కోట్లాది మంది జీవితాలను ప్రభావిత చేసే సాంస్కృతిక వైభవమిది: నమిత్ మల్హోత్రా
వైవిధ్యభరితమైన యావత్ భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన రామాయణ వైభవాన్ని చాటడానికి దేశ హృదయమైన ఢిల్లీని వేదికగా ఎంచుకోవడం వెనుక ఒక బలమైన వ్యూహాత్మక - సాంస్కృతిక విశ్లేషణ కనిపిస్తోంది.
By: Sivaji Kontham | 19 July 2026 10:03 AM ISTరామాయణం అనేది కేవలం ఒక పౌరాణిక గ్రంథమో లేదా పురాతన కాలం నాటి ఇతిహాసమో కాదు.. అది వేల ఏళ్లుగా భారతీయుల జీవన విధానాన్ని, నైతిక విలువలను .. పండుగల సంస్కృతిని నిర్దేశిస్తున్న ఒక సజీవ చైతన్యం. కాల ప్రవాహంలో ఎన్నో సామ్రాజ్యాలు అంతరించినా.. ఈ కావ్యంలోని ఆత్మ మాత్రం తరతరాలుగా ప్రతి గుండె సప్పుడులో చెక్కుచెదరకుండా నిలిచింది. భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్త సమాజంలోనూ తన చెరగని ముద్రను నిలబెట్టుకున్న ఈ శాశ్వత గాథ.. ఇప్పుడు వెండితెరపై అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త విజన్‌తో దృశ్య కావ్యంగా మన ముందుకు వస్తోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న డిజిటల్ ట్రైలర్‌కు ముందే... దేశ రాజధాని న్యూఢిల్లీలో చిత్ర బృందం నిర్వహించిన `ప్రథమ సంకల్ప` వేడుక ఈ మహా ప్రయాణానికి ఒక పవిత్రమైన శ్రీకారంగా నిలిచింది.
వైవిధ్యభరితమైన యావత్ భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన రామాయణ వైభవాన్ని చాటడానికి దేశ హృదయమైన ఢిల్లీని వేదికగా ఎంచుకోవడం వెనుక ఒక బలమైన వ్యూహాత్మక - సాంస్కృతిక విశ్లేషణ కనిపిస్తోంది. సాంప్రదాయబద్ధంగా `సంకల్పం` అంటే ఒక మహత్తర కార్యాన్ని ప్రారంభించే ముందు చేసే పవిత్ర ప్రతిజ్ఞ. అదే నిబద్ధతతో భారతదేశపు అత్యున్నత సంపదను ఎలాంటి తడబాటు లేకుండా భక్తి భావంతో ప్రపంచ ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని నిర్మాత నమిత్ మల్హోత్రా... క్రియేటివ్ మేధావి నితేశ్ తివారీ నిరూపించారు. కేవలం సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా..`రామాయణ స్కూల్స్ ప్రోగ్రామ్` ద్వారా దేశవ్యాప్తంగా 500కు పైగా పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులకు సృజనాత్మకంగా రామాయణ విలువలను చేరవేయడం.. అందులోని చిన్నారులను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించడం ఈ ప్రాజెక్ట్ సామాజిక బాధ్యతను స్పష్టం చేస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రయాణంపై నిర్మాత, క్రియేటివ్ ఆర్కిటెక్ట్ నమిత్ మల్హోత్రా విశ్లేషణాత్మకంగా స్పందిస్తూ.. రామాయణం అనేది కేవలం మన ఇతిహాసాల్లో ఒకటి మాత్రమే కాదని.. అది భారతీయుల జీవన విధానాన్ని, నైతిక విలువలను.. తరతరాల పండుగల సంస్కృతిని నిర్దేశిస్తున్న ఒక సజీవ చైతన్యమని కొనియాడారు. వేల సంవత్సరాల క్రితం నాటి కథ అయినప్పటికీ ఇప్పటికీ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఇలాంటి అపూర్వమైన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని.. ప్రపంచంలోనే అతిపెద్ద వేదికపై ఆవిష్కరించాలనే తన సుదీర్ఘ కల ఇప్పుడు సాకారమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన వద్ద ఉన్న ప్రపంచస్థాయి సాంకేతిక నైపుణ్యం, అత్యుత్తమ కళాకారుల బలంతో ఈ అమూల్యమైన వారసత్వాన్ని దాని అత్యున్నత స్థాయికి తగినట్లుగా అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నామని... శతాబ్దాలుగా భారత్ గుండెల్లో దాచుకున్న ఈ పరమ సత్యాన్ని ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్‌తో షేర్ చేసుకోవడం తమకు గొప్ప అదృష్టమని నమిత్ గర్వంగా ప్రకటించారు.
ఈ చారిత్రాత్మక ఘట్టంలో మరో అపూర్వ విశేషం ఏమిటంటే.. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర కళాకారులు తొలిసారిగా ఒకే వేదికపై సందడి చేయడం. రామానంద్ సాగర్ సృష్టించిన దృశ్య కావ్యంలో శ్రీరాముడిగా కోట్లాది మంది పూజా గదుల్లో స్థానం సంపాదించుకున్న అరుణ్ గోవిల్.. ఇప్పుడు ఈ చిత్రంలో దశరథ మహారాజుగా నటిస్తూ నూతన తరానికి మార్గదర్శిగా నిలిచారు. వీరితో పాటు కైకేయిగా శోభన, విశ్వామిత్రుడిగా అజింక్య దేవ్, ఇంద్రుడిగా కునాల్ కపూర్, లక్ష్మణుడిగా రవీ దూబే, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రతిభావంతులైన నటీనటుల కలయిక ఈ చిత్రానికి అసాధారణమైన క్లాసిక్ లుక్‌ను తీసుకొచ్చింది. ఈ యావత్ నక్షత్ర మండలానికి నాయకత్వం వహిస్తూ.. రణ్‌బీర్ కపూర్ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి పాత్రలోనూ.. సాయి పల్లవి తన పవిత్రమైన కరుణ- ఆత్మస్థైర్యంతో సీతాదేవిగానూ జీవించబోతున్నారు.
ఈ విశ్వవ్యాప్త ప్రయత్నంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.... పాన్ ఇండియా స్టార్ రాకింగ్ స్టార్ యశ్ కేవలం రావణాసురుడి పాత్రలోనే కాకుండా... తన `మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్` ద్వారా సహ నిర్మాతగా మారి సినిమా స్కేల్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం. దానికి తోడు హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ అనూహ్య ఎంట్రీ ఇవ్వడం అంచనాలను మరింత పెంచింది. చైనా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో `దంగల్` చిత్రంతో సరికొత్త రికార్డులు సృష్టించిన దర్శకుడు నితేశ్ తివారీ.. ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్ పై బలమైన ముద్ర పడటం ఖాయంగా కనిపిస్తోంది. భారతదేశపు గొప్ప కథలు ప్రపంచంలోనే అతిపెద్ద వేదికపై చెప్పాలనే నమిత్ మల్హోత్రా సంకల్పానికి నిదర్శనమైన ఈ చిత్రం.. దీపావళి 2026 కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
