Begin typing your search above and press return to search.

'రామాయ‌ణం' టైటిల్ ఛేంజ్.. ఇది ఊహించ‌లేదే!

ఇందులో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా త‌దిత‌రులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు

By:  Tupaki Desk   |   19 May 2024 7:49 AM GMT
రామాయ‌ణం టైటిల్ ఛేంజ్.. ఇది ఊహించ‌లేదే!
X

'రామాయ‌ణం' మెగా ప్రాజెక్ట్ కి సంబంధించిన కొత్త ట్విస్టులు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. దాదాపు 800 కోట్ల బ‌డ్జెట్‌తో మూడు భాగాలుగా రామాయ‌ణం తెర‌కెక్క‌నుంద‌ని ఇంత‌కుముందు మేక‌ర్స్ అంచ‌నా బ‌డ్జెట్ ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. భారతీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ ల‌లో ఒక‌టిగా ప్ర‌చారం సాగుతోంది. దర్శకుడు నితీష్ తివారీ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా గ్రాండ్ సిరీస్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ‌రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. సెట్ నుండి ఇటీవల లీక్ అయిన చిత్రాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉత్సుక‌త‌ను పెంచాయి. ఇందులో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా త‌దిత‌రులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇబ్బందుల్లో ప‌డిందంటూ ఇటీవ‌ల కొత్త ట్విస్టు వెలుగు చూసింది. అల్లు అర‌వింద్- మ‌ధు మంతెన బృందం ప్రైమ్ ఫోక‌స్ మీడియాతో ఒప్పందంలో భాగంగా త‌మ‌కు చెల్లించాల్సిన‌ది ఇంకా చెల్లించ‌లేద‌ని, దీనిపై న్యాయ‌పోరాటం సాగించేందుకు సిద్ధ‌మ‌వుతున్నామ‌ని ప్ర‌క‌టించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. 'ప్రాజెక్ట్ రామాయణం' మేధో సంపత్తి హక్కులకు సంబంధించి చెల్లింపులు తాము పొంద‌లేద‌ని అల్లు మంతెన మీడియా వెంచర్స్ ఎల్‌ఎల్‌పి పబ్లిక్ నోటీసును జారీ చేసిన‌ట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

ఇదిలా ఉండ‌గానే.. రామాయ‌ణం గురించిన తాజా గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు ప్రైమ్ ఫోక‌స్ సంస్థ 'రామాయ‌ణం' టైటిల్ ని మార్చే ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని, దీనిని 'గాడ్ ప‌వ‌ర్‌' అనే టైటిల్ తో నిర్మించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అలాగే 'ది కేరళ స్టోరీ'లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న‌ సోనియా బాలా తారాగణంలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివ‌రాల‌కు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువ‌డాల్సి ఉంది.