రామాయణ (X) బ్రహ్మ ఏఐ : 40 భాషల్లో పాత్రల లిప్ సింక్ అంటే ఆషామాషీనా?
ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు, ప్రైమ్ ఫోకస్ - DNEG వ్యవస్థాపకులు అయిన నమిత్ మల్హోత్రా సినిమా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాత్ర, ముఖ్యంగా `బ్రహ్మ ఏఐ` ప్రాముఖ్యత గురించి పలు వేదికలపై కీలక విషయాలు షేర్ చేసారు.
By: Sivaji Kontham | 24 Oct 2026 7:52 PM ISTప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు, ప్రైమ్ ఫోకస్ - DNEG వ్యవస్థాపకులు అయిన నమిత్ మల్హోత్రా సినిమా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాత్ర, ముఖ్యంగా `బ్రహ్మ ఏఐ` ప్రాముఖ్యత గురించి పలు వేదికలపై కీలక విషయాలు షేర్ చేసారు. `రామాయణం` లాంటి అత్యంత ప్రతిష్టాత్మక, భారీ ప్రాజెక్ట్‌లలో విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ అవతార్లు, గ్లోబల్ ఆడియో విజువల్ కంటెంట్‌ను రూపొందించడంలో ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అంతేకాదు రామాయణం చిత్రాన్ని సోని పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లోకి అనువదించి రిలీజ్ చేయడానికి ఉపయోగించిన బ్రహ్మా ఏఐ ఫలితం ఆశ్చర్యకరంగా ఉందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు 40 భాషల్లో పాత్రల లిప్ సింక్ చేయడం అంటే ఆషామాషీనా? అది ఈ ఏఐతో సాధ్యం చేసి ఔరా! అనిపిస్తున్నారట. మరింత డీప్ గా వివరాల్లోకి వెళితే...
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రంలో వివిధ భాషల్లో డైలాగ్స్‌కు తగినట్లుగా లిప్-సింక్ అత్యంత కచ్చితంగా కుదిరేలా చేయడానికి సినీ చరిత్రలోనే తొలిసారిగా `బ్రహ్మ ఏఐ`ని ఉపయోగించినట్లు నమిత్ మల్హోత్రా వెల్లడించారు. ఈ సాంకేతికత ద్వారా చిత్రంలోని పాత్రలు రకరకాల ప్రాంతాల భాషల్లో మాట్లాడుతున్నప్పుడు వాటి పెదవుల కదలికలు ఎంతో సహజంగా, అచ్చం ఆయా భాషల్లోనే మాట్లాడుతున్నట్లు కనిపించేలా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు.
ఈ అధునాతన ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సినిమా నిర్మాణ వ్యయం, డబ్బింగ్ విధానాలు, పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో ఊహాతీతమైన మార్పులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయితే కేవలం ఏఐ మీద మాత్రమే పూర్తిగా ఆధారపడకుండా.. ఈ ప్రక్రియలో పలువురు డబ్బింగ్ - లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ సాయాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్ట్‌ను మరింత ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నట్లు నమిత్ మల్హోత్రా స్పష్టం చేశారు.
ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ దిగ్గజాలు ప్రైమ్ ఫోకస్, DNEG , మెటాఫిజిక్ సంస్థల కలయికతో ఆవిర్భవించిన `బ్రహ్మ ఏఐ` ఎంటర్‌ప్రైజ్ ఆడియో విజువల్ కంటెంట్ రంగాన్ని సరికొత్త మలుపు తిప్పుతోంది. కళాత్మక సృజనాత్మకతకు, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని జోడిస్తూ ఈ ప్లాట్‌ఫారమ్ పనిచేస్తోంది. ఇటీవల 150 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ ద్వారా 2 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్ సాధించి గ్లోబల్ ఏఐ యూనికాన్‌గా ఎదిగిన ఈ సంస్థ... హాలీవుడ్ స్థాయి క్వాలిటీతో భారీ ఎత్తున కంటెంట్‌ను సులభంగా, వేగంగా రూపొందించే అవకాశాన్ని అందిస్తోంది.
డిజిటల్ అవతార్‌ల పుట్టుక వెనక:
ఈ వేదికలో పలు కంపెనీలు కూడా రాణిస్తున్నాయి. వీటిలో అత్యంత కీలకమైన సాధనాలు `ఆత్మన్` (ATMAN), `వాణి` (VAANI). ఆత్మన్ ద్వారా అత్యంత కచ్చితత్వంతో కూడిన ఫోటోరియలిస్టిక్ డిజిటల్ మానవ అవతార్‌లను తయారుచేయవచ్చు. అలాగే వాణి ఇంజిన్ సహాయంతో బహుభాషా వాయిస్ ప్రాసెసింగ్ .. కచ్చితమైన పెదవుల కదలికలను ఆటోమేటిక్‌గా మార్చవచ్చు. వీటితో పాటు బ్రహ్మ ఏఐ కోర్ సిస్టమ్ సంస్థల వద్ద ఉన్న భారీ మీడియా డేటాను క్షణాల్లో శోధించేలా వర్గీకరించి, కంటెంట్ నిల్వ - ప్రాసెసింగ్‌ను అత్యంత సురక్షితంగా నిర్వహిస్తుంది.
కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా వార్నర్ బ్రదర్స్, డిస్నీ, ఎన్బీఏ, మేయో క్లినిక్ వంటి అంతర్జాతీయ మీడియా, స్పోర్ట్స్, హెల్త్‌కేర్ దిగ్గజాలు కూడా ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. మానవ ఆలోచన .. ఉద్దేశానికే ప్రాధాన్యమిస్తూ.. వేగాన్ని .. ప్రొడక్షన్ ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న బ్రహ్మ ఏఐ, భవిష్యత్తు డిజిటల్ కంటెంట్ క్రియేషన్‌లో ఒక విప్లవాత్మకమైన మార్పుగా నిలుస్తోంది.
