'అమ్మో బొమ్మ' కథ కొత్తేమీ కాదుగా ఆర్జీవీ
ఇప్పుడు అకస్మాత్తుగా జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్ పేయితో ప్రయోగాత్మక సినిమాని ప్రకటించాడు ఆర్జీవీ.
By: Tupaki Desk | 2 Sept 2025 12:32 AM ISTజనం థియేటర్లకు వచ్చినా రాకపోయినా ఆర్జీవీ సినిమాలు తీస్తూనే ఉన్నారు. జనాల కోసం ఆయన సినిమాలు తీయరు. ఆయన కోసం ఆయన సినిమాలు తీస్తారు. మైండ్ లో ఏదైనా ఆలోచన మెదిలితే చాలు, దానిని సినిమాగా తీసేస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో గతి తప్పిన కథలతో చెత్త ఫిలిం మేకింగ్ తో అందరికీ విసుగు పుట్టించాడు. రాజకీయ కథలు, నిజ ఘటనలతో సినిమాలు తీసినా కానీ ఎందుకనో ప్రజలకు నచ్చలేదు. పరిమిత బడ్జెట్ నాశిరకం విజువల్స్ తో వర్మ నీరు గార్చేయడమే దీనికి కారణం.
ఒకప్పుడు శివ, రంగీలా, క్షణక్షణం, సత్య లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన వర్మ మనసు పెట్టి పని చేయడం లేదనే ఆవేదన అభిమానుల్లో అలానే ఉంది. ఆయన ఇటీవలి దశాబ్ధ కాలంలో మనసు పెట్టి తెరకెక్కించిన చివరి సినిమా ముంబై ఎటాక్స్ పై రూపొందించిన `ది ఎటాక్స్ ఆఫ్ 26/11`. ఒక నిజ ఘటనను ఉన్నదున్నట్టు కళ్లకు గట్టినట్టు తెరకెక్కించి ఆశ్చర్యపరిచారు ఆర్జీవీ. ఆ సినిమాకి అటూ ఇటూ తెరకెక్కించిన ఏ సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు.
ఇప్పుడు అకస్మాత్తుగా జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్ పేయితో ప్రయోగాత్మక సినిమాని ప్రకటించాడు ఆర్జీవీ. `పోలీస్ స్టేషన్ మే భూత్` అంటూ టైటిల్ తో ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయగా అది పెద్ద డిబేట్ కి తెర తీసింది. ఇందులో భాజ్‌పాయ్ తో పాటు ఒక బొమ్మ దెయ్యం షాకింగ్ గా కనిపిస్తోంది. ముఖంపై కత్తి గాట్లతో వికృతంగా కనిపిస్తున్న బొమ్మ దెయ్యం నిజంగానే భయపెడుతోంది. కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్‌ని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కాల్చి చంపేశాక, అతడు ఆత్మగా మారి పోలీస్ స్టేషన్ పై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ సింగిల్ లైన్ స్టోరీని ఆర్జీవీ హారర్ థ్రిల్లర్ మోడ్ లో తెరకెక్కిస్తుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ `అమ్మో బొమ్మ` సినిమాని మర్చిపోలేం. హాలీవుడ్ లో `అనబెల్లే` సిరీస్ ఈ తరహానే. చాలా ఫ్రాంఛైజీల్లో బొమ్మ దెయ్యం కథల్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ దర్శకుడైన ఆర్జీవీ అదే తరహా ప్రయత్నం చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే కంటెంట్ ని ఇదివరకూ చూసినట్టుగా కాకుండా కొత్తగా ప్రెజెంట్ చేయకపోతే ఇలాంటి సినిమాలు వర్కవుట్ కావు. ఆర్జీవీ చాలా కేర్ తీసుకుని సినిమా ఆద్యంతం మెరుపులు, మిరుమిట్లతో స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. సత్య ఫేం మనోజ్ భాజ్ పాయ్, జెనీలియా లాంటి ప్రతిభావంతులు ఈ ప్రాజెక్టులో చేరడం కలిసొచ్చే విషయం. ఆర్జీవీ ఏం చేస్తాడో వేచి చూడాలి.
