వర్మకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?
కక్కొచ్చినా.. కల్యాణమొచ్చినా ఆపలేం అంటారు. కానీ వర్మకు మాత్రం ఏదొచ్చినా ఆపలేం అన్నట్టుగా తయారైంది ఆయన పరిస్థితి.
By: Tupaki Desk | 31 Dec 2025 12:55 AM ISTకక్కొచ్చినా.. కల్యాణమొచ్చినా ఆపలేం అంటారు. కానీ వర్మకు మాత్రం ఏదొచ్చినా ఆపలేం అన్నట్టుగా తయారైంది ఆయన పరిస్థితి. ఈ మధ్య ఆయినదానికి కానీ దానికి తెగ రియాక్ట్ అయిపోతున్నాడు వర్మ అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. రీసెంట్ వివాదం కారణంగా శివాజీపై చిందులేసిన వర్మ ఇప్పుడు బాలీవుడ్ సినిమా విషయంలో నెట్టింట బట్టలు చించుకుంటున్నాడు. మంచిని పొగటంలో తప్పులేదు. కానీ అదే సాకుగా మరోకరిని కించపరచడం మాత్రం ఆమోద యోగ్యం కాదు అన్న విషయం అందరికి తెలిసిందే.
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ `ధురంధర్` మూవీ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్ ఆకలి తీరుస్తోంది. టాలెంటెడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్యధర్ రూపొందించిన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.1100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది.
సినిమా రిలీజ్ సందర్భంగా మొదటి వారం విమర్శు వినిపించాయి. సెక్యులర్ వాదుల, పలువురు యూట్యూబర్స్ ఈ మూవీపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉందని గగ్గోలు పెట్టారు. పాకిస్థాన్‌తో పాటు అరబ్ దేశాల్లో బ్యాన్‌కు గురి కావడంతో సహజంగానే ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా `ధురంధర్` హాట్ టాపిక్‌గా మారింది. మేకింగ్, టేకింగ్ పరంగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన `ధురంధర్`పై ప్రముఖులు, సినీ లవర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వర్మ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్ద నోటే రాశాడు. దర్శకుడు సినిమాని తీర్చి దిద్దిన తీరు, `ధురంధర్`ని తెరపై ఆవిష్కరించిన విధానం ఇండియన్ సినిమాకు ఓ గేమ్ ఛేంజర్‌లా ఉందని ప్రశంసలు కురిపించాడు. తనని చూసి మేకర్స్ నేర్చుకోవాలని, హీరో వర్షిప్‌తో సాటే టాలీవుడ్ మరింతగా `ధురంధర్` నుంచి పాఠాలు నేర్చుకోవాలని సెటైర్లు వేశాడు. అంతే కాకుండా సినిమా మేకింగ్‌లో `ధురంధర్` విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని కొనియాడారు.
మన మేకర్స్‌కి ఈ సినిమా ఓ గుణపాఠం అని చెప్పిన వర్మ తాజాగా మరోసారి `ధురంధర్`పై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పొగిడే క్రమంలో సౌత్ ఇండస్ట్రీని వర్మ కించపరచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మన పాన్ ఇండియా సినిమాల దండయాత్ర మొదలైన దగ్గరి నుంచి బాలీవుడ్ వరుస ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీన్ని ప్రధానంగా ఎత్తి చూపుతూ `ధురంధర్`ని పొగుడుతూ ఓ పోస్ట్‌ని షేర్ చేశాడు.
`బాలీవుడ్‌పై సౌత్ వాళ్ల దండయాత్ర అనే అగ్నిగోళాన్ని ఆదిత్యధర్ తన `ధురంధర్` అనే ఎడమ కాలితో వెనక్కి తన్నాడు. ఇప్పుడు అతని కుడికాలు `ధురంధర్ 2`తో సిద్ధమవుతోంది. నేను చూసిన రెండవ భాగం ప్రకారం మొదటి భాగం వాళ్లని భయపెట్టి ఉంటే రెండవ భాగం వాళ్లను హడలెత్తించడం ఖాయం` అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్‌లు భిన్నంగా స్పందిస్తున్నారు. వర్మ హ్యాంగోవర్‌లో మాట్లాడాడు అని కొంత మంది అంటుంటే బాలీవుడ్ ఆడియన్స్ వర్మ చెప్పింది కరెక్ట్ అంటూ సమర్ధిస్తున్నారు. మరి కొంత మంది మాత్రం సినిమాలని అడ్డంపెట్టుకుని నార్త్, సౌత్ అని విడదీసి చూడకండి అని కామెంట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మార్చి 19న రిలీజ్ కానున్న `ధురంధర్ 2`ని వర్మ ఇటీవలే చూశాడని అర్థమవుతోంది. రెండవ భాగం హడలెత్తించడం ఖాయం అని కోట్ చేశాడంటే సీక్వెల్ ఏరేంజ్‌లో ఉండనుందన్నది అర్థమవుతోంది. ఇందులో నటించిన నటీనటులు ఇప్పటికే పార్ట్ 2.. ఫస్ట్ పార్ట్‌కు మించి ఉంటుందని, అందులోని సన్నివేశాలు, యాక్షన్ ఘట్టాలు హై ఓల్టేజ్‌తో 50 శాతం హై రేంజ్‌లో ఉంటాయని స్టేట్‌మెంట్ ఇచ్చారు. వర్మ మాటల్లోనూ అదే కనిపించడంతో `ధురంధర్ 2`పై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.
