Begin typing your search above and press return to search.

'రణబాలి' మూవీ రివ్యూ

విజయ్ కి ఇంతకుముందు ‘ట్యాక్సీవాలా’ రూపంలో హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్ ఈ చిత్ర దర్శకుడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రణబాలి’ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

By:  Tupaki Desk   |   16 Oct 2026 1:11 PM IST
రణబాలి మూవీ రివ్యూ
X

‘రణబాలి’ మూవీ రివ్యూ

నటీనటులు: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా- ఆర్నాల్డ్ ఓస్లూ- ఈశ్వరీ రావు-లాల్ తదితరులు

సంగీతం: అజయ్- అతుల్

ఛాయాగ్రహణం: జిష్ణు భట్టాచార్జీ- నిరవ్ షా

రచన: రాహుల్ సంకృత్యన్- ప్రమోద్ తమ్మినేని

నిర్మాతలు: నవీన్ యెర్నేని- యలమంచిలి రవిశంకర్

దర్శకత్వం: రాహుల్ సంకృత్యన్

కెరీర్ ఆరంభంలో తిరుగులేని విజయాలందుకున్న విజయ్ దేవరకొండ.. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కింగ్డమ్’ కూడా నిరాశపరిచింది. ఇప్పుడతను ‘రణబాలి’ అవతారం ఎత్తాడు. విజయ్ కి ఇంతకుముందు ‘ట్యాక్సీవాలా’ రూపంలో హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్ ఈ చిత్ర దర్శకుడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రణబాలి’ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:


ఇండియా బ్రిటిష్ పాలనలో ఉండగా 1880-1900 ప్రాంతంలో మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉన్న రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడుతుంటుంది. అసలే జనం తిండి దొరక్క కష్టపడుతుంటే.. ఈ ప్రాంతానికి కొత్త కమిషనర్ గా నియమితుడైన హెక్టార్ దొర (ఆర్నాల్డ్ ఒస్లూ) జనాలను మరింతగా పీడించడం మొదలుపెడతాడు. ఈ ప్రాంతంలో పండే ధాన్యంలో చాలా వరకు పన్ను కింద వసూలు చేయిస్తూ.. జనాలకు నరకం చూపిస్తాడు. ఒకవైపు కరవు.. ఇంకోవైపు హెక్టార్ పెట్టే హింసతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతుంటారు. ఆ పరిస్థితుల్లో రణబాలి (విజయ్ దేవరకొండ) తన ప్రాంత ప్రజల కోసం తిరుగుబాటు మొదలుపెడతాడు. ఈ క్రమంలో రణబాలికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. తన పోరాటంలో ఎంతమేర విజయం సాధించాడు.. సీమ ప్రజల కష్టాలు తీరాయా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:


నిన్ననే ‘జైలర్-2’ సినిమా రిలీజైంది. అందులో పెద్దగా కథేమీ లేదు. ఏమాత్రం కొత్తదనం కనిపించదు. అయినా సరే అలవాటైన సన్నివేశాలకే అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఇంకోవైపు అనిరుధ్ రవిచందర్ సాధారణ సన్నివేశాలను కూడా తన బీజీఎంతో పైకి లేపాడు. ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతున్న ఫీలింగ్ కలిగించడంలో టేకింగ్.. బీజీఎం ఎలాంటి పాత్ర పోషిస్తాయో చెప్పడానికి ‘జైలర్’ సినిమా ఉదాహరణ. ‘రణబాలి’ సినిమా విషయంలో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. ఇందులో ఒక మంచి కథ ఉంది. మరుగున పడిన చరిత్రను శోధించి చెప్పిన సంచలన విషయాలున్నాయి. ఒక అద్భుతమైన సినిమాగా మారడానికి అవసరమైన ముడిసరుకు అంతా ఇందులో ఉంది. కానీ ఈ కథను చెప్పిన శైలిలో లోపం వల్ల.. ఏమాత్రం ఇంపాక్ట్ కలిగించని బీజీఎం వల్ల.. అనుభూతి దెబ్బతిని ‘రణబాలి’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా తయారైంది. కథలో కంటెంట్ ఉన్నా.. కొన్ని స్టాండౌట్ ఎపిసోడ్లు పడ్డా.. విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జోడీ మురిపించినా.. స్లో నరేషన్ పెద్ద సమస్యగా మారి.. కీలక సన్నివేశాలు ఇంపాక్ట్ కలిగించక ‘రణబాలి’ ఇవ్వాాల్సిన అనుభూతిని ఇవ్వలేకపోయింది.

ఓవైపు తీవ్రమైన కరవు.. ఇంకోవైపు పన్ను పేరుతో ఉన్న కాస్త తిండి గింజల్ని కూడా లాక్కునే బ్రిటిష్ ప్రభుత్వం.. ఆకలి వల్ల లక్షల మంది చనిపోతున్న దుర్భర పరిస్థితుల్లో విదేశాలకు తరలిపోతున్న ధాన్యాన్ని కొల్లగొట్టి జనాలకు పంచే యోధుడి కథ ఇది. లైన్ పరంగా చూస్తే దీనికి కావాల్సినంత పొటెన్షియాలిటీ ఉంది. చరిత్రను శోధించి ఇలాంటి కథను తయారు చేయడంలో రాహుల్ సంకృత్యన్ అభిరుచిని.. కష్టాన్ని మెచ్చుకోవాలి. కాకపోతే ఇదే కథను రాజమౌళి లాంటి దర్శకుడి చేతికి అప్పగిస్తే.. ప్రేక్షకులను ఉర్రూతలూగించేసేవాడేమో అనిపిస్తుంది. కానీ బెంగాలీ సినిమాల ప్రభావం బాగా ఉన్న రాహుల్ సంకృత్యన్ దీన్నొక ఆర్ట్ సినిమాలా తీర్చిదిద్దడమే ‘రణబాలి’కి సమస్యగా మారింది. కొన్ని సన్నివేశాలను హృద్యంగా తీసినప్పటికీ.. కొన్నిచోట్ల ఎమోషన్ రాబట్టినప్పటికీ.. డల్ నరేషన్ తో అతను బాాగా పేలాల్సిన ఎపిసోడ్లలో కూడా ఇంపాక్ట్ తీసుకురాలేకపోయాడు. ఒక సన్నివేశంలో తమ ఊరి మీద పడ్డ బ్రిటిష్ సైనికాధికారుల ప్యాంట్లు విప్పి కారం కూరుతుంది రణబాలి బృందం. థియేటర్లు హోరెత్తిపోవాల్సిన ఈ సన్నివేశాన్ని చాలా సింపుల్ గా లాగించేయడం.. కనీసం ఆ తర్వాత దానికి ఒక ఫాలో అప్ సీన్ కూడా పెట్టకపోవడం.. సినిమా తాలూకు వాణిజ్య ప్రయోజనాన్నినెరవేర్చడంలో రాహుల్ సంకృత్యన్ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది.

హీరో వీరత్వాన్ని చూపించే ఆరంభ సన్నివేశంలోనే ‘రణబాలి’ సరైన ఇంపాక్ట్ చూపించలేకపోయింది. హీరో చేతిలో చనిపోయే వ్యక్తి మీద సానుభూతి కలిగేలా ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దడం బ్యాడ్ ఛాయిస్. దీని వల్ల రణబాలి పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేని పరిస్థితి తలెత్తుతుంది. దీనికి కొనసాగింపుగా వచ్చే సన్నివేశాలు కూడా పెద్దగా పండలేదు. ఐతే జయమ్మగా రష్మిక మందన్నా పాత్ర ప్రవేశించాక కథలో ఊపు వస్తుంది. అయిష్టతతో మొదలయ్యే బంధం ప్రేమపూర్వకంగా మారే క్రమాన్ని దర్శకుడు బాగా చూపించాడు. మరోవైపు బ్రిటిష్ కమిషనర్ హెక్టార్ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలను.. కరవు కష్టాలను కూడా బాగా చూపించాడు. బ్రిటిష్ సైన్యం మీద రణబాలి తొలిసారి తిరగబడే ఎపిసోడ్ ను కూడా బాగా తీర్చిదిద్దారు. కాకపోతే అడ్రినలిన్ రష్ రావాల్సిన సన్నివేశాలు ఒక మోస్తరు స్థాయిలో నిలిచిపోవడానికి ఇంపాక్ట్ లేని బీజీఎం కారణమైంది. రణబాలి తన విశ్వరూపాన్ని చూపిస్తుంటే.. బ్యాగ్రౌండ్లో వచ్చే పాట.. స్కోర్ నీరసం తెప్పిస్తుంటాయి. సన్నివేశంలో ఇంపాక్ట్ ను పెంచకపోగా.. సగానికి సగం తగ్గించేసింది సంగీతం. అయినప్పటికీ ఫస్టాఫ్ వరకు ‘రణబాలి’ ఓకే అనిపిస్తుంది.

మంచి ఊపుతెచ్చే ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్ధం ఆ టెంపోను కొనసాగించలేక.. ఎటో వెళ్లిపోతుంది. మరీ నెమ్మదించే నరేషన్.. సన్నివేశాల మధ్య కనెక్షన్ సరిగా కుదరకపోవడం.. ఎమోషన్ పండకపోవడంతో ‘రణబాలి’ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతుంది. కరవుకు సంబంధించిన సన్నివేశాలు హృద్యంగా ఉన్నప్పటికీ.. వీఎఫెక్స్ లోపాల వల్ల ఆ సీన్లు కొంచెం కృత్రిమంగా అనిపిస్తాయి. తెర మీద అంత బాధను చూసి తట్టుకోవడం కూడా కష్టమే. కథలో తీవ్రతను పెంచుదామని.. ఎమోషన్ బాగా పిండేద్దామని రష్మిక పాత్రకు అదో రకమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. కానీ ఆ సన్నివేశాన్ని చూసి తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఐతే గుహలో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ మాత్రం బాగా పేలింది. అలాగే ‘కరుప్పు’ సినిమా క్లైమాక్సును గుర్తుకు తెచ్చేలా మంచి హై ఇచ్చేలా ముగింపు సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. ఐతే క్లైమాక్స్ బాగున్నప్పటికీ.. స్లో నరేషన్- సుదీర్ఘ నిడివి అప్పటికే ప్రేక్షకుల సహనం అడుగంటిపోయి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ‘రణబాలి’ విషయం ఉన్న సినిమానే. టీం పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. ఇందులో కొన్ని ఎంగేజింగ్ ఎపిసోడ్లు ఉన్నాయి. కానీ ఎమోషన్ సరిగ్గా కుదరకపోవడం.. డల్ నరేషన్.. బీజీఎం ఇంపాక్ట్ లేకపోవడం వల్ల సినిమా అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయింది.

నటీనటులు:


రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోవడానికి చాలానే కష్టపడ్డాడు. పాత్ర తాలూకు పౌరుషాన్ని సరిగ్గానే చూపించాడు. రాయలసీమ స్లాంగ్ కూడా బాగానే కుదిరింది. రణబాలి ఆవేశాన్ని, వీరత్వాన్ని చూపించే సన్నివేశాల్లో విజయ్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. కానీ కొన్నిచోట్ల మాత్రం తన నటన ఓవర్ ద బోర్డ్ వెళ్లినట్లు అనిపిస్తుంది. స్లాంగ్ కూడా కొంచెం అటు ఇటు అయింది. రష్మిక మందన్నా జయమ్మ పాత్రలో చాాలా బాగా నటించింది. తన లుక్ అదిరిపోయింది. విజయ్ తో తన కెమిస్ట్రీ బాగా కుదిరింది. హెక్టార్ పాత్రలో ‘ది మమ్మీ’ ఫేమ్ ఆస్కార్ ఒస్లూ ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించాడు. లాల్.. ఈశ్వరీ రావుతో పాటు ముఖ్య పాత్రధారులందరూ తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

‘రణబాలి’ని మైత్రి సంస్థ అత్యున్నత ప్రమాణాలతో నిర్మించింది. 1900కు పూర్వం వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ఖర్చుకు తోడు ప్యాషన్ కూడా ఉంటేనే ఇలాంటి ఔట్ పుట్ వస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. కానీ కొన్ని చోట్ల వీఎఫెక్స్ మాత్రం సరిగా కుదరలేదు. ఇద్దరు కెమెరామెన్లు జిష్ణు భట్టాచార్జీ.. నిరవ్ షా మంచి పనితనం చూపించారు. అజయ్-అతుల్ ‘ఏందయ్య స్వామీ’ పాటతో మంచి నైపుణ్యం చూపించినా.. మిగతా పాటలు మామూలుగా అనిపిస్తాయి. బీజీఎం అయితే సినిమాకు పెద్ద మైనస్ అయింది. ప్రమోద్ తమ్మినేనితో కలిసి రాహుల్ సంకృత్యన్ సమకూర్చిన స్క్రిప్టులో విషయం ఉంది. కానీ రాహుల్ ఈ కథను చెప్పిన విధానం జనరంజకంగా లేకపోయింది. కొన్ని చోట్ల తన అభిరుచిని చాటినా.. ఆసక్తి పెంచని స్క్రీన్ ప్లే.. డల్ నరేషన్ తో సినిమా ప్రభావాన్ని తగ్గించేశాడు.

చివరగా: రణబాలి.. ఎఫర్ట్ ఉంది.. ఎఫెక్ట్ తగ్గింది

రేటింగ్ - 2.5/5