40 ఏళ్ల క్రితం రామాయణంపై డాక్యుమెంటరీ!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం నితీష్ తివారీ రామాయణం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 2 Aug 2026 1:41 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం నితీష్ తివారీ రామాయణం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోన్న పాన్-ఇండియా చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ .. హాలీవుడ్ స్థాయి గ్రాండియర్‌తో తెరకెక్కుతోంది. సినిమా కోసం నితీష్ తివారీ అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మేకింగ్ పరంగా..పోస్ట్ ప్రొడక్షన్ పరంగా రిచ్ గా ఉండటం కోసం సాంకేతికంగా సినిమా ఏమాత్ర తగ్గలేదు. అందుకోస నితీష్ అండ్ కో ఎంతో శ్రమిస్తుంది. రేయింబవళ్లు రామాయణంపై పని చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో 40 ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఒకే ఒక్కరు ఈ ఇతిహాసాన్ని టెలివిజన్ ద్వారా కోట్లాది మందికి ఎలా చేరవేశారనే దానిపై తాజాగా ఓ అరుదైన డాక్యుమెంటరీ సిద్ధమవుతోంది. ప్రముఖ దిగ్గజ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణ్ టెలివిజన్ ధారావాహిక భారతీయ టెవీ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన షోగా రికార్డు సృష్టించింది. 1987-88 మధ్య ప్రసారమైన అద్భుతమైన ధారావాహిక ఆ కాలంలో సాధించిన టీఆర్పీ రికార్డులను ఇప్పటి వరకు ఏ షో కూడా బ్రేక్ చేయలేకపోయింది.
లాక్‌డౌన్ సమయంలో పునఃప్రసారం అయినప్పుడు కూడా ఈ సీరియల్ అప్పట్లో మళ్లీ టాప్ రేటింగ్స్‌ను సొంతం చేసుకుని తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇంతటి చరిత్ర సృష్టించిన ఐకానిక్ టీవీ షో వెనుక జరిగిన కష్టాలు, తెరవెనుక విశేషాలను వివరిస్తూ రామానంద్ సాగర్ మనుమడు శివ్ సాగర్ తాజాగా ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 36 ఏళ్ల క్రితం ఎలాంటి కంప్యూటర్లు, వీఎఫ్ఎక్స్ బ్లూ..గ్రీన్ స్క్రీన్ సౌకర్యాలు లేని కాలంలో ఈ ప్రాజెక్ట్‌ను ఎంత కష్టపడి తెరకెక్కించారో ? ఈ డాక్యుమెంటరీ ద్వారా చూపించబోతున్నారు.
ఆ కాలంలో లీనియర్ ఎడిటింగ్ మెషీన్లు, లో-బ్యాండ్ యు-మ్యాటిక్ వీడియో టెక్నాలజీని మాత్రమే ఉపయోగించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ డాక్యుమెంటరీ మేకింగ్ టెక్నిక్స్‌కే పరిమితం కాకుండా నాటి నటీన టులు, సాంకేతిక నిపుణులు, వారి కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలను కూడా పొందుపరుస్తున్నారు. ముఖ్యంగా ఆ కాలంలో యూనిట్ సభ్యుల ఇళ్లలోని మహిళలు పడిన ఇబ్బందులు, వారు ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఇందులో డాక్యుమెంట్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న చాలామంది ప్రముఖులు నేడు లేకపోవడంతో రావణాసురుడిగా నటించిన దివంగత అర్వింద్ త్రివేది కుమార్తెతో పాటు, దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ తదితరుల ఇంటర్వ్యూలను సేకరించారు.
అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చిఖ్లియా సీతగా, సునీల్ లహ్రి లక్ష్మణుడిగా నటించిన ఈ ధారావాహిక ప్రసారమవుతున్న సమయంలో దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మానుష్యంగా మారేవి. అలాంటి అరుదైన జ్ఞాపకాలను, నాటి తరం పడిన తపస్సును నేటి తరానికి పరిచయం చేయడమే ఈ డాక్యుమెంటరీ ప్రధాన ఉద్దేశమని శివ్ సాగర్ తెలిపారు. ఆధునిక హంగులతో భారీ చిత్రాలు వస్తోన్న తరుణంలో ఎలాంటి వసతులు లేని రోజుల్లో కళ పట్ల ఉన్న అంకితభావానికి ఈ డాక్యుమెంటరీ ఒక నిదర్శనంగా నిలవనుంది.
