ట్రెండీ టాక్: స్వయంవరానికి రావణుడు రానప్పుడు ఆ సీన్లు ఎలా తీస్తారు?
నమిత్ మల్హోత్రా నిర్మాణంలో దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో `రామాయణం`చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 10 May 2026 5:00 AM ISTనమిత్ మల్హోత్రా నిర్మాణంలో దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో `రామాయణం`చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సీతా స్వయంవరం ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారని, ఇందులో రావణుడిగా యష్ శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే అసలు వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు స్వయంవరానికి రాలేదని... మరి ఈ మార్పులు ఎందుకు చేస్తున్నారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది.
నిజానికి మూల గ్రంథమైన వాల్మీకి రామాయణంలో జనక మహారాజు శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించినప్పుడు అనేకమంది రాజులు వచ్చారు కానీ అందులో రావణుడి ప్రస్తావన ఎక్కడా కనిపించదు. కానీ తులసీదాస్ రచించిన `రామచరిత మానస్`.. కొన్ని ఇతర ప్రాంతీయ రామాయణ గాథల ప్రకారం రావణుడు స్వయంవరానికి వచ్చినట్లు వర్ణనలు ఉన్నాయి. ఈ కథనాల ఆధారంగానే రావణుడు సభకు రావడం.. శివధనుస్సును కనీసం కదిలించలేక అవమాన భారంతో వెనుదిరగడం వంటి సన్నివేశాలను సినిమాల్లో జోడిస్తుంటారు.
సినిమాల్లో లేదా నాటకాల్లో కథను మరింత రక్తి కట్టించడానికి రావణుడి అహంకారాన్ని ప్రారంభం నుండే ప్రదర్శించడానికి ఈ సన్నివేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. రావణుడు విఫలమైన చోట రాముడు విజయం సాధించాడని చూపించడం ద్వారా రాముడి దివ్య శక్తిని, గొప్పతనాన్ని ఎలివేట్ చేసే అవకాశం దక్కుతుంది. సీతాదేవిని దక్కించుకోవాలనే రావణుడి కోరిక కేవలం అపహరణతోనే మొదలు కాలేదని... అది మొదటి నుండీ ఉందని చూపడం ద్వారా పాత్రల మధ్య సంఘర్షణను మరింత బలంగా పండించవచ్చు. ఇది ప్రేక్షకులను కథలో మరింతగా లీనం చేస్తుంది.
అయితే ఇలాంటి మార్పుల వల్ల మూలకథ పక్కదారి పడుతుందనే ఆందోళన కూడా ఉంది. వాల్మీకి మహర్షి ధర్మ స్థాపనే లక్ష్యంగా రాముడిని ఒక `ఉత్తమ పురుషుడు`గా చిత్రించారు. అనవసరపు కల్పనలు జోడించినప్పుడు కథ `ధర్మం` నుండి కేవలం `అద్భుత రసం` వైపు మళ్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా... సామాన్య ప్రజలు మూల గ్రంథాన్ని చదవకుండా కేవలం సినిమాలు చూసి అవే నిజమని నమ్మే ప్రమాదం ఉంది. దీనివల్ల వాల్మీకి చెప్పదలచుకున్న అసలు తత్వానికి.. పాత్రల ఔచిత్యానికి భంగం కలగవచ్చని కొందరు పండితులు హెచ్చరిస్తున్నారు.
రామాయణం అనేది ఒక సముద్రం లాంటిది. కాలక్రమేణా అందులో అనేక జానపద గాథలు, ప్రాంతీయ వైవిధ్యాలు వచ్చి కలిశాయి. ఒక కళాఖండంగా చూసినప్పుడు కొత్త అంశాల జోడింపు కథకు గాంభీర్యాన్ని, వైవిధ్యాన్ని ఇస్తుంది. రావణుడు స్వయంవరానికి రావడం వంటి మార్పులు కథా గమనాన్ని పెద్దగా మార్చవు కాబట్టి అవి సినిమాను రక్తి కట్టించడానికి సహాయపడతాయి. అయితే ఈ మార్పులు మూల పాత్రల గౌరవాన్ని దెబ్బతీయకుండా.. ధర్మాన్ని ప్రతిబింబించేలా ఉన్నంత వరకు ఇవి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయనడంలో సందేహం లేదు. ఓంరౌత్ `ఆదిపురుష్` తరహాలో సరైన ఔచిత్యం లేకుండా పురాణేతిహాస కథల్ని చూపించకపోతే అదే వెయ్యి రెట్లు మేలు.
