీ 2022లో గుడ్ బై అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టి.. కేవలం నాలుగేళ్లలోనే అసాధారణ క్రేజ్ తెచ్చుకుని అగ్ర నటీమణులకు సైతం లేనంతటి డిమాండ్‌తో దూసుకుపోతోంది.
సాధారణంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పోలిస్తే.. బాలీవుడ్‌లో విజయవంతమైన పాన్-ఇండియా నటీమణులకు ఇచ్చే ప్రాధాన్యత, పారితోషికాల పరిధి చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మికకు ప్రస్తుతం అందుతున్న ఆఫర్లు.. గుర్తింపు టాలీవుడ్ మార్కెట్ అంచనాలను సైతం దాటిపోయాయి. ఒకప్పుడు కేవలం హిందీ మాట్లాడే నటీమణులకే బాలీవుడ్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కానీ ఇప్పుడు కథలో బలం, నటనలో సహజత్వం ఉంటే చాలని ఉత్తరాది ప్రేక్షకులు భావిస్తుండడంతో ప్రాంతీయ సరిహిద్దులు చెరిగిపోయాయి. ఒక సాధారణ నేపథ్యం నుండి వచ్చి తన నటనతో హిందీ చిత్రసీమలోని అగ్ర తారల సరసన నిలిచిన రష్మిక ప్రస్థానం ఆసక్తికరం. ప్రతిభ ఉంటే భారతీయ సినిమాను ఏలవచ్చని ఈ ప్రతిభావని నిరూపించింది.
గతంలో శ్రీదేవి, జయప్రద లాంటి నటీమణులు ఒక భాష నుండి మరో భాషకు వెళ్లి ఎదగడానికి ఎన్నో ఏళ్లు పట్టేది, కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పాన్-ఇండియా సినిమాల వల్ల ఒకే సమయంలో దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఒకప్పటి కంటే ఐదారు రెట్లు ఎక్కువ పారితోషికాలు ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక నటి మార్కెట్ పరిధిని, పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. రష్మిక మొదటి కన్నడ చిత్రం కిరిక్ పార్టీ 2016 డిసెంబర్‌లో విడుదలైంది. ఆ తర్వాత 2018లో వచ్చిన ఛలో, ఆపై గీత గోవిందం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమా రంగంలోకి ప్రవేశించిన కేవలం పదేళ్ల ప్రయాణంలోనే ఈ ఎదుగుదల సాధ్యమైంది.
దక్షిణాది చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన రష్మిక ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా వంటి భారీ చిత్రాలలో నటిస్తూ అగ్ర కథానాయికగా అవతరించారు. పుష్ప, యానిమల్ చిత్రాలలో నటించిన సమయంలో తన పారితోషికం దాదాపు 5 నుండి 6 కోట్ల రూపాయల రేంజుకు చేరుకుందని కథనాలు రాగా, ఇప్పుడు ఏకంగా పదిహేను కోట్ల రూపాయల రేంజులో రెమ్యునరేషన్ అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం పదేళ్ల సినిమా ప్రయాణంలో ఈ రేంజుకు ఎదిగిన రష్మిక మందన్న వాస్తవానికి కూర్గ్ ప్రాంతంలోని ఒక సాధారణ గిరిజన కుటుంబానికి చెందిన యువతి కావడం గమనార్హం.
ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి సినిమా రంగంలో ఇంతటి ఘనవిజయాన్ని సాధించడం అనేది నేటితరం అమ్మాయిలకు.. నటి కావాలనుకునే ఎందరో ఔత్సాహిక యువతులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. వైఫల్యాలకు కుంగిపోకుండా, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడితే ఎంతటి ఎత్తుకైనా ఎదగవచ్చని రష్మిక మందన్న కెరీర్ నిరూపించింది. ప్రాంతీయ సినిమా స్థాయి నుండి బాలీవుడ్ అగ్ర తారల సరసన నిలిచే స్థాయికి చేరుకున్న రష్మిక ప్రయాణం భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా దూసుకుపోతోంది.
