రామాయణం: హాలీవుడ్ ఎగ్జిబిటర్లకు ప్రదర్శన.. రిపోర్ట్ ఏంటంటే?
భారతీయ చలనచిత్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `రామాయణం`.
By: Sivaji Kontham | 19 April 2026 10:21 AM ISTభారతీయ చలనచిత్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `రామాయణం`. నితీష్ తివారీ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా కేవలం భారతీయ ప్రేక్షకుల కోసమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ వండర్‌గా నిలిచేలా చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లాస్ వెగాస్‌లో జరిగిన ప్రసిద్ధ `సినిమాకాన్` వేదికపై హాలీవుడ్ ఎగ్జిబిటర్లకు ఈ చిత్రంలోని కొంత భాగాన్ని ప్రదర్శించి.. ప్రపంచ స్థాయి ప్రశంసలను మేకర్స్ అందుకున్నారు. తూర్పు దేశాల సాంస్కృతిక మూలాలకు పశ్చిమ దేశాల అత్యాధునిక సాంకేతికతను అద్ది.. ఒక అద్భుత దృశ్యకావ్యాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
ఈ చిత్రంలో రావణుడిగా నటిస్తున్న కన్నడ స్టార్ యశ్ .. నిర్మాత నమిత్ మల్హోత్రా రామాయణం మేకింగ్ శైలిపై ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. ఈ సినిమా లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గ్లాడియేటర్ వంటి భారీ హాలీవుడ్ ఫాంటసీ చిత్రాల తరహాలో ఉంటుందని వారు వెల్లడించారు. పాశ్చాత్య ప్రేక్షకులకు సైతం ఈ కథాంశం సుపరిచితంగా.. సులభంగా అర్థమయ్యేలా చిత్ర శైలిని మలుచుకున్నామని.. తద్వారా మన సంస్కృతిని ప్రపంచమంతా చూడాల్సిన కథగా మారుస్తున్నామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక భాషకో ప్రాంతానికో పరిమితం కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న విజువల్ ఎపిక్.
రామాయణంలోని పాత్రల చిత్రణలో చిత్ర బృందం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ముఖ్యంగా రావణుడి పాత్రను కేవలం ఒక దుష్ట విలన్‌గా మాత్రమే కాకుండా.. ఒక మానవీయ కోణంలో ప్రజలు అతనికి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దుతున్నట్లు యశ్ తెలిపారు. రావణుడిలోని విద్వత్తును.. అహంకారాన్ని.. సంక్లిష్టమైన మనస్తత్వాన్ని నేటి కాలానికి అనుగుణంగా చూపించబోతున్నారు. అలాగే అసురుల వేషధారణలో వెస్ట్రన్ స్టైల్ కనిపిస్తోందనే విమర్శలపై స్పందిస్తూ.. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ చారిత్రక కథకు ఒక కొత్త గ్లామర్‌ను జోడించడానికి తీసుకున్న నిర్ణయమని యశ్ సమర్థించారు.
సాంకేతికంగా ఈ చిత్రం భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించబోతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంస్థ డి.ఎన్.ఇ.జి అందిస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఫోటోరియలిస్టిక్ విజువల్స్ కోసం అత్యంత అధునాతన సాంకేతికతను వాడుతున్నట్లు.. ప్రస్తుతం విజువల్స్ పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయని మేకర్స్ తెలిపారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతంలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫైనల్ అవుట్‌పుట్ భారతీయ సినిమాలో ఒక విజువల్ రివల్యూషన్‌ను తీసుకువస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
నిర్మాత ఏమన్నారంటే?
రామాయణాన్ని నేటితరం ప్రపంచ ప్రేక్షకులకు వారి శైలిలో అర్థమయ్యేలా చెప్పడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా పేర్కొన్నారు. వంద ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలో మన సంస్కృతిని పాశ్చాత్య మార్కెట్‌లో బలంగా స్థాపించలేకపోయామనే వెలితిని ఈ చిత్రం భర్తీ చేయనుంది. కేవలం సాంకేతికతకే ప్రాధాన్యత ఇవ్వకుండా.. మనదైన ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వమైన రామాయణంలోని ఆత్మను దెబ్బతినకుండా గ్లోబల్ ఆడియన్స్‌కు అందించాలనే కృతనిశ్చయంతో తమ బృందం పనిచేస్తోందని నమిత్ తెలిపారు. ఈ ప్రయత్నం సఫలమైతే భారతీయ ఇతిహాసాలు ప్రపంచ సినిమా దిశదశలను మార్చడం ఖాయమనే భావించవచ్చు.
