రామాయణ కోసం హాలీవుడ్‌ని దించేస్తున్న రెహమాన్!
భారతీయ పురాణ ఇతిహాసం `రామాయణం` ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలొచ్చాయి.
By: Tupaki Desk | 21 April 2025 9:53 AMభారతీయ పురాణ ఇతిహాసం `రామాయణం` ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలొచ్చాయి. వివిధ భాషల్లో ప్రముఖ నటీనటులు ఈ ఇతిహాసం ఆధారంగా సినిమాలు చేశారు. దీంతో చాలా జనరేషన్‌లకు రామాయణ ఇతిహాసం పుస్తకాల్లోనే కాకుండా సినిమాల రూపంలోనూ పరిచయమై ఆకట్టుకుంది. ఈ కథని తెరపై ఆవిష్కరించిన ప్రతిసారి ప్రేక్షకుల్ని రామాయణం` ఆకట్టుకుంది. ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. అయితే ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన `ఆదిపురుష్` మాత్రం విమర్శల్ని ఎదుర్కొంది.
వాల్మీకి రామాయణం ఆధారంగా ఓం రౌత్ రూపొందించిన ఈ సినిమా 2023లో విడుదలై ఓ కామిక్ సినిమాలా ఉందని, హనుమాన్, రావన్ క్యారెక్టర్లని డిజైన్ చేసిన తీరు, రామాయణాన్ని తెరకెక్కించిన తీరు అవమానకరంగా ఉందని పలువురు చిత్ర బృందంపై విమర్శలు చేశారు. ఈ మూవీ తరువాత రామాయణం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా `రామాయణ`. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్నారు.
యష్ రావణ్‌గా, సన్నిడియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ పార్ట్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. త్వరలో యష్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్‌లని రంగంలోకి దించేస్తున్నారు. ఇప్పటి వరకు `రామాయణ` ఇతిహాసం నేపథ్యంలో వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని నితీష్ తివారి తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయనతో పాటు హాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ సంగీతం అదిస్తున్నాడు. ఇటీవల ఆయన సంగీతం అందించిన ద క్రియేటర్, డ్యూన్ పార్ట్ 2, ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాలకు సంగీతం అందించారు. దీంతో `రామయణ`కు రెహమాన్‌తో కలిసి ఆయన అందించనున్న మ్యూజిక్ ఏస్థాయిలో ఉండనున్నాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే `రామాయణ పార్ట్ 1`ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనుండగా, పార్ట్ 2ను 2027 దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు.