జై శ్రీరామ్: 92 ఏళ్ల క్రితం ముత్తాత.. ఇప్పుడు మునిమనవడు!
భారతీయ సినిమా చరిత్రలో కపూర్ ఖాందాన్ కు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే.
By: Sivaji Kontham | 3 April 2026 12:49 AM ISTభారతీయ సినిమా చరిత్రలో కపూర్ ఖాందాన్ కు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రణబీర్ కపూర్ `రామాయణం` చిత్రంలో శ్రీరాముడి పాత్ర పోషిస్తుండటంతో ఒక అరుదైన, చారిత్రాత్మక అనుబంధం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 92 ఏళ్ల క్రితం రణబీర్ ముత్తాత, లెజెండరీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ కూడా వెండితెరపై శ్రీరాముడి పాత్రలో మెరిశారు. ఇంతకాలానికి కపూర్ కుటుంబంలో మూడో తరం కుర్రాడు శ్రీరాముడిగా నటించడం యాథృచ్ఛికం. ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల నటులు దశాబ్దాల వ్యవధిలో ఒకే పవిత్రమైన పాత్రను పోషించడం భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది.
1934లో విడుదలైన `సీతా` అనే హిందీ చిత్రంలో పృథ్వీరాజ్ కపూర్ శ్రీరాముడిగా కనిపించారు. ఆ కాలపు ప్రసిద్ధ దర్శకుడు దేవకీ బోస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సీతమ్మ తల్లి పాత్రను ప్రముఖ నటి దుర్గా ఖోటే పోషించారు. భారతీయ సినిమా పునాదులు పడుతున్న ఆ రోజుల్లోనే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గౌరవ డిప్లొమా పొందిన మొదటి భారతీయ టాకీ చిత్రంగా `సీతా` సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆనాడు పృథ్వీరాజ్ కపూర్ పోషించిన ఆ పాత్ర అప్పట్లో ఒక పెద్ద సంచలనం.
నాటి బ్లాక్ అండ్ వైట్ యుగంలో పృథ్వీరాజ్ కపూర్ తన 20వ ఏటనే రాముడి పాత్రను అత్యంత గంభీరంగా పోషించారు. ఇప్పుడు రణబీర్ కపూర్ తన 40 ఏళ్ల వయస్సులో అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) ..ఆధునిక సాంకేతికతతో అదే పాత్రను మళ్ళీ వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ముత్తాత కాలంలో ఉన్న నిరాడంబరత, నేటి తరం మేకింగ్ హంగులు కలిసినా.. రాముడి పాత్రలో ఉండాల్సిన ఆ ప్రశాంతత- దైవత్వం రణబీర్‌లోనూ కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ కపూర్ రాముడి గెటప్‌లో ఉన్న ఫోటోలును.. రణబీర్ తాజా టీజర్ ఫోటోలతో పోలుస్తూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. కపూర్ కుటుంబం తరతరాలుగా భారతీయ పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలకు ప్రాణం పోస్తోందని ఈ ఉదాహరణ మరోసారి నిరూపిస్తోంది. ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ లాగే రణబీర్ కూడా ఈ పాత్ర కోసం అత్యంత ఉత్తముడిగా మారి క్రమశిక్షణను పాటిస్తూ.. తన ముత్తాత వారసత్వాన్ని సగర్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రణ్ బీర్ కపూర్ తన పాత్ర కోసం మద్యం, మాంసం మానేసాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అతడు పూర్తి ఆధ్యాత్మికతతో ఉన్నాడు.
ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ కపూర్ కుటుంబం నుండే రాముడి పాత్రకు ఎంపిక జరగడం ఒక అపురూపమైన కాకతాళీయమైన విషయంగా ట్రేడ్ వర్గాలు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 92 ఏళ్ల క్రితం నాటి ఆ సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి అందించే బాధ్యతను రణబీర్ తన భుజాన వేసుకున్నారు. ఈ చారిత్రక అనుబంధం `రామాయణ` చిత్రంపై అంచనాలను మరింతగా పెంచడమే కాకుండా, కపూర్ కుటుంబ గౌరవాన్ని మరో స్థాయికి తీసుకెళుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
