Begin typing your search above and press return to search.

కొత్తపల్లిలో ఒకప్పుడు.. మరో ప్రయోగానికి అండగా రానా..

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ వెనుకాడని హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   16 July 2025 11:02 AM IST
కొత్తపల్లిలో ఒకప్పుడు.. మరో ప్రయోగానికి అండగా రానా..
X

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ వెనుకాడని హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నాడు. అలాగే కంటెంట్ కు ప్రాధాన్యమున్న సినిమాలను ప్రోత్సహించడంలో ముందు వరుసలో నిలుస్తున్నారు. ఇప్పటికే ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ సినిమాకు సపోర్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాతో పాటు ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన పరుచూరి ప్రవీణా దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం కోత్తపల్లిలో ఒకప్పుడు త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సినిమాను రానా తన 'స్పిరిట్ మీడియా' ద్వారా సమర్పిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి. నిజమైన గ్రామీణ వాతావరణంలో నడిచే కథ, సరదా పంథాలో సాగుతుంది. సినిమాకు సంబంధించిన ప్రెస్ ప్రీమియర్‌ను విడుదలకి మూడురోజుల ముందు నిర్వహించారు. ఈ ప్రీమియర్‌కి హాజరైన ప్రతీ ఒక్కరూ సినిమా పట్ల మంచి అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ప్రవీణా దర్శకురాలిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నా, ఆమె తెరకెక్కించిన కథనం పట్ల ప్రెస్ ప్రీమియర్‌కి హాజరైనవారు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామీణ నేపథ్యంలో ఓ చక్కటి కథను స్వచ్ఛమైన కామెడీ, నిజమైన పాత్రలతో తీసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా నటులు మహేష్ చంద్ర, బెనర్జీ, రవీంద్ర విజయ్ లు పోషించిన పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు.

దర్శకురాలు ప్రవీణా మాట్లాడుతూ, ‘‘మనిషి విశ్వాసం జీవితాన్ని ఎంత మారుస్తుందో చూపించాలనుకున్నాం. సెటైరికల్ టోన్‌లో సినిమాను కథనం చేయాలనుకున్నాం. అంతేగానీ ఒక మెసేజ్ సినిమాగా కాకుండా, సరదాగా సాగుతూ గమనిస్తే జీవితంలో ఏదైనా మార్చుకోవచ్చు అనే నమ్మకం ఇవ్వాలనేది మా లక్ష్యం’’ అన్నారు.

ఈ సినిమా గురించి రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ‘‘ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలంటే సరైన సపోర్ట్ ఇచ్చే బాధ్యత మాకుంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా ప్రీమియర్ ఏర్పాటు చేశాం. సినిమా హృదయాన్ని తాకేలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇందులో పాత్రలతో కనెక్ట్ అవుతారు. కొత్త దృక్కోణాల్ని స్వీకరించాలి, ప్రేక్షకులే ఈ ప్రయాణానికి బలం ఇవ్వాలి’’ అని చెప్పారు. జూలై 18న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకానుంది. ప్రజలు ఇలాంటి వినూత్న, నిజమైన కథలను ఆదరిస్తే, మరిన్ని మంచి సినిమాలు వస్తాయని చిత్రబృందం ఆశిస్తోంది.