Begin typing your search above and press return to search.

‘కాంతార’ వివాదానికి తెరదించిన ‘దురంధర్’

‘దురంధర్’, ‘దురంధర్-2’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి పడేశాడు రణ్వీర్ సింగ్.

By:  Garuda Media   |   11 April 2026 5:52 PM IST
‘కాంతార’ వివాదానికి తెరదించిన ‘దురంధర్’
X

‘దురంధర్’, ‘దురంధర్-2’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి పడేశాడు రణ్వీర్ సింగ్. ఈ సినిమాల సక్సెస్‌లో ఫస్ట్ క్రెడిట్ దర్శక నిర్మాత ఆదిత్య ధర్‌కే ఇవ్వాలి కానీ.. కథానాయకుడి పాత్రలో రణ్వీర్ పెర్ఫామెన్స్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. ఆ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోలేం అన్నట్లుగా చెలరేగిపోయాడు రణ్వీర్. డల్లుగా సాగుతున్న తన కెరీర్‌ ఈ రెండు చిత్రాలతో ఎక్కడికో వెళ్లిపోయింది. తనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న ఈ సమయంలో ఓ అనవసర వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు రణ్వీర్. ఒక గత ఏడాది ఒక అవార్డుల వేడుకలో ‘కాంతార’ సినిమాలో హీరో రిషబ్ శెట్టిని అనుకరించే ప్రయత్నం చేశాడు రణ్వీర్.

ఐతే అది కన్నడిగుల మనోభావాలను దెబ్బ తీసింది. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల వాళ్లు ఎంతో పవిత్రంగా భావించే భూత కోలను రూపకాన్ని అవమానించాడంటూ అతడి మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని మీద కర్ణాటక హైకోర్టులో కేసు కూడా నమోదైంది. దీనిపై రణ్వీర్ ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ.. వివాదం సద్దుమణగలేదు.

కోర్టుకు సమర్పించిన క్షమాపణ పత్రంలో రణ్వీర్‌ జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని.. తన మీద ఫిర్యాదు చేయడమే తప్పు అన్నట్లుగా తన వాదన వినిపించాడని కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి తరఫున లాయర్ వాదించాడు. ఈ నేపథ్యంలో రణ్వీర్ మరోసారి క్షమాపణ పత్రం సమర్పించాడు. పిటిషన్ వేసిన వ్యక్తితో, తన న్యాయవాదితో చర్చించి వారికి తృప్తి కలిగించే భాషలో పరిష్కృత క్షమాపణ పత్రాన్ని సమర్పించినట్లు తన తరఫున న్యాయవాది కోర్టులో వెల్లడించారు. అంతే కాక రణ్వీర్ ఈ నెల 18న మైసూరులోని చాముండేశ్వరి బెట్టకు కూడా వస్తున్నాడని.. అతడికి కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాల మీద ఎంతో గౌరవం ఉందని కూడా తన లాయర్ వాదన వినిపించారు.

అంతే కాక రణ్వీర్ కోర్టుకు, కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పిన నోట్‌ను కూడా చదివి వినిపించారు. ‘‘ఘటన జరిగిన రోజు నేను దైవాన్ని భక్తుల మనోభావాలను దెబ్బ తీశానని అర్థం చేసుకోలేకపోయాను. నేను ముంబయిలోని సింధీ కుటుంబంలో జన్మించడం వల్ల అందులోని ఘనతను అర్థం చేసుకోలేకపోయాను. ఈ ప్రమాణ పత్రం ద్వారా జరిగిన దానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను నిజాయితీ, బేషరతుగా క్షమాపణ కోరుతున్నాను. రానున్న రోజుల్లో మైసూరు ఆలయానికి వచ్చి ప్రార్థన చేసి, నా భక్తిని వ్యక్తం చేస్తాను’’ అని ప్రమాణ పత్రంలో రణ్వీర్ పేర్కొన్నాడు. ఇంతటితో ఈ వివాదానికి తెరపడినట్లే అని భావిస్తున్నారు.