రూ.5 లక్షల బడ్జెట్‌తో రూ.1 కోటి ఆదాయం
ఇలాంటి సమయంలో కేవలం రూ.5 లక్షలతో రూపొందిన ఒక పాట ఏకంగా రూ.1 కోటికి పైగా సంపాదించి పెట్టిందంటే జానపదాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
By: Tupaki Desk | 10 July 2025 4:48 PM ISTసినిమాలకు కోట్ల బడ్జెట్ పెట్టి రిచ్‌గా నిర్మిస్తున్నా వచ్చే ఆధాయం లక్షల్లోనే ఉంటుంది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి, సినిమాల్లో చాలా తక్కువ శాతం హిట్‌ను అందుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం వందల కోట్ల బడ్జెట్‌తో రూపొంది కనీసం పదుల కోట్ల వసూళ్లు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం రూ.5 లక్షలతో రూపొందిన ఒక పాట ఏకంగా రూ.1 కోటికి పైగా సంపాదించి పెట్టిందంటే జానపదాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జనాలకు నచ్చితే ఏ స్థాయికి తీసుకు వెళ్తారు అనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో తెలంగాణ జానపదాలకు మంచి డిమాండ్ ఉంటుంది. లక్షల మంది చూస్తున్న పాటలను జనాలకు అందించేందుకు ఎంతో మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. గత నాలుగు ఐదు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున యూట్యూబ్ ద్వారా జానపద గీతాలు రావడం, వాటికి పదుల లక్షల వ్యూస్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, అమ్మ పాటలు, పల్లె పాటలు ఇలా రకరకాలుగా పాటలు వస్తున్నాయి. ఆ మధ్య బుల్లెట్ బండి పాట ఏ స్థాయిలో పాపులర్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత పల్సర్ బండి పాట, ఓ పిలగ వెంకటేశు ఇలా ఎన్నో పాటలు యూట్యూబ్‌లో భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
గత రెండు మూడు నెలలుగా యూట్యూబ్‌లోనే కాకుండా ఎక్కడ చూసినా కనిపిస్తున్న పాట రాను బొంబాయ్ కి రాను. ఈ పాట ప్రతి పెళ్లిలో, ప్రతి ఈవెంట్‌లో సందడి చేస్తూనే ఉంది. ఏకంగా బాలీవుడ్ పాపులర్ టీవీ షోలో కూడా ఈ పాటను ప్లే చేసి సెలబ్రిటీలు డాన్స్ చేయడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాను బొంబాయ్ కి రాను పాట తెగ వైరల్ అయింది. దాంతో యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా 400 మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టింది. ఈ పాటను పాడింది రాము రాథోడ్. ఈ పాటలో డాన్స్ చేసింది కూడా రాము రాథోడ్. అతడితో పాటు లిఖిత ఈ పాటలో కనిపించింది. ఇద్దరి డాన్స్‌కి ప్రతి ఒక్కరూ ఫిదా కావడంతో ఇంతటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ఈ స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకున్న తెలుగు పాటగా రాను బొంబాయికి రాను నిలిచింది. ఏకంగా 40 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ పాటను కేవలం ఒక్క రోజులో అది కూడా రూ.5 లక్షల బడ్జెట్‌తో రూపొందించినట్లుగా సింగర్ కమ్ డాన్సర్ రాము రాథోడ్ చెప్పుకొచ్చాడు. ఆ పాటతో ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. అంతే కాకుండా పాటతో యూట్యూబ్ ద్వారా దాదాపుగా రూ.కోటి ఆదాయం వచ్చినట్లు రాము రాథోడ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. లక్షలు ఖర్చు చేసి ట్యూన్ చేసి, కోట్లు ఖర్చు చేసి తీసిన పాటలకు వచ్చే ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. కానీ 5 లక్షలతో తీసిన పాటకు రూ.కోటి రావడం అంటే ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ముందు ముందు ఈ పాట వెయ్యి మిలియన్‌లను చేరినా ఆశ్చర్యం లేదని యూట్యూబ్ పరిశీలకులు అంటున్నారు.
