చార్మినార్ ఫైట్.. రెండు రోజులు కనిపించకుండా పోయిన స్టార్ నటుడు.. కట్ చేస్తే..
తెలుగు తెరపై 'స్పాట్ పెడతా' అంటూ భయపెట్టిన విలన్ రామిరెడ్డి సినిమా ప్రస్థానం ఒక ఆసక్తికర మలుపుతో మొదలైంది.
By: Madhu Reddy | 23 April 2026 8:15 AM ISTతెలుగు తెరపై 'స్పాట్ పెడతా' అంటూ భయపెట్టిన విలన్ రామిరెడ్డి సినిమా ప్రస్థానం ఒక ఆసక్తికర మలుపుతో మొదలైంది. రాజశేఖర్ హీరోగా వచ్చిన 'అంకుశం' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన ఆయనను ఎంతగా భయపెట్టిందంటే, ఏకంగా రెండు రోజుల పాటు కనిపించకుండా పోయారు. చార్మినార్ దగ్గర జరిగిన రియలిస్టిక్ ఫైట్ సీన్ వల్ల తన పరువు పోయిందని భావించిన రామిరెడ్డి, ఆ తర్వాత వెండితెరపై ప్రతినాయకుడిగా ఒక శకాన్ని ఎలా సృష్టించారో ఇప్పుడు చూద్దాం.
ఊహించని అవకాశం.. నీలకంఠగా ఎంపిక:
నటుడు రామిరెడ్డి అసలు సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, ఎమ్మెస్ రెడ్డిల కుటుంబానికి ఆయన సన్నిహితుడు. ఒకసారి ఎమ్మెస్ రెడ్డి ఇంట్లో షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్ళిన రామిరెడ్డిని దర్శకుడు కోడి రామకృష్ణ గమనించారు. ఇక ఆయన ఆకారం, చూపులు చూడగానే 'అంకుశం' సినిమాలో నీలకంఠ పాత్రకు ఈయనే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయారు. ఎమ్మెస్ రెడ్డి సరదాగా అడిగితే, రామిరెడ్డి కూడా కాదనలేక ఓకే చెప్పారు. అలా ఒక లెజెండరీ విలన్ ప్రయాణం మొదలైంది.
చార్మినార్ ఫైట్.. పారిపోయిన రామిరెడ్డి:
సినిమాలో మొదటి రోజే చార్మినార్ దగ్గర షూటింగ్ పెట్టారు. రామిరెడ్డికి చిరిగిన బట్టలు వేసి, పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న రాజశేఖర్ ఆయనను కొట్టుకుంటూ తీసుకెళ్లాలి. ఇక జూనియర్ ఆర్టిస్టులు లేకుండా నిజమైన జనం మధ్య ఆ సీన్ తీశారు. చూసేవాళ్లంతా ఎవరో రౌడీని పోలీసులు కొడుతున్నారని అనుకున్నారు. ఆ దెబ్బకు రామిరెడ్డి మనస్తాపం చెంది, మరుసటి రోజు నుంచి షూటింగ్‌కు రాకుండా రెండు రోజులు మాయమైపోయారు. తన స్నేహితుల దగ్గర పరువు పోయిందని ఆయన తెగ బాధపడిపోయారట.
అంకుశం సంచలనం:
నిర్మాతలు ఆయనను వెతికి పట్టుకొచ్చి ఎమ్మెస్ రెడ్డి, కోడి రామకృష్ణల ముందు కూర్చోబెట్టారు. "పోలీసులు నన్ను కొట్టారని అందరూ అనుకుంటున్నారు, నేను ఈ సినిమా చేయను" అని రామిరెడ్డి మొండికేశారు. అప్పుడు ఎమ్మెస్ రెడ్డి ఆయనకు నచ్చజెబుతూ.. "సినిమా విడుదలయ్యాక ఈ స్నేహితులే నీ దగ్గరకు క్యూ కడతారు" అని భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే సినిమా రిలీజ్ అయ్యాక హీరోతో సమానంగా విలన్ నీలకంఠ పాత్రకు గుర్తింపు వచ్చింది. ఆయన డైలాగ్ డెలివరీ అప్పట్లో ఒక పెద్ద సంచలనం.
విలనిజానికి కొత్త అర్థం:
అనుకోకుండా వచ్చిన ఆ ఒక్క అవకాశం రామిరెడ్డి జీవితాన్ని మార్చేసింది. 'అంకుశం' తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయారు. చార్మినార్ వద్ద పరువు పోయిందని భయపడిన అదే రామిరెడ్డి, ఆ తర్వాత కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆయన లేకపోయినా, నీలకంఠ పాత్ర మరియు ఆయన చెప్పిన డైలాగులు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నేటికీ విలన్ అంటే రామిరెడ్డి రూపం కళ్లముందు కదలడం ఆయన నటనకు నిదర్శనం.
