'రామాయణం' మూవీ రివ్యూ
రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితీశ్ తివారి తెరకెక్కించిన 'రామాయణం-1' ప్రేక్షకుల ముందుకొచ్చింది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఘట్టాలు, రణబీర్, యశ్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే సీతారాముల మధ్య భావోద్వేగాలు, ఎమోషనల్ కనెక్షన్ కొరవడ్డాయి. స్లో నరేషన్, సుదీర్ఘ నిడివి మైనస్లు.
By: Tupaki Desk | 5 Nov 2026 1:10 PM IST‘రామాయణం’ మూవీ రివ్యూ
నటీనటులు: రణబీర్ కపూర్- సాయిపల్లవి- యశ్- రవి దూబే- అరుణ్ గోవిల్- లారా దత్తా- రకుల్ ప్రీత్ సింగ్- కాజల్ అగర్వాల్- వివేక్ ఒబెరాయ్ తదితరులు
సంగీతం: హన్స్ జిమ్మర్- ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: పంకజ్ కుమార్-మహేష్ లిమాయే
నిర్మాత: నమిత్ మల్హోత్రా
స్క్రీన్ ప్లే: నితీశ్ తివారి- శ్రీధర్ రాఘవన్
మాటలు: నితీశ్ తివారి- శ్రేయస్ జైన్ (తెలుగు అనువాదం: ఆకెళ్ళ శివప్రసాద్)
దర్శకత్వం: నితీశ్ తివారి
మన పురాణాల్లో ఎన్నిసార్లు చూసినా తనివి తీరని గాథలల్లో ‘రామాయణం’ ఒకటి. వివిధ భాషల్లో దీనికి అనేక అడాప్షన్స్ చూశాం. కొన్నేళ్ల ముందు ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆదిపురుష్’ రామాయణ గాథతో తెరకెక్కిందే. కానీ అది ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ నుంచి భారీ స్థాయిలో రామాయణాన్ని రూపొందించారు. రణబీర్ కపూర్ రాముడిగా.. సాయిపల్లవి సీతగా.. యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రాన్ని నితీశ్ తివారి రూపొందించగా.. నమిత్ మల్హోత్రా ప్రొడ్యూస్ చేశాడు. రామాయణం పార్ట్-1 ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అడాప్షన్ ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
శివుడి అనుగ్రహంతో ఒక్కో లోకాన్ని జయిస్తూ దేవతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు రావణుడు (యశ్). తన చేతిలో ఓటమి పాలైన ఇంద్రుడు.. రావణుడి అకృత్యాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియని అయోమయంలో పడిపోయి మునీశ్వరులను పరిష్కారం కోరుతాడు. అప్పుడే మహావిష్ణువు కొత్త అవతారం అయోధ్యలో రాముడి రూపంలో రాబోతోందని, అతనే రావణుడి పీడ విరగడ చేస్తాడని మునీశ్వరులు సెలవిస్తారు. అలా అయోధ్యలో రాముడు (రణబీర్ కపూర్) జన్మిస్తాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన రాముడు.. స్వయంవరంలో సీత (సాయిపల్లవి)ని వరించి పెళ్లాడతాడు. తండ్రి కోరిక మేరకు అయోధ్యకు కొత్త రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైన రాముడికి.. భార్య, సోదరుడు లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అక్కడికి వెళ్లాక రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లే వరకు నడిచే కథ ఇది.
కథనం-విశ్లేషణ:
రామాయణం కథ గురించి.. అందులోని గొప్పదనం గురించి భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వాళ్లకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నోసార్లు ఆ కథను తెర మీద చూశాం. కానీ సరిగ్గా తీస్తే ఎన్నిసార్లు చూసినా తనివి తీరని కథే అది. కొన్నేళ్ల ముందు ‘ఆదిపురుష్’ టీం రామాయణాన్ని ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టింది. దీంతో బాలీవుడ్ నుంచి రామాయణం మీద ఇంకో సినిమా అనగానే.. ఆసక్తి కంటే భయమే కలిగింది. కానీ ‘దంగల్’ దర్శకుడు నితీశ్ తివారి రూపొందించిన ‘రామాయణం’ను చూడడానికి ఎంతమాత్రం భయపడాల్సిన పని లేదు. ‘ఆదిపురుష్’లో మాదిరి అర్థం లేని క్రియేటివిటీ చూపించకుండా.. సాంకేతికతను గొప్పగా ఉపయోగించుకుంటూ ‘రామాయణం’ను విజువల్ వండర్ గా తీర్చిదిద్దింది నితీశ్ అండ్ కో. ఇండియన్ సినిమాలో ఇంత గొప్పగా విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించుకున్న సినిమా ఇంకోటి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ‘బాహుబలి’ని కూడా మించిపోయే ఔట్ పుట్ చూడొచ్చు సినిమాలో. కాకపోతే ఏ హంగులూ లేని రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ లో తీసిన మన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాను చూసినపుడు కలిగిన డివైన్ ఫీలింగ్ ను ఈ ‘రామాయణం’ తీసుకురాలేకపోయింది. విజువల్ గా ఎంత గొప్పగా ఉన్నా.. ఎమోషనల్ డెప్త్ మిస్సవడం వల్ల ‘రామాయణం’లో ఏదో మిస్సయిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది.
‘రాామాయణం’ కథ చాలాసార్లు విన్నది.. చూసిందే కాబట్టి.. తెలిసిన విషయాలను తెర మీద ఎలా ప్రెజెంట్ చేశారా అని చూస్తాం. ఈ ప్రెజెంటేషన్ విషయంలో లోపాలు ఎంచలేని విధంగా.. చాలా నీట్ గా ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దింది నితీశ్ తివారి అండ్ టీం. మనం ఎప్పుడూ రామాయణంలో చూసే ఘట్టాలకు తోడు.. ఇందులో కొన్ని అదనపు సన్నివేశాలున్నాయి. అలాగే ఇంతకుముందు సింపుల్ గా.. షార్ట్ గా చూసిన సన్నివేశాలను ఇందులో కొంచెం లెంగ్తీగా.. చాలా గ్రాండ్ గా చూస్తాం. ఉదాహరణకు రావణుడి చెల్లెలు శూర్పణఖ అనగానే మనకు గుర్తొచ్చేది.. ఆమె రాముడిని చూసి మోహించడం.. రాముడు ఆమె ముక్కుకోసి పంపించినందుకు రావణుడు సీతను అపహరించడం.. ఈ సన్నివేశాలే. కానీ ఇందులో శూర్పణఖ భర్త విద్యుద్జీవుడికి సంబంధించి ఒక ఎపిసోడ్ చూస్తాం. అలాగే సీతను రావణుడు అపహరిస్తుంటే.. జటాయువు ఎదురుపడి పోరాడే సన్నివేశాాన్ని ఒకట్రెండు నిమిషాల వ్యవధిలో చూసి ఉంటాం. కానీ ఇందులో అదే ఒక క్లైమాక్సులా మారి అరగంట పాటు ప్రేక్షకులను విజువల్ మాయాజాలంలో ముంచెత్తి అద్భుత అనుభూతిని పంచుతుంది. ఆ ఘట్టాన్ని డిజైన్ చేసిన తీరును.. అందులో విజువల్ ఎఫెక్ట్స్ ను ఎంత కొనియాడినా తక్కువే. మొత్తంగా ఇండియన్ సినిమా చరిత్రలోనే విజువల్ గా ఇదొక స్టాండౌట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఇలాంటి మరికొన్ని కళ్లు చెదిరే ఘట్టాలు ‘రామాయణం’లో ఉన్నాయి,
కాకపోతే ‘రామాయణం’ విజువల్ గా ఎంత గొప్పగా అనిపించినప్పటికీ.. ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలించడంలో.. రామాయణ గాథను తెర మీద చూస్తే వచ్చే డివైన్ ఫీలింగ్ తీసుకురావడంలో మాత్రం అనుకున్నంత మేర విజయవంతం కాలేకపోయింది. ఇందులో ఫలానా సన్నివేశం బాగా లేదు అని చెప్పలేం. చాలా సిన్సియర్ గా.. మనసు పెట్టి సన్నివేశాలను తీర్చిదిద్దింది చిత్ర బృందం. ఎంతో ఆడంబరంగా కనిపించే అయోధ్యను చూపించినా.. అడవిలో రాముడు ఉండే చిన్న కుటీరాన్ని చూపించినా.. దృశ్యం మత్రం కంటికి ఎంతో ఇంపుగా అనిపిస్తుంది. సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానంతో పాటు నటీనటులు హావభావాాలు.. మాటలు.. అన్నీ బాగా కుదిరాయి. అన్నీ బాగున్నా సరే.. రామాయణ గాథను చూస్తే రావాల్సిన డివైన్ ఫీలింగ్ మాత్రం తీసుకురాలేకపోయారు. సీతారాముల మధ్య భావోద్వేగ బంధాన్ని బలంగా చూపించడంలో.. ప్రేక్షకులకు కూడా ఆ పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ చేయడంలో టీం ఫెయిలైందనే చెప్పాలి. ఇది కనుక సరిగ్గా జరిగి ఉంటే ‘రామాయణం’ అద్భుత దృశ్య కావ్యంగా మారేది.
ఎమోషనల్ డెప్త్ మిస్సయినా సరే.. ‘రామాయణం’ సిన్సియర్ అండ్ గ్రేట్ ఎఫర్ట్ అనడంలో సందేహమే లేదు. కేవలం ఇందులో విజువల్స్ కోసమే ఒకసారి చూడొచ్చు. క్లైమాక్సులో వచ్చే జటాయుడు ఫైట్ సహా ప్రతి యాక్షన్ ఘట్టాన్నీ అద్భుతంగా తీర్చిదిద్దారు. విజువల్ ఎఫెక్ట్స్ అవసరమైన మేరే ఉపయోగించుకుంటూ.. కథను కమ్మేయకుండా చూసుకోవడం ప్రశంసనీయం. మూడు గంటలకు పైగా సుదీర్ఘ నిడివి.. స్లో నరేషన్.. కొన్ని సాగతీత సన్నివేశాలను పక్కన పెడితే.. ‘రామాయణం’లో ఎంగేజింగ్ ఎపిసోడ్లు చాలానే ఉన్నాయి. జటావయు ఫైటే ఇంత భారీగా ఉంటే.. ఇక రాముడు-రావణుడు మధ్య పోరు ఇంకెంత గొప్పగా ఉంటుందో అనే ఆసక్తికి తోడు చివర్లో హనుమంతుడి పాత్ర తాలూకు గ్లింప్స్ చూశాక ‘రామాయణం-2’ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడతాయి. కొన్ని ప్రతికూలతను ఉన్నప్పటికీ బిగ్ స్క్రీన్లలో ఒకసారి చూడ్డానికి ఏమాత్రం ఢోకా లేని సినిమానే ‘రామాయణం-1’.
నటీనటులు:
‘యానిమల్’లో అంత వయొలెంట్ క్యారెక్టర్ చేశాక రాముడి పాత్రలోకి ట్రాన్స్ ఫామ్ అయి మెప్పించడం తేలికైన విషయం కాదు. రణబీర్ కపూర్ ఈ పనిని విజయవంతంగా చేశాడు. తనెంత గొప్ప పెర్ఫామరో మరోసారి అతను రుజువు చేశాడు. ఎంతో పరిణతితో నటించిన రణబీర్.. రాముడి పాత్రకు అవసరమైన ప్రశాంత చిత్తాన్ని తన హావభావాాలతో తీసుకువచ్చిన తీరు అమోఘం. సీత పాత్రలో సాయిపల్లవి జస్ట్ ఓకే అనిపించింది. ఆమె బాగానే పెర్ఫామ్ చేసినప్పటికీ.. సీత పాత్రకు అవసరమైన నిండుదనం మాత్రం తనలో కనిపించలేదు. రణబీర్-సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ కూడా సరిగా కుదరలేదు. రావణుడి పాత్రలో యశ్ అదరగొట్టేశాడు. సీతారాములను మించి ఈ పాత్ర హైలైట్ అయిందంటే యశ్ పెర్ఫామెన్స్ వల్లే. రావణుడి పాత్రలో ఉండే రాయల్టీని తన బాడీ లాంగ్వేజ్.. పెర్ఫామెన్స్ తో తీసుకొచ్చాడు యశ్. కొన్నిచోట్ల నటన కాస్త హద్దులు దాటినట్లు అనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా యశ్ సినిమాకు పెద్ద ఆకర్షణగా మారాడు. లక్ష్మణుడిగా రవి దూబె.. దశరథుడిగా అరుణ్ గోవిల్.. కైకేయిగా లారా దత్తా బాగా చేశారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ ఓకే. మండోదరి పాత్రలో కాజల్ నామమాత్రమే. వివేక్ ఒబెరాయ్ పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘రామాయణం’ అద్భుతమే. విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్షన్ ఘట్టాలన్నీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి సన్నివేశంలో భారీతనం కనిపిస్తుంది. పంకజ్ కుమార్-మహేష్ లిమాయేల కెమెరా పనితనం గొప్పగా సాగింది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. హన్స్ జిమ్మర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గొప్పగా సాగింది. మనకు అలవాటైన సౌండ్స్ ఇందులో వినిపించవు. హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు తన స్కోర్ హన్స్ జిమ్మర్. ఏఆర్ రెహమాన్ పాటలు ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. వినసొంపైన పాటలు లేకపోవడం మైనస్సే. ‘రామాయణం’ మీద ఇంత భారీ ఖర్చు పెట్టి అద్భుతమైన ఔట్ పుట్ తీసుకొచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రా అభినందనీయుడు. ఇదొక డబ్బింగ్ సినిమా అనిపించకుండా.. ఆకెళ్ళ శివప్రసాద్ సహజమైన తెలుగు అనువాద సంభాషణలతో ఆకట్టుకున్నారు. మాటలు బాగున్నాయి. దర్శకుడు నితీశ్ తివారి.. రామాయణ గాథను ఇప్పటి సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటూ విజువల్ వండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని సిన్సియర్ గా చేశాడు. తన టేకింగ్ చాలా బాగుంది. కాకపోతే భావోద్వేగాలను పండించే విషయంలో మరింత కసరత్తు చేయాల్సింది. నరేషన్లో ఇంకొంత వేగం చూపించాల్సింది.
చివరగా: రామాయణం.. దృశ్యాలు అద్భుతం.. భావోద్వేగాలు పరిమితం
రేటింగ్ - 2.75/5
