హైకోర్టులో చుక్కెదురు.. స్టార్ హీరోని వెంబడిస్తున్న 'కాంతార'
అయితే ఈ కేసును త్వరగా ముగించాలని రణ్ వీర్ కోరుకుంటున్నారు. అతడు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేసి కేసును త్వరగా ముగించాలని కోర్టును కోరగా దానికి ఊహించని విధంగా నిరాకరణ ఎదురైంది.
By: Sivaji Kontham | 23 Feb 2026 10:50 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. అతడు కన్నడ చిత్రం `కాంతార`లోని దైవిక పాత్రపై వెకిలిగా మిమిక్రీ చేయడంపై కన్నడ లాయర్ ఒకరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును త్వరగా ముగించాలని రణ్ వీర్ కోరుకుంటున్నారు. అతడు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేసి కేసును త్వరగా ముగించాలని కోర్టును కోరగా దానికి ఊహించని విధంగా నిరాకరణ ఎదురైంది.
ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. 2025 నవంబర్ 28న గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం (IFFI) ముగింపు వేడుకలో రణవీర్ సింగ్ పాల్గొన్నారు. స్టేజ్ పై `కాంతార`లో రిషబ్ శెట్టి నటనను మెచ్చుకుంటూ అందులోని దైవ నర్తన (దేవుని హావభావాలతో మిమిక్రీ)ను, హావభావాలను అనుకరించారు. ఈ క్రమంలో ఆయన దైవాలను `ఫీమేల్ ఘోస్ట్` అని పిలిచారని, తీర ప్రాంత కర్ణాటక ప్రజల మనోభావాలను, పవిత్రమైన భూతకోల సంప్రదాయాన్ని కించపరిచారని బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీనిపై బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసులు రణవీర్ సింగ్‌పై బీఎన్ఎస్ సెక్షన్లు 196, 299, 302 (మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, శత్రుత్వాన్ని పెంచడం) కింద కేసు నమోదు చేశారు.
అయితే రణవీర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదిస్తూ.. రణవీర్ సింగ్ ఒక నటుడిగా రిషబ్ శెట్టి నటనను మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలని మాత్రమే అలా చేశారని, ఆయనకు ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం లేకపోయినా కానీ ఆ ప్రశంసకు నేరపూరిత రంగు పులుముతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రణవీర్ ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారనే విషయాన్ని కోర్టుకు తెలిపారు.
ఈ కేసును త్వరగా విచారించాలని రణవీర్ న్యాయ బృందం కోరగా.. జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని బెంచ్ నిరాకరించింది. కేవలం బాలీవుడ్ నటుడు అయినంత మాత్రాన కేసును ప్రాధాన్యత క్రమంలో విచారించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 24 కి వాయిదా వేసింది.
ఈ వివాదం రణవీర్ సింగ్ త్వరలో నటించాల్సిన సినిమాలను ప్రభావితం చేస్తోందా? దురంధర్ 2 తర్వాతా అతడు వరుసగా భారీ చిత్రాలలో నటించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కోర్టు కేసులు షూటింగులకు సమస్యాత్మకంగా మారతాయని రణ్ వీర్ భావిస్తున్నాడా? .. కోర్టు తాజా తీర్పుతో చట్టం ఎవరికీ చుట్టం కాదని నిరూపణ అయినట్టేనా?.. వీటన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుంది.
