యష్ - రణబీర్ ఎదురుపడేది తక్కువే.. ఎందుకంటే!
ఇక అసలైన ఆసక్తికర అంశం ఏమిటంటే.. రణబీర్, యష్ ఇద్దరూ ఈ సినిమాలో ఎక్కువ సీన్లలో కలసి కనిపించరన్నది.
By: Tupaki Desk | 23 May 2025 11:14 AM ISTఇండియన్ మైథాలజీపై ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో “రామాయణం” ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ స్థాయిలో హైప్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, పాన్ ఇండియా హీరో యష్ రావణుడిగా కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
సాయి పల్లవి సీత పాత్రలో, సన్నీ డియోల్ హనుమంతునిగా నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వంలో ఈ చిత్రానికి వరల్డ్ క్లాస్ విజువల్స్, వీఎఫ్ఎక్స్ స్టూడియోల సపోర్ట్‌తో మైథాలజీకి ఆధునిక టచ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రణబీర్ తన పార్ట్ ఇప్పటికే పూర్తి చేయగా, యష్ మాత్రం మే మొదట్లో మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక తొలి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలైన ఆసక్తికర అంశం ఏమిటంటే.. రణబీర్, యష్ ఇద్దరూ ఈ సినిమాలో ఎక్కువ సీన్లలో కలసి కనిపించరన్నది. ఎందుకంటే దర్శకుడు నితీష్ తివారి అండ్ టీమ్ వాల్మీకి రామాయణం యథాతథంగా చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో రాముడు, రావణుడు తుది యుద్ధానికి ముందే కలుసుకోరు. సీత హరణం తర్వాతే రాముడు రావణుడి గురించి తెలుసుకుంటాడు.
అప్పటివరకు వారి ప్రయాణాలు వేర్వేరుగా సాగుతాయి. ఈ విషయాన్ని చిత్రబృందం నిజంగా పాటిస్తోంది. ఇది ఒక గొప్ప కథా నిర్ణయంగా విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. రామ్ ధర్మాన్ని ప్రతిబింబిస్తే, రావణుడు అహంకారానికి చిహ్నం. ఒకరికి నైతిక విలువలపై, మరొకరికి అధికారం మీద ప్రయాణం. ఇద్దరి పాత్రలు వేర్వేరుగా అభివృద్ధి చెందడంతో, తుదిరూపంలో వచ్చే వారి క్లాష్ మరింత శక్తివంతంగా అనిపించే అవకాశం ఉంటుంది.
సాధారణంగా స్టార్ హీరోలతో భారీ సీన్లు క్రియేట్ చేస్తూ, వాళ్ల కలయికపై ఆధారపడి ప్రేక్షకుల మనసు దోచే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం కథ, కథనం ఆధారంగా ముందుకు సాగుతోంది. సినిమా ప్రస్తుతం ముంబైలోని భారీ సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. సాయి పల్లవి - యష్, యష్ - సన్నీ డియోల్ మధ్య సన్నివేశాలు షూట్ చేయనున్నారు.
కానీ, రణబీర్ – యష్ కలిసి కనిపించే సీన్లు తక్కువేనని సమాచారం. ప్రస్తుతానికి ఇది ఒక కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య యుద్ధానికి ముందు వారి స్వంత ప్రయాణాన్ని చూపించే ప్రయత్నం. దీనితో సినిమాకు కొత్త కోణం దొరుకుతుందన్న మాట. రామాయణం సినిమా ఒక మైథాలజికల్ విజువల్ స్పెక్టాకిల్‌గా తెరపై అలరించనుంది. ప్రామాణికతను కాపాడుతూ, ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే విధంగా రూపుదిద్దుకుంటోంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.
