Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్ గా మారబోతోన్న మరో టాలీవుడ్ హీరో

ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చే తొలి చిత్రానికి ఓ యువ దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. ఇది అతని డెబ్యూట్ కావడం విశేషం.

By:  Tupaki Desk   |   21 Jun 2025 11:10 AM IST
ప్రొడ్యూసర్ గా మారబోతోన్న మరో టాలీవుడ్ హీరో
X

ఈమధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు వరుసగా నిర్మాణ బాధ్యతలతో మరింత బిజీ అవుతున్నారు. ఇప్పటికే నాని ఆ ట్రాక్ లో దూసుకెళ్తున్నాడు. ఇక మరికొందరు స్టార్స్ కూడా ఇతర ప్రొడక్షన్ లతో కలిసి అలా ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా సొంతంగా సినిమా నిర్మాణంలోకి వెళుతున్నట్టు తెలుస్తోంది.

తన కెరీర్‌లో మాస్ మేకోవర్‌తో ప్రయోగాలు చేస్తూ వచ్చినా.. ఇటీవల చేసిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కొంత వెనుకబడినట్టే అయింది. ప్రస్తుతం 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే డిఫరెంట్ డ్రామాలో నటిస్తున్నాడు రామ్. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. P మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. అయితే సినిమా విడుదల తరువాత రామ్ తదుపరి ప్రాజెక్ట్ ఇంకా ప్రకటించలేదు.

లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రామ్ త్వరలోనే తన స్వంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించబోతున్నాడట. ఇప్పటి వరకు స్రవంతి మూవీస్ బ్యానర్ పై తన పెదనాన్న కిషోర్ ఆధ్వర్యంలో సినిమాలు చేస్తూ వచ్చిన రామ్.. ఇప్పుడు పూర్తిగా నిర్మాతగా మారబోతున్నాడని సమాచారం. తన స్వంత సంస్థపై సినిమా నిర్మించే పనులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.

ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చే తొలి చిత్రానికి ఓ యువ దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. ఇది అతని డెబ్యూట్ కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది తొలి నుంచే షూటింగ్ ప్రారంభం కానుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్ కావొచ్చని టాక్.

ఇక రామ్ ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా తానే హీరోగా చేసే చిత్రాలు మాత్రమే నిర్మిస్తాడా లేక ఇతర హీరోలతో కూడా న్యూ ప్రాజెక్ట్స్‌ను కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాడా? అన్న విషయమై స్పష్టత లేదు. కానీ ఇండస్ట్రీలోని మరో హీరో నిర్మాతగా మారుతున్నాడన్న సంగతే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాదిలోపు రామ్ తన బ్యానర్ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

అంతేకాక, అదే రోజు తన తొలి ప్రొడక్షన్ ప్రాజెక్ట్ వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. రామ్ తన కెరీర్‌లో కొత్త దశకు అడుగుపెడుతూ నటుడిగా మాత్రమే కాదు.. నిర్మాతగానూ న్యూ కెరీర్ ను ప్రారంభించబోతున్నాడు. రామ్ గతంలో 'ఇస్మార్ట్ శంకర్'తో భారీ హిట్ కొట్టి మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే ఎనర్జీతో విజయాలను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. రామ్ కొత్తగా ఎలాంటి కథలు ఎంచుకుంటాడు తన బ్యానర్ మీద ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో చూడాలి.