నేటి తరం సినిమాలపై నటుడు సెటైర్!
బాలీవుడ్ విలక్షణ నటుడు రణదీప్ ముక్కు సూటి తత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 15 May 2026 11:00 PM ISTబాలీవుడ్ విలక్షణ నటుడు రణదీప్ ముక్కు సూటి తత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు. తాను ఏది అనుకున్నా? నిర్భయంగా మాట్లాడుతాడు. ఆరకంగా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. నేటి తరం యాక్షన్ సినిమాలపై రణదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సినిమాల్లో సాంకేతికత పెరిగినా? భావోద్వేగాలు కరువయ్యాయని అభిప్రాయపడ్డారు. సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ , భారీ స్టంట్లు ఉంటే సరిపోదని ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా ఎమోషన్ లేకపోతే ఎంతటి భారీ యాక్షన్ సీక్వెన్స్ అయినా ? బోరింగ్‌గా అనిపిస్తుందని విశ్లేషించారు.
`పాతకాలపు సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు కథలో అంతర్భాగంగా ఉండేవి. హీరో ఎందుకు కొడుతున్నాడు? ఆ పోరాటం వెనుక ఉన్న బాధ లేదా కోపం ఏంటి? అనేది ప్రేక్షకుడికి అర్థమయ్యేది. కానీ ఇప్పుడు ఒక స్పెక్టకల్ లా చూపించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దీనివల్ల ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ కాలేకపోతున్నారని పేర్కొన్నారు. బాడీ బిల్డింగ్ , భారీ పేలుళ్లతో సినిమాను నడిపించలేమని కుండబద్దలు కొట్టారు. తాను నటించిన `ఇన్‌స్పెక్టర్ అవినాష్` వంటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. `అందులో యాక్షన్ అనేది ఫైట్ల కోసం ఉండదన్నారు.
అది పాత్ర ప్రయాణంలో భాగమన్నారు. ఒక నటుడిగా తనకు శారీరక శ్రమ కంటే? ఆ సన్నివేశంలో ఉన్న భావోద్వేగాన్ని పండించడమే ముఖ్యమన్నారు. నేటి దర్శకులు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు స్టైల్ మీద కాకుండా సబ్‌స్టాన్స్ మీద దృష్టి పెట్టాలని సూచించారు. సినిమా రంగంలో వస్తోన్న మార్పులను గమనిస్తే? భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నా? అవి క్లాసిక్స్‌గా నిలబడలేకపోతున్నాయన్నారు. దానికి ప్రధాన కారణం కథలో ఆత్మ లేకపోవడమే అంటున్నారు. `యాక్షన్ అనేది ఒక భాష కావాలి. అది కేవలం శబ్దం మాత్రమే కాకూడదు` అని రణదీప్ లోతైన విశ్లేషణ చేశారు.
నటీనటులు కూడా జిమ్ వర్కవుట్లకే పరిమితం కాకుండా పాత్రలోని లోతును అర్థం చేసుకోవాలని కోరారు. రణదీప్ హుడా రియలిస్టిక్ పాత్రలకు పెట్టింది పేరు. `సరబ్‌జిత్`, `స్వతంత్ర వీర సావర్కర్` వంటి చిత్రాల కోసం ఆయన పడ్డ శ్రమ అందరికీ తెలిసిందే. ఆయన కెరీర్‌లో ఎప్పుడూ కమర్షియల్ హంగుల కంటే పాత్రకు ఇచ్చే ప్రాముఖ్యతకే విలువ ఇస్తానని పునరుద్ఘాటించారు. భారీ యాక్షన్ సినిమాల మధ్యలో చిన్నపాటి ఎమోషన్ ఉన్న సినిమాలు కూడా అద్భుతాలు సృష్టించగలవని నమ్ముతున్నారు.
కొంత కాలంగా బాలీవుడ్ సినిమాల్లో ప్రధానంగా ఎమోషన్ మిస్ అవుతుందనే ఆరోపణలున్నాయి. అమితాబచ్చన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు కూడా రచయితలంతా ఎమోషన్ పై దృష్టి పెట్టాలని, కంటెంట్ ను ఆ రకంగా ప్రేక్షకులకు దగ్గర చేయాలని సూచించారు. ఈ విషయంలో అవసరమైతే తెలుగు సినిమాల్ని నిశితంగా పరిశీలించాలని సూచించిన సంగతి తెలిసిందే.
