Begin typing your search above and press return to search.

బర్త్‌డే స్పెషల్‌ : ఈ గల్లీ బాయ్‌ పూర్వ వైభవం సాధ్యమేనా?

'బ్యాండ్ బాజా బారాత్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రణ్వీర్‌ సింగ్ తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో పాపులర్‌ స్టార్‌గా పేరు దక్కించుకున్నాడు.

By:  Tupaki Desk   |   7 July 2025 6:23 PM IST
బర్త్‌డే స్పెషల్‌ : ఈ గల్లీ బాయ్‌ పూర్వ వైభవం సాధ్యమేనా?
X

'బ్యాండ్ బాజా బారాత్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రణ్వీర్‌ సింగ్ తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో పాపులర్‌ స్టార్‌గా పేరు దక్కించుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలోనే యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌ దృష్టిలో పడటంతో పాటు, కరణ్ జోహార్ ఆశీర్వాదం సైతం ఈయనకు కలిసి వచ్చింది. మొదటి సినిమా 2010లో రాగా, ఆ వెంటనే 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహల్ సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సైతం రణ్వీర్‌ సింగ్‌కు నటుడిగా మంచి పేరును తెచ్చి పెట్టింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 2013లో లుటేరా, గోలియోం కీ రాస్లీలా రామ్-లీలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రణ్వీర్‌ సింగ్‌ నటించిన 'గల్లీ బాయ్‌' సినిమా భారీ విజయాన్ని తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో రణ్వీర్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, లవ్‌ స్టోరీస్‌ మాత్రమే కాకుండా సీరియస్‌ యాక్షన్ సినిమాలను సైతం రణ్వీర్‌ సింగ్ చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా రణ్వీర్‌ సింగ్‌ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించడంలో విఫలం అవుతున్నాడు. ఒక వైపు ఆయన భార్య దీపికా పదుకునే వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఉంటే, ఆయన మాత్రం సక్సెస్‌ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. గతంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రణ్వీర్‌ సింగ్‌ వరుస ఫ్లాప్స్ నేపథ్యంలో సినిమాల సంఖ్యను తగ్గించాడనే ప్రచారం జరుగుతోంది.

రణ్వీర్‌ సింగ్ పుట్టిన రోజు (జులై 6) సందర్భంగా ఆయన కెరీర్‌ గురించి సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. నాలుగు పదుల వయసులో అడుగు పెట్టిన రణ్వీర్‌ సింగ్ ఇకపై అయినా కథల ఎంపిక విషయంలో శ్రద్ద కనబర్చుతూ, తన నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఎలాంటి సినిమాను ఆశిస్తున్నారో గుర్తించి, అలాంటి సినిమాను చేయాల్సిన అవసరం ఉందంటూ సూచిస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద రణ్వీర్‌ సింగ్‌ సందడి చూసి చాలా కాలం అయింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మెల్ల మెల్గగా పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. కనుక రణ్వీర్ సింగ్‌ సైతం సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త పాటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రస్తుతం రణ్వీర్‌ సింగ్‌ 'ధురంధర్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు స్పీడ్‌గా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటన చేశారు. ఆదిత్య ధార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై రణ్వీర్‌ సింగ్‌ ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమాలో రణ్వీర్‌తో పాటు సంజయ్‌ దత్‌, మాధవన్‌, అక్షయ్‌ ఖన్నా, అర్జున్‌ రాంపాల్‌, సారా అర్జున్‌ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆదిత్య ధార్‌ గతంలో ఉరీ : ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రణ్వీర్‌ సింగ్‌ 'ధురంధర్‌' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టు సినిమా ఉంటుందా అనేది చూడాలి.