Begin typing your search above and press return to search.

'రామాయణ' మ్యూజిక్ రైట్స్‌ T-సిరీస్ ఖాతాలోకి..2 భాగాల‌కు క‌లిపి షాకిచ్చే ధ‌ర‌!

రామాయ‌ణం కాకుండా మ్యూజిక్ రైట్స్ లో టాప్ -5లో ఉన్న సినిమాల జాబితా ఇలా ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంగీతం అనేది సినిమాల విజయానికి ప్రధాన బలం.

By:  Tupaki Desk   |   29 July 2026 10:15 AM IST
రామాయణ మ్యూజిక్ రైట్స్‌ T-సిరీస్ ఖాతాలోకి..2 భాగాల‌కు క‌లిపి షాకిచ్చే ధ‌ర‌!
X

భారతీయ చిత్రసీమలో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న `రామాయణ` సినిమాపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల ఈ చిత్రం అంతర్జాతీయ పంపిణీ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకోగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ రైట్స్ లీజు విషయంలో మరొక బిగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. దిగ్గ‌జ‌ సంస్థ టీ-సిరీస్ `రామాయణ` రెండు భాగాల ఆడియో హక్కులను ఏకంగా రూ. 75 కోట్ల భారీ డీల్‌తో సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఆడియో హక్కుల కోసం దేశంలోని ప్రధాన ఆడియో లేబుల్స్ పోటీ పడినా.. భూషణ్ కుమార్ సారథ్యంలోని టీ-సిరీస్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సినిమా సౌండ్‌ట్రాక్ అపారమైన ప్రజాదరణ పొందుతుందనే పూర్తి నమ్మకంతో టీ-సిరీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరించారు. కాగా ఈ రూ. 75 కోట్లు రీఫండబుల్ అడ్వాన్స్ ఒప్పందం కింద డీల్ కుదిరినట్లు సమాచారం.

భారతీయ సంగీత పరిశ్రమలోనే అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ ఆడియో హక్కుల ఒప్పందాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ భారీ డీల్ ద్వారా టీ-సిరీస్ మ్యూజిక్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరొకసారి చాటుకోవడమే కాకుండా.. సినిమా ఆల్బమ్‌పై ఆడియన్స్ - ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను పెంచేసింది.

`దంగల్` వంటి ఆల్‌టైమ్ హిట్ అందించిన నితీష్ తివారీ ఈ పౌరాణిక దృశ్యకావ్యానికి దర్శకత్వం వహిస్తుండగా.. నమిత్ మల్హోత్రా దాదాపు 4000 కోట్ల బ‌డ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్- హన్స్ జిమ్మర్ సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ భారీ పౌరాణిక ఇతిహాసం మొదటి భాగం 2026 దివాళికి, రెండవ భాగం 2027 దివాళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నాయి.

మ్యూజిక్ రంగంలో టాప్ -5 రైట్స్ ఇవే

రామాయ‌ణం కాకుండా మ్యూజిక్ రైట్స్ లో టాప్ -5లో ఉన్న సినిమాల జాబితా ఇలా ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంగీతం అనేది సినిమాల విజయానికి ప్రధాన బలం. ఇటీవల కాలంలో పాన్-ఇండియా సంస్కృతి పెరిగిన తర్వాత పెద్ద హీరోల చిత్రాల మ్యూజిక్ రైట్స్ డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్స్‌లో `పుష్ప 2: ది రూల్` సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఆడియో రైట్స్‌ను టి-సిరీస్సంస్థ ఏకంగా 60 కోట్లకు కొనుగోలు చేసి ఆల్-టైమ్ రికార్డు నెలకొల్పింది. దీని తర్వాత రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` చిత్రం ఆడియో హక్కులను సరిగమ సంస్థ సుమారు 33 కోట్లకు కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. ఈ భారీ ఆఫర్లు భారతీయ మ్యూజిక్ మార్కెట్ స్థాయిని ప్రపంచ వేదికపై సరికొత్తగా నిలబెట్టాయి.

ఇక టాప్ 5 డీల్స్‌లోని మిగిలిన సినిమాలను పరిశీలిస్తే... యష్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ `కె.జి.ఎఫ్: చాప్టర్ 2` ఆడియో రైట్స్‌ను లహరి మ్యూజిక్ - టి-సిరీస్ కాంబినేషన్ దాదాపు 30 కోట్లకు సొంతం చేసుకొని మూడో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు-రాజమౌళి కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 మ్యూజిక్ రైట్స్ కూడా దాదాపు 25 కోట్ల నుండి 30 కోట్ల మధ్య బిజినెస్ జరిగినట్లు గుస‌గుస‌లు వినిపించాయి. కానీ దీనికి అధికారిక ధృవీక‌ర‌ణ రావాల్సి ఉంది. రజినీకాంత్ నటించిన జైలర్, దళపతి విజయ్ గోట్ వంటి తమిళ ప్రతిష్టాత్మక చిత్రాల మ్యూజిక్ హక్కులు కూడా ఒక్కొక్కటి 25 కోట్ల వరకు పలికాయి. పాన్-ఇండియా సినిమాలకు దేశవ్యాప్తంగా ఉన్న విపరీతమైన క్రేజ్ వల్లనే ఆడియో కంపెనీలు ఈ స్థాయిలో కోట్ల రూపాయలను వెచ్చించడానికి ముందుకు వస్తున్నాయి.