Begin typing your search above and press return to search.

మల్టీప్లెక్స్‌లకు టఫ్ ఫైట్.. జీడిమెట్లలో రాబోతున్న వరల్డ్ క్లాస్ థియేటర్!

హైదరాబాద్ నగరం వేగంగా మల్టీప్లెక్స్ కల్చర్ వైపు పయనిస్తున్న ఈ సమయంలో, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కొత్త ప్రాణం పోసే ప్రయత్నాలు కూడా సమాంతరంగా సాగుతున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 April 2026 3:50 PM IST
మల్టీప్లెక్స్‌లకు టఫ్ ఫైట్.. జీడిమెట్లలో రాబోతున్న వరల్డ్ క్లాస్ థియేటర్!
X

హైదరాబాద్ నగరం వేగంగా మల్టీప్లెక్స్ కల్చర్ వైపు పయనిస్తున్న ఈ సమయంలో, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కొత్త ప్రాణం పోసే ప్రయత్నాలు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు టెక్నాలజీ అప్‌గ్రేడ్స్ మల్టీప్లెక్స్‌లకే పరిమితమై ఉండగా, ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లలో కూడా వరల్డ్ క్లాస్ అనుభవాన్ని అందించాలనే దిశగా ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైత్రి సంస్థ చేపడుతున్న థియేటర్ ఆధునీకరణ ప్రాజెక్టులు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తున్నాయి.

జీడిమెట్ల ప్రాంతంలో ఉన్న రంగా థియేటర్‌ను మైత్రి సంస్థ తన ఆధ్వర్యంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో రెనోవేష‌న్ కు చేపట్టడం ఈ మార్పుకు కీలక ఉదాహరణగా నిలుస్తోంది. సుమారు 600కి పైగా సీట్లతో రూపొందుతున్న ఈ థియేటర్‌లో అత్యాధునిక డాల్బీ సినిమా సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలన్న యోచన, సింగిల్ స్క్రీన్ రంగంలోనే కొత్త ప్రమాణాలను సృష్టించబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు అత్యున్నత సౌండ్ మరియు విజువల్ అనుభవం మల్టీప్లెక్స్‌లలోనే అందుబాటులో ఉండగా, అదే స్థాయిని ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక మైత్రి సంస్థ గతంలో బాలనగర్‌లో అభివృద్ధి చేసిన విమల్ థియేటర్ ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యుత్తమ సింగిల్ స్క్రీన్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు రంగా థియేటర్ ప్రాజెక్ట్‌పై దాదాపు రెట్టింపు పెట్టుబడి పెట్టడం, ఈ రంగంపై సంస్థకు ఉన్న విశ్వాసాన్ని చూపుతోంది. అంతేకాదు, ఇంటీరియర్స్ నుంచి సీటింగ్ వరకు ప్రతి అంశంలో ప్రీమియం అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. పార్కింగ్ సౌకర్యాలు, ఫుడ్ అండ్ బేవరేజ్ కౌంటర్లు వంటి అంశాలను కూడా విస్తృతంగా ప్లాన్ చేయడం, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను టార్గెట్ గా పెట్టుకున్న వ్యూహంగా భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, జీడిమెట్ల ప‌రిస‌ర ప్రాంతాల్లో నివసించే సినీప్రియులకు ఇది పెద్ద వరంగా మారనుంది. ఇప్పటివరకు మంచి థియేటర్ అనుభవం కోసం సిటీ సెంటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడ‌దే స్థాయి అనుభవం సమీపంలోనే లభించే అవకాశం కలుగుతోంది. ఇది కేవలం ఒక థియేటర్ అప్‌గ్రేడ్ మాత్రమే కాకుండా, నగర పరిసర ప్రాంతాల్లో సినిమా వీక్షణ సంస్కృతిని మరింత విస్తరించే ప్రయత్నంగా చూడవచ్చు.

అదే సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని గంగా థియేటర్‌ను కూడా మైత్రి సంస్థ రెనోవేట్ చేస్తుండ‌టం గమనార్హం. ఇది బాలనగర్‌లోని విమల్ థియేటర్ తరహాలోనే రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా నగరంలోని విభిన్న ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్‌లను రెనోవేట్ చేయ‌డం ద్వారా, మైత్రి సంస్థ ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి, హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇదొక కొత్త దశ ఆరంభం. టెక్నాలజీ, సౌకర్యాలు, ప్రేక్షక అనుభవం అన్న మూడు అంశాలను సమన్వయం చేస్తూ వస్తున్న ఈ మార్పులు, రాబోయే రోజుల్లో సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.