Begin typing your search above and press return to search.

4.6 కోట్ల‌కు కొని 15కోట్ల‌కు అపార్ట్‌మెంట్ అమ్మిన హీరో

బాలీవుడ్ స్టార్లు రియాలిటీ రంగంలో పెట్టుబ‌డులు పెడుతూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 1:30 PM GMT
4.6 కోట్ల‌కు కొని 15కోట్ల‌కు అపార్ట్‌మెంట్ అమ్మిన హీరో
X

బాలీవుడ్ స్టార్లు రియాలిటీ రంగంలో పెట్టుబ‌డులు పెడుతూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. అపార్ట్ మెంట్లు కొన‌డం, అమ్మ‌డం ద్వారా వారి ఆదాయం అమాంతం పెరుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో తన రెండు అపార్ట్‌మెంట్లను విక్రయించి మొత్తం రూ.15.25 కోట్లు ద‌క్కించుకున్నాడ‌ని సమాచారం. మొదట ఈ అపార్ట్‌మెంట్‌లను డిసెంబర్ 2014లో రూ.4.64 కోట్లకు కొనుగోలు చేశాడు. గోరేగావ్ ఈస్ట్‌లోని ఉన్నతస్థాయి ఒబెరాయ్ ఎక్స్‌క్విసైట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లు ఒక్కొక్కటి 1,324 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తం ఆరు పార్కింగ్ స్థలాలను క‌లిగి ఉన్నాయి.

మనీకంట్రోల్ లోని పత్రాల ప్రకారం.. ఒక్కో యూనిట్‌కు స్టాంప్ డ్యూటీ రూ.45.75 లక్షలు. నవంబర్ 6న పూర్తయిన ఈ లావాదేవీలో ఇప్పటికే అదే హౌసింగ్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న వ్యక్తికి ఫ్లాట్‌లలో ఒకదానిని విక్రయించారు. ఈ డీల్ ఇలా ఉంటే, రణవీర్ సింగ్ -దీపికా పదుకొణె ఇటీవల బాంద్రా బ్యాండ్ స్టాండ్‌లోని సాగర్ రేషమ్ బిల్డింగ్‌లో 3 నుండి 4 అంతస్తులతో రూ.100 కోట్లు పైగా పెట్టుబ‌డితో సముద్ర ముఖంగా ఉన్న పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రోహిత్ శెట్టి పోలీస్ డ్రామా, `సింగం ఎగైన్`లో సింబా పాత్రలో రణవీర్ సింగ్ మళ్లీ క‌నిపిస్తాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫిల్మ్‌లో అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనే తారాగణం. 2024 స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ `పుష్ప 2`తో ఇది ఢీకొట్ట‌నుంది.

సింగమ్ ఎగైన్ తో పాటు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో `డాన్ 3`లో కూడా ర‌ణ్ వీర్ కనిపించబోతున్నాడు. `డాన్` సిరీస్ గ్రిప్పింగ్ స్టోరీస్ థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో అల‌రించే సిరీస్. అత‌డికి ఇది అరుదైన అవ‌కాశం. 2006లో విడుదలైన అసలు డాన్ లో షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా న‌టించారు. ఈ సినిమా సీక్వెల్ డాన్ 2 చిత్రం 2011లో విడుదలైంది. షారూఖ్ డాన్ గా, హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో న‌టించ‌గా, కమర్షియల్ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాల‌కు స్ఫూర్తి 1978లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన డాన్ అన్న సంగ‌తి తెలిసిందే.