7AM సెట్స్‌కి వెళ్లి రోజుకు 16గం.లు అంకితం
ప్రేక్షకులను తనదైన నటన, ఛరిష్మాతో థియేటర్లకు రప్పించగల డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న సూపర్‌స్టార్ రామ్ చరణ్
By: Tupaki Desk | 29 Dec 2023 10:36 AM ISTప్రేక్షకులను తనదైన నటన, ఛరిష్మాతో థియేటర్లకు రప్పించగల డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న సూపర్‌స్టార్ రామ్ చరణ్. ఒక వ్యక్తిగా అతడు నిశ్చలంగా రిలాక్స్డ్‌గా కనిపిస్తాడు. కానీ కెమెరా రోల్ చేసిన తర్వాత అతడు ఒక నిజమైన కళాకారుడిగా రూపాంతరం చెందుతాడని అతడి సహచర నటులు చెబుతుంటారు.
చరణ్ తన వృత్తిగత నిబద్ధతపై ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చరణ్ మాట్లాడుతూ-''ఉదయం 7 గంటలకు సెట్స్‌లో ఉండే నటుల్లో నేనూ ఒకడిని. నేను 7.45కి కెమెరా ముందు పని ప్రారంభిస్తాను... నేను త్వరగా ప్రారంభించి, త్వరగా ముగించాలనుకుంటున్నాను. ఇక గత ఏడు రోజులుగా రోజుకు 16 గంటలు షూటింగ్ చేస్తున్నాను. నాకు సమయం దొరకడం లేదు.. కానీ నేను ఆ లూప్‌లో ఉండటాన్ని ఇష్టపడతాను''అని చరణ్ చెప్పారు. చరణ్ ప్రస్తుతం శంకర్ తో గేమ్ ఛేంజర్ కోసం ఎంతగా శ్రమిస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
RRR కోసం చరణ్ మూడున్నర సంవత్సరాలు అంకితమిచ్చాడు. ఇది ఇద్దరు భారతీయ విప్లవకారుల జీవితాల నుండి ప్రేరణ పొందిన కల్పిత కథ అన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ సమయంలో వేకువ ఝాము నుంచి చరణ్ తీవ్రంగా శ్రమించేవారు.
తాజాగా ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో ''క్రమశిక్షణ తన భర్త గొప్ప ధర్మమ''ని ఉపాసన కొణిదెల వ్యాఖ్యానించారు. షూటింగ్ సమయం అయినప్పుడు.. మధ్యలోకి ఇంకేమీ రాకూడదు! అతడు ఒక నిర్దిష్ట వ్యవధిలో నిర్దిష్ట శరీరాన్ని నిర్మించుకోవలసి వచ్చినా అంకితమై పని చేస్తాడు. అతడు పొద్దున్నే లేవడం, ఆరోగ్యం కోసం తినడం, కష్టపడి శిక్షణ తీసుకోవడం, అన్నీ ఇవ్వడం నేను చూశాను. అదే అతని విజయ మంత్రం! అని ఉపాసన అన్నారు.
చరణ్ ఎలాంటి నటుడు? అంటే.. సెల్యులాయిడ్‌లో చూపించే ఎమోషన్స్‌తో ప్రజలతో సులభంగా కనెక్ట్ అయ్యే దర్శకుడి నటుడిగా చిరంజీవి భావిస్తారు. చరణ్‌తో ఒక దర్శకుడు అతను ఎంతవరకు అందించగలడో, ఎంత వరకూ రాబట్టగలడో .. వారి అంచనాలను మించి వెళ్ళగలడో కనుగొనగలుగుతారు అని ప్రముఖ నటుడు-నిర్మాత చెప్పారు.
చరణ్ దయాగుణం...గొప్ప మానవతా హృదయం కలిగి ఉంటాడు .. అది తెరపై కనిపిస్తుందని సహచర నటులు కీర్తించిన సందర్భాలున్నాయి. అతడు సెట్స్‌లో విధికి కట్టుబడి పని చేస్తాడు. నిశ్శబ్దంగా సమాచారం తీసుకుని, తన దిశలో వెళతాడు. సెట్స్ లో అనవసర హడావుడి చేయడు! అని RRRలో మొదటిసారిగా స్క్రీన్ స్పేస్ పంచుకున్న అలియా భట్ చెప్పారు.
ఒక నటుడిలో పెద్దగా ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగే లేయర్స్ చాలా ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌లో చాలా కఠినమైన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చాలా గౌరవంగా చిత్రీకరించడం నేను చూశాను… అదే సమయంలో చరణ్ వాటిని ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా చేశాడు. ప్రేక్షకులను కట్టిపడేశాడు. అలా చేయడం అంత సులువు కాదు! అని ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో గంగూబాయి కతియావాడికి ఉత్తమ నటిగా పురస్కారం గెలుపొందిన ఆలియా భట్ తెలిపారు.
చరణ్ నిజాయితీని కలిగి ఉంటాడు. అది ఎల్లప్పుడూ నటుల్లో ఉత్తమ నాణ్యత. వారు పూర్తిగా నిజాయితీగా సానుభూతితో ఉండగలిగినప్పుడు వ్యక్తిత్వంతో ప్రకాశిస్తారు! అని చరణ్ తో పని చేసిన 'రంగస్తలం' సహచర నటి సమంత ప్రశంసించారు. ఆ మేరకు ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూ విశేషాలు మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
