Begin typing your search above and press return to search.

బంగారం స్మ‌గ్లింగ్ కేసులో న‌టి 34కోట్ల ఆస్తి జ‌ప్తు

విదేశాల నుంచి బంగారం స్మ‌గ్లింగ్ చేసిన కేసులో క‌న్న‌డ‌ న‌టి ర‌న్యారావు అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 July 2025 9:29 AM IST
బంగారం స్మ‌గ్లింగ్ కేసులో న‌టి 34కోట్ల ఆస్తి జ‌ప్తు
X

విదేశాల నుంచి బంగారం స్మ‌గ్లింగ్ చేసిన కేసులో క‌న్న‌డ‌ న‌టి ర‌న్యారావు అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కోర్టుల ప‌రిధిలో ప్ర‌స్తుతం కేసు విచార‌ణ సాగుతోంది. తాజా స‌మాచారం మేర‌కు.. బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రూ.34 కోట్లకు పైగా ర‌న్యారావు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసినట్లు తెలుస్తోంది.

బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్‌లోని ఒక ఇల్లు, అర్కావతి లేఅవుట్‌లోని ఒక నివాస స్థలం, అనేకల్ తాలూకాలోని ఒక వ్యవసాయ భూమి, తుమకూరులోని ఒక పారిశ్రామిక భూమిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) కింద తాత్కాలికంగా జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆస్తుల మొత్తం మార్కెట్ విలువ 34.12 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం.

కొన్ని నెల‌ల క్రితం న‌టి ర‌న్యారావు త‌న నెట్ వ‌ర్క్ ఏజెంట్ల‌తో క‌లిసి 13కోట్ల విలువైన 14 కేజీల బంగారాన్ని అక్ర‌మంగా దుబాయ్ నుంచి తెస్తూ, బెంగ‌ళూరు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో సీబీఐ- డిఆర్ఐ అధికారుల‌కు దొరికిపోయిన సంగ‌తి తెలిసిందే. అరెస్ట్ అనంత‌రం సుదీర్ఘ కాలంగా ర‌న్యా జైలు జీవితాన్ని అనుభ‌విస్తున్నారు. ప్ర‌స్తుతం సీబీఐ, డిఆర్ఐ ఫిర్యాదును స్వీక‌రించిన ఫెడ‌ర‌ల్ ద‌ర్యాప్తు సంస్థ (పిఎంఎల్ఏ) ర‌న్యారావును విచారిస్తోంది.

నేర‌పూరితంగా డ‌బ్బు సంపాదించాల‌నే ప్ర‌య‌త్నాల కార‌ణంగా న‌టి ర‌న్యారావు అరెస్ట్ అయింది. ఈ కేసులో ఒక తెలుగు న‌టుడి ప్ర‌మేయం ఉంద‌ని, అత‌డిని విచారించిన‌ట్టు కూడా పోలీసులు తెలిపారు. బంగారం స్మ‌గ్లింగ్ కోసం ర‌న్యారావు ప‌లుమార్లు విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన విష‌యాన్ని అధికారులు ధృవీక‌రించారు. సిండికేట్ రికార్డులన్నిటినీ ద‌ర్యాప్తు అధికారులు ప‌రిశీలించారు. వాట్సాప్ చాట్‌లు, బ్యాంకింగ్ లావాదేవీలు, బిల్లులు వ‌గైరా ప‌రిశీలించి కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో రన్యారావు బెయిల్ కోసం అభ్య‌ర్థించినా కోర్టు మంజూరు చేయ‌లేద‌ని క‌థ‌నాలొచ్చాయి.