డాన్ 3: దేవరకొండ స్థానంలో బిగ్ బాస్ విజేత?
ఇప్పటికీ 'డాన్ 3' కాస్టింగ్ ఎంపికలు అంతకంతకు ఆలస్యం కావడంతో చిత్రీకరణ కూడా డిలే అవుతోంది. ముఖ్యంగా డాన్ 3 విలన్ ఎంపిక దర్శకనిర్మాత ఫర్హాన్ కి పెద్ద సవాల్ గా మారింది.
By: Tupaki Desk | 22 July 2025 9:55 AM ISTగత కొంతకాలంగా డాన్ 3 రకరకాల కారణాలతో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఆరంభం ఈ సిరీస్ లో మూడో భాగం కోసం షారూఖ్ స్థానంలో రణ్ వీర్ సింగ్ ని దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ ఎంపిక చేయడంతో అది దుమారంగా మారింది. ఖాన్ అభిమానులకు ఇది రుచించలేదు. అయినా ఫర్మాన్ మొండి పట్టుదలతో ముందుకు వెళుతున్నాడు.
ఇప్పటికీ 'డాన్ 3' కాస్టింగ్ ఎంపికలు అంతకంతకు ఆలస్యం కావడంతో చిత్రీకరణ కూడా డిలే అవుతోంది. ముఖ్యంగా డాన్ 3 విలన్ ఎంపిక దర్శకనిర్మాత ఫర్హాన్ కి పెద్ద సవాల్ గా మారింది. మొదట ట్వల్త్ ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేను విలన్ గా ఎంపిక చేసుకున్నా కానీ, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అతడు తప్పుకున్నాడు. ఈ పాత్ర అంత బాలేదనే కారణంతో విక్రాంత్ వదులుకున్నారని కథనాలొచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను సంప్రదించగా, తన దీర్ఘ కాలిక ప్రణాళికల కారణంగా విజయ్ కూడా వెనుకంజ వేసాడు. ఆ తర్వాత ఆదిత్యారాయ్ కపూర్ ను కూడా ఫర్హాన్ బృందం సంప్రదించింది. కానీ ఇది కూడా ఓకే కాలేదు.
తాజా సమాచారం మేరకు రణ్‌వీర్ సింగ్ ను డాన్ 3లో ఢీకొట్టేవాడిగా హిందీ బిగ్ బాస్ (18సీజన్) విజేతను ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ఇటీవల బిగ్ బాస్ 18 విజేత కరణ్ వీర్ మెహ్రాను ఆ పాత్రలోకి తీసుకోవడానికి పరిశీలిస్తున్నారనే కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇటీవలి కరణ్ మేకోవర్, ప్రస్తుత లుక్, ప్రతిభ నిర్మాతలను ఆకర్షించాయి. అతడు ఫర్హాన్ కి చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యాలయం వెలుపల కనిపించడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే అతడు విలన్ గా నటిస్తున్నాడా? లేదా? అన్నదానికి ఇంకా స్పష్ఠత లేదు.
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన డాన్ , డాన్ 2 పెద్ద సక్సెసయ్యాయి. కల్ట్ ఫ్రాంచైజీగా ఇది రూపాంతరం చెందింది. డాన్ 3 లో కియారా అద్వానీ స్థానంలో రణ్ వీర్ సరసన కృతి సనన్ నటించనుందని కూడా కథనాలొచ్చాయి. చిత్రీకరణ 2026 ప్రారంభంలో ప్రారంభం కానుంది.
