Begin typing your search above and press return to search.

11వ శతాబ్దపు రాజ్‌పుత్ యోధుడిగా రామ్ చరణ్?

RRR మూవీతో గ్లోబర్‌ స్టార్‌ గా మారిపోయిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. తన క్రేజ్ ను కాపాడుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   10 Feb 2024 11:30 AM GMT
11వ శతాబ్దపు రాజ్‌పుత్ యోధుడిగా రామ్ చరణ్?
X

RRR మూవీతో గ్లోబర్‌ స్టార్‌ గా మారిపోయిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. తన క్రేజ్ ను కాపాడుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఇదే టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించకముందే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి, హీరో పాత్రకు సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రామ్ చరణ్ తో సంజయ్ లీలా భన్సాలీ చారిత్రాత్మక నేపధ్యంలో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి రచించిన 'ది లెజెండ్ ఆఫ్ సుహెల్‌ దేవ్' అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇందులో మెగా వారసుడు 11వ శతాబ్దానికి చెందిన ఒక పోరాట యోధుడిగా, సుహల్ దేవ్ అనే రాజ్ పుత్ చక్రవర్తిగా కనిపిస్తారని అంటున్నారు.

ఉత్తర ప్రదేశ్‌ అవధ్ ప్రాంతంలో రాజ్ పుత్ వంశానికి చెందిన సుహేల్ దేవ్ బర్హాజ్.. శ్రావస్తి రాజ్యాన్ని పరిపాలించాడు. పదకొండో శతాబ్దంలో గజ్నవిద్ దళాలు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించడానికి దండయాత్ర చేసినప్పుడు, చొరబాటుదారులకు సుహేల్ ఎదురొడ్డి నిలిచారు. తన కొద్దిమంది సైన్యంతో ఘాజీ మసూద్‌ ని మట్టికరిపించారు. అలాంటి వీరోచిత గాథను ఇప్పుడు సంజయ్ లీలా తెర మీద ఆవిష్కరించబోతున్నారని, యుద్ధ వీరుడిగా చరిత్రలో నిలిచిపోయిన సహల్ దేవ్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.

పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలు తీయడంలో భన్సాలీ దిట్ట. ఆయన తెరకెక్కించిన 'రామ్ లీలా', 'బాజీరావ్‌ మస్తానీ', 'పద్మావత్‌' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సుహేల్ దేవ్ కథను సినిమాగా తీయాలని ఎప్పుటి నుంచో ఎదురుచూస్తున్న దిగ్గజ దర్శకుడు.. RRR లో అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్ చరణ్ ను తన కథకు తగ్గ నటుడిగా ఎంపిక చేసుకున్నారట. ఇప్పటికే చెర్రీకి స్క్రిప్ట్‌ నేరేట్ చేశారని, దానికి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా టాక్.

చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. దీని తర్వాత 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని సమాచారం. ఇదే క్రమంలో సంజయ్ లీలా భన్సాలీ ప్రాజెక్ట్ ఉంటుందని, రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని నివేదికలు పేర్కొన్నాయి.

ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు ఇంతకంటే పెద్ద న్యూస్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే 'తుఫాన్' సినిమాతో బాలీవుడ్ లో భంగపడ్డ చెర్రీ.. RRR చిత్రంతో బాక్సాఫీస్ మీద దాడి చేశారు. రామ్ గా నార్త్ ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ సంజయ్ లీలా భన్సాలీ లాంటి అగ్ర దర్శకుడితో చారిత్రాత్మక చిత్రం చేస్తే, అది బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేసే అనౌన్స్ మెంట్ ఏదీ రాలేదు. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.