నాగ్, చైతూ కంటే అఖిలే బెస్ట్ యాక్టర్.. ఆర్జీవీ కామెంట్స్ వైరల్!
లెనిన్ మూవీ రిలీజ్ సందర్భంగా అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీవీ, సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 13 July 2026 12:13 PM ISTఅక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా రిలీజైన తర్వాత అతని కెరీర్‌లో కొత్త చాప్టర్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుండగా, మరోవైపు అఖిల్ యాక్టింగ్ పై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అక్కినేని ఫ్యామిలీలో ఇప్పటివరకు చూసిన నటుల్లో అఖిలే బెస్ట్ యాక్టర్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
లెనిన్ మూవీ రిలీజ్ సందర్భంగా అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీవీ, సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కేవలం సినిమా బాగుందని చెప్పడానికే పరిమితం కాకుండా, అఖిల్ యాక్టింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ సంచలన కామెంట్ చేశారు. "అక్కినేని కుటుంబంలో నువ్వే బెస్ట్ యాక్టర్" అని పేర్కొంటూ, ఆ మాటను నాగార్జునపై ఒట్టేసి చెబుతున్నాను అని తనదైన స్టైల్‌లో వ్యాఖ్యానించారు. దీంతో నాగార్జున, నాగ చైతన్యల కంటే అఖిల్ యాక్టింగ్‌ను ఆర్జీవీ ఎక్కువగా మెచ్చుకున్నట్టుగా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆర్జీవీ కామెంట్స్ లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే, అఖిల్ యాక్టింగ్‌లో కనిపించిన సహజత్వాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం. పెద్ద ఎమోషన్స్ లేని నార్మల్ సీన్స్ లో కూడా అఖిల్ చాలా ఈజ్‌తో నటించాడని, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆడియన్స్ ను కట్టిపడేసే స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొనియాడారు. ఒక నటుడిగా అఖిల్‌లో కనిపించిన మెచ్యూరిటీ తనను ఆశ్చర్యపరిచిందనే భావన ఆర్జీవీ పోస్టు స్పష్టంగా కనిపిస్తోంది.
అలాగే అఖిల్‌లోని ఈ కోణాన్ని బయటకు తీసుకొచ్చిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరిని కూడా ఆర్జీవీ అభినందించారు. ఒక హీరో ఇమేజ్‌ను మాత్రమే కాకుండా, అతడి నటనకు పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చే పాత్రను డిజైన్ చేసినందుకు డైరెక్టర్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇదిలా ఉంటే, లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. రిలీజైన మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు.
