విజయ్ దేవరకొండ 'రణబాలి' టీజర్.. ఊచకోతలో ఓ ట్విస్ట్
Ranabaali Teaser
By: Tupaki Desk | 9 Sept 2026 5:29 PM ISTవిజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'టాక్సీవాలా' మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఏకంగా బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ కథతో వస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా 'రణబాలి'. ఇక ఫస్ట్ లుక్ నుంచే క్యూరియాసిటి క్రియేట్ చేస్తున్న టీజర్ వచ్చేసింది. సీన్స్ చూస్తే విజయ్ తన లవర్ బాయ్ ఇమేజ్‌ను పూర్తిగా చెరిపేసుకుని, ఒక రా అండ్ రస్టిక్ వారియర్‌గా కనిపించి సర్ప్రైజ్ చేశారు.
1876-78 నాటి గ్రేట్ మద్రాస్ ప్రెసిడెన్సీ కరువు నేపథ్యంలో 80 లక్షల మంది భారతీయులు ఆకలితో చనిపోయిన దారుణమైన రోజులను టీజర్ ఆరంభంలో చూపించారు. అన్నపూర్ణ లాంటి దేశంలో గింజల కోసం ప్రజలు అల్లాడుతుంటే, బ్రిటీష్ పాలకులు చేసే అకృత్యాలు కంటతడి పెట్టించే ఎమోషన్‌ను క్రియేట్ చేశాయి. ఆకలి కేకలు, ఎండిపోయిన మట్టి నేలల విజువల్స్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా డిజైన్ చేశారు.
ఈ అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తిన యోధుడిగా 'సింగనమల బొబ్బిలి రణబాలి' పాత్రలో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చారు. ఒంటినిండా రక్తపు చారలు, చేతిలో పెద్ద కొడవలి పట్టుకుని గుర్రంపై వచ్చే షాట్స్, బ్రిటీష్ సైన్యంపై విరుచుకుపడే విధానం మాస్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. రాయలసీమ యాసలో "నేను కాయలి కాసాండంగా ఒక్క మెతుకు కూడా పొలిమేర దాటదబ్బా" అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ డెలివరీ ఇంటెన్స్‌గా కుదిరింది.
విజువల్స్ పరంగా సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా, డస్టీ టోన్‌తో పీరియాడిక్ ఫీల్‌ను పర్ఫెక్ట్‌గా రీక్రియేట్ చేసింది. దానికి తోడు అజయ్ అతుల్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఆక్రోశాన్ని, ఎమోషన్‌ను అమాంతం పెంచేసింది. హీరోయిన్ రష్మిక మందన్న ఒక భావోద్వేగ సన్నివేశంలో కనిపించి ఆకట్టుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ స్కేల్, రాహుల్ సాంకృత్యన్ విజన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీగా హైలెట్ అయ్యాయి. గతంలో వచ్చిన రొటీన్ ఫార్ములా కాకుండా, చరిత్రలోని ఒక బలమైన విషాదాన్ని, దానిపై జరిగిన తిరుగుబాటును ఎంచుకోవడం ఈ ప్రాజెక్ట్‌కి అసలు బలం. విజయ్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అత్యంత వయోలెంట్, పవర్‌ఫుల్ అవతారంలో మెప్పించారు.
ఇక టీజర్ చివరలో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఒక చేయి వచ్చి విజయ్ పెట్టిన చిన్న కుండను తీసుకోవడం చూస్తుంటే డైరెక్టర్ మార్క్ అనిపిస్తోంది. గతంలో రాహుల్ సినిమాలలో మిస్టరీ ఎలిమెంట్స్ హైలెట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ కథకు ఏదో మ్యాజిక్ ట్విస్ట్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. టీజర్ అయితే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. కంటెంట్, ఇంటెన్సిటీ రెండూ పక్కాగా బ్యాలెన్స్ అయిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ టీజర్‌తో విజయ్ దేవరకొండ సరైన సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.
