యాక్టింగ్.. నా బ్లడ్ లోనే ఉంది
మళ్లీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రస్తుతం టీవీ షోల్లో జడ్జిగా తళుక్కుమంటున్న రంభ తన సెకెండ్ ఇన్నింగ్స్ విశేషాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలింది.
By: Tupaki Desk | 21 April 2025 5:30 PM ISTహిట్లర్, అల్లుడా మజాకా, భైరవ దీపం, బావగారు బాగున్నారా వంటి సూపర్ హిట్ చిత్రాలతో 90వ దశకంలో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ రంభ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. 2007లో వచ్చిన యమదొంగ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన ఐటం సాంగ్‌లో మరోసారి తన అందాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసిన ఈ భామ చివరిగా 2010లో విడుదలైన దేవి చిత్రంలో కనిపించింది. మళ్లీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రస్తుతం టీవీ షోల్లో జడ్జిగా తళుక్కుమంటున్న రంభ తన సెకెండ్ ఇన్నింగ్స్ విశేషాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలింది.
2010లో శ్రీలంకకు చెందిన తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని కెనడాలో స్థిరపడిన ఈ బెజవాడ ముద్దుగుమ్మ చివరిసారి వెండి తెరపైన కనిపించి 15 ఏళ్లు అవుతోంది. రంభకు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు. వారి సంరక్షణ బాధ్యతలను చూసుకునేందుకు నటనకు దూరమయ్యానని చెప్పిన రంభ, ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లయ్యారని, వారి పనులు వారు చేసుకోగలుగుతున్నారని తెలిపింది. యాక్టింగ్ అంటే తనకు ఎంత ఇష్టమో భర్త ఇంద్రకుమార్‌కు తెలుసని, ఆయన మద్దతుతోనే టీవీ షోస్ ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించానని చెప్పింది.
ఒక దశలో ఈ షోలో తాను చేయగలనా అని తనపై తనకే అనుమానం వచ్చిన సమయంలో కుటుంబమంతా కలిసికట్టుగా తనని ప్రోత్సహించిందని తెలిపింది. తొలిసారి సినిమాలో నటించినప్పుడు ఎంత భయపడ్డానో అంతకంటే ఎక్కువ సెకెండ్ ఇన్నింగ్స్ ఒక డ్యాన్స్ షోలో పాల్గొనడానికి కంగారు పడ్డానని, అయితే ఒకసారి స్టేజ్‌పైకి వచ్చి రెండు స్టెప్స్ వేసేసరికి ఆ టెన్షనంతా పోయి మునపటి రిథమ్‌లోకి వచ్చేశానని తెలిపింది.
ఇటీవల ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లితే అభిమానులు ఇప్పటికి తనను చూడడానికి, ఫొటోలు దిగడానికి పోటీపడడం చూసి రంభ ఆశ్చర్యానికి లోనైందంట. ఇంతటి అభిమానం, ప్రేమ చూపిస్తున్న అభిమానుల ఆదరణ పొందేందుకు మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుందంట. నటన తన రక్తంలోనే ఉందని, మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తానని ఆ ఇంటర్వ్యూలో రంభ తెలిపింది.
