బాబాయ్‌ని తిడుతున్నానని అనుకోలేదు:రానా
బాబాయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా తొలి సారి కలిసి నటించిన వెబ్ సిరీస్ `రానా నాయుడు`. దీనికి సీక్వెల్‌గా `రానా నాయుడు 2`ని రూపొందించారు.
By: Tupaki Desk | 12 Jun 2025 12:04 PM ISTబాబాయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా తొలి సారి కలిసి నటించిన వెబ్ సిరీస్ `రానా నాయుడు`. దీనికి సీక్వెల్‌గా `రానా నాయుడు 2`ని రూపొందించారు. ఈ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో రానా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వివిధ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ రానా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ముఖ్యంగా సిరీస్‌లో వెంకటేష్‌ని అసభ్య పదజాలంతో దూషించడంపై స్పందించారు. `హిందీ భాషలో నాకు కొన్ని పదాలకు సరైన అర్థం తెలియదు. పార్ట్ 1 కోసం హిందీ డబ్బింగ్ చెబుతున్నప్పుడు వాటిని కేవలం డైలాగ్స్ మాదిరిగానే చూశాను. బాబాయ్‌ని తిడుతున్నానని అనుకోలేదు. కానీ తెలుగు డబ్బింగ్‌కు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డా. కొన్ని డైలాగ్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఈ డైలాగ్స్ ఎలా చెప్పాలి? అని ఆలోచించా. నటీనటులుగా ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఇలాంటివి చేయక తప్పదని అర్థం చేసుకున్నా` అన్నారు.
నటుడిగా నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం తప్పకుండా బాబాయ్‌తో కలిసి వర్క్ చేయాలని కలలు కన్నాను. ఈ సిరీస్‌తో నా కల నెరవేరింది. ఇలాంటి ప్రాజెక్ట్ గతంలో మేమిద్దరం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇదొక విభిన్నమైన సిరీస్. ఒక నటుడిగా ఆయన మాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. సెట్‌లో నన్ను నేను మరింత మెరుగుపరుచుకునేలా ఆయన చేసేవారు. ఇందులో నా పాత్ర పేరు `రైనా`. కానీ బాబాయ్ తరచూ సెట్‌లో నన్ను రానా..రానా` అని పిలిచేవారు.
సెట్‌లో డైలాగ్ చెబుతున్నప్పుడు ఆయన నన్ను తిడుతున్నారో లేదా పాత్రను తిడుతున్నారో అర్థమయ్యేది కాదు`అన్నారు. అంతే కాకుండా ఈ సిరీస్‌ని తమ కుటుంబ సభ్యులు అంతా చూశారని రానా తెలిపారు. ఇదిలా ఉంటే `రానా నాయుడు` రిలీజ్ తరువాత ఈ సిరీస్ విషయంలో రానా, వెంకటేష్‌లపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బాబాయ్, అబ్బాయ్ కలిసి ఇంతటి వల్గర్ సిరీస్‌లో నటించారేంటని, కేవలం డబ్బుల కోసమే ఇలాంటి బూతు సిరీస్‌లో వీరిద్దరు కలిసి నటించారనే విమర్శలు వినిపించాయి. సీక్వెల్ రిలీజ్ తరువాత వెంకీ, రానాలపై నెట్టింట ఏ స్థాయి దుమారం మొదలవుతుందో చూడాలి.
