ఈగో ఇష్యూ: ఖాన్ తప్పును రిపీట్ చేయని తెలివైన హీరో
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఓవైపు దురంధర్ ఫ్రాంఛైజీ విజయాన్ని ఆస్వాధిస్తున్నా.. మరోవైపు ఎరక్కపోయి ఇరుక్కుపోయిన `కాంతర మిమిక్రీ కేసు` తీవ్ర మనోవేధనకు గురి చేస్తోంది.
By: Sivaji Kontham | 26 April 2026 11:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఓవైపు దురంధర్ ఫ్రాంఛైజీ విజయాన్ని ఆస్వాధిస్తున్నా.. మరోవైపు ఎరక్కపోయి ఇరుక్కుపోయిన `కాంతర మిమిక్రీ కేసు` తీవ్ర మనోవేధనకు గురి చేస్తోంది. `కాంతార` సినిమాలోని దైవాన్ని అనుకరిస్తూ చేసిన మిమిక్రీ అతడి మెడకు గుదిబండలా చిక్కుకుంది. ఈ కేసు అతడిని ప్రతిరోజూ వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం విచారణ కోర్టుల పరిధిలో ఉంది. అయితే ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఇప్పుడు రణ్ వీర్ ముంగిటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
గత ఏడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో రణవీర్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు శనివారం (25 ఏప్రిల్ 2026) రణవీర్ సమర్పించిన అఫిడవిట్‌ను ఆమోదించింది. మైసూర్ లోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి అక్కడ బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు రణ్ వీర్ సిద్ధమవ్వడం ఈ వివాదానికి ముగింపు పలికే దిశగా ఒక సానుకూల అడుగు.
నిజానికి ఇటువంటి సున్నితమైన విషయాల్లో సినీ తారల `ఈగో` (అహంకారం) తరచుగా పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంటుంది. ఇందుకు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసును ఒక ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల క్రితం జరిగిన ఆ ఘటనలో బిష్ణోయ్ కమ్యూనిటీ సల్మాన్‌కు ఒక ఆఫర్ ఇచ్చింది. తమ ఆరాధ్య దేవత వద్దకు వచ్చి క్షమాపణ కోరితే ఈ వివాదాన్ని ముగించేస్తామని ఆఫర్ చేసారు. కానీ సల్మాన్ .. అతడి తండ్రి సలీమ్ ఖాన్ అందుకు నిరాకరించడంతో అది నేడు లారెన్స్ బిష్ణోయ్ వంటి వారి నుండి ప్రాణాపాయ హెచ్చరికలు ఎదుర్కొనే స్థాయికి చేరుకుంది. కోర్టులు కూడా పరిష్కరించలేని ఈ మానసిక వేదనను సల్మాన్ ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు.
రణవీర్ సింగ్ కేసు అంత విస్త్రతమైనది కాదు.. సింపుల్ గా పరిష్కరించుకోదగ్గదే. ఈ కేసులో కూడా కర్ణాటక హైకోర్టు చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది మతపరమైన నమ్మకాలను కించపరిచేలా ఉండకూడదని జస్టిస్ ఎం. నాగప్రసన్న స్పష్టం చేశారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందిగా వచ్చిన డిమాండ్‌ను గౌరవించి.. రణవీర్ బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు అంగీకరించడం ఆహ్వానించదగ్గ పరిణామం. సల్మాన్ ఖాన్ లాగా మొండితనానికి పోకుండా.. ప్రజల సెంటిమెంట్లను గౌరవించడం రణవీర్ కెరీర్‌కు మేలు చేసే నిర్ణయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం భద్రతా పరమైన కారణాల దృష్ట్యా.. రణవీర్ ఎప్పుడు మైసూర్ సందర్శిస్తారనేది కచ్చితంగా వెల్లడించలేదు. అయితే నాలుగు వారాల వ్యవధిలో ఆయన చాముండి హిల్స్ చేరుకుని దేవత పాదాల వద్ద ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చని కోర్టు సూచించింది. ఫిర్యాదుదారు ప్రశాంత్ మెతల్ కూడా ఈ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తూ... మతం ఏదైనా `క్షమించడం` అనేది ఒక ప్రాథమిక సూత్రమని.. నటుడు తన తప్పును తెలుసుకుని సవరించుకుంటున్నప్పుడు ఇక శిక్ష అవసరం లేదని పేర్కొన్నారు. దీనివల్ల రణవీర్ చుట్టూ ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది.
ఏది ఏమైనా.. పబ్లిక్ లో ఉన్నపుడు సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపించింది. రణవీర్ సింగ్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని క్షమాపణ కోరడం ద్వారా.. అటు చట్టపరమైన కేసు నుండి .. ఇటు కర్ణాటక ప్రజల ఆగ్రహం నుండి బయటపడవచ్చు. సల్మాన్ ఖాన్ మాదిరిగా ఒక చిన్న పొరపాటును జీవితకాల శత్రుత్వంగా మార్చుకోకుండా.. వినయంతో వివాదాన్ని ముగించడం రణవీర్ తీసుకున్న వివేకవంతమైన నిర్ణయం. ఇది భవిష్యత్తులో ఇతర నటులకు కూడా ఒక గుణపాఠంగా నిలుస్తుంది.
