చుట్టమల్లే వివాదంపై రామ్ రియాక్షన్.. సాధ్యమవుతుందా?
అత్యాధునిక టెక్నాలజీ ఏఐని సవ్యంగా ఉపయోగించుకోవాల్సింది పోయి.. దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఆయన చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
By: Madhu Reddy | 4 Oct 2026 3:44 PM ISTగత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర సినిమాలోని చుట్టమల్లే మార్ఫింగ్ వీడియో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి లాంటి భారీ దిగ్గజాలు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ విషయంపై తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మండిపడుతూ నిందితులను వదిలిపెట్టను అంటూ ఒక రేంజ్ లో మండిపడ్డారు. అటు జాన్వి కపూర్ కూడా దీనిపై స్పందించింది . ఇక విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా ఒక్కొక్కరిగా ఈ వీడియో పై ఘాటుగా స్పందిస్తుంటే.. రామ్ పోతినేని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అత్యాధునిక టెక్నాలజీ ఏఐని సవ్యంగా ఉపయోగించుకోవాల్సింది పోయి.. దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఆయన చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డీప్ ఫేక్ వీడియోల నేపథ్యంలో ఏఐ నీ దుర్వినియోగం చేయకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలి అని జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై హీరో రామ్ స్పందించారు. ఆయన స్పందిస్తూ.. ఆన్లైన్ లో క్లియర్ ఐడెంటిటీ ఉండదు. కాబట్టే ఇలాంటి వారికి భయం లేదు . అందుకే ప్రతి సోషల్ మీడియా అకౌంట్ కి ఆధార్ లింక్ చేయాలి. అప్పుడే యూజర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. దీనివల్ల ఆన్లైన్ అబ్యూజ్ ను కూడా అరికట్టవచ్చు అంటూ రామ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే రామ్ చేసిన మాటలను బట్టి చూస్తే నిజమే కదా అనిపిస్తోంది.. ఎందుకంటే సోషల్ మీడియాలో అకౌంట్లు ఒకరి పేరు మీద ఎన్నైనా క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా ఫేక్ ఐడి లను క్రియేట్ చేస్తూ సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలతో, ఫోటోలతో వారిని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారి పరువును బజారుకీడుస్తున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఒక్కొక్క అకౌంట్ కి ఒకరి ఆధార్ కార్డు లింక్ చేయడం వల్ల నేరస్తులను నేరుగా పట్టుకునే అవకాశం ఉంటుంది.అందుకే ఇలాంటివి చేస్తే సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలు కూడా ఈ ఏఐ డీప్ ఫేక్ వీడియోల ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు అని చెప్పవచ్చు.
టెక్నాలజీ అనేది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఉండాలి . ముఖ్యంగా మనం ఒక కొత్త టెక్నాలజీని తయారు చేస్తున్నామంటే అది ఉపయోగపడేలా ఉండాలే కానీ దుర్వినియోగం కాకూడదు. అటు ప్రభుత్వాలు కూడా ఎన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. ఎక్కడో ఒకచోట ఇలాంటి వీడియోలు దర్శనమిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరి ఇప్పటికైనా మార్పు వస్తుందా అనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.
