RGV చనిపోయినా అతడి ఆత్మను వెంటాడే క్లోన్ రెడీ అవుతోంది!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మరణం తర్వాత కూడా ప్రజలతో టచ్‌లో ఉండేందుకు ఏఐ డిజిటల్ క్లోన్‌ను రూపొందించుకున్నారు. ప్రముఖ ఏఐ ఇంజినీర్ హరి గడిపూడి దీన్ని అభివృద్ధి చేశారు. వర్మ ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా ఈ క్లోన్‌ను సిద్ధం చేశారు. మరణానంతరం కూడా డిజిటల్ రూపంలో కొనసాగాలన్న వర్మ ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
By: Sivaji Kontham | 24 Nov 2026 11:33 PM ISTసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఎప్పుడూ తన విభిన్నమైన ఆలోచనలతో ఊహకందని స్టేట్‌మెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎదుటి వారితో రివర్స్ మైండ్ గేమ్ ఆడుతారు! తనను ప్రశ్నించేవారిని కన్ఫ్యూజ్ చేసి పబ్బంగడుపుతారు. అతడు తన మాటకారి తనంతో చాలా స్పష్ఠంగా ఎదుటివారిని డైలమాలోకి దించేయగలడు. తాజాగా ఆర్జీవీ మరణానంతర జీవితం గురించి చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ AI ఇంజనీర్ హరి గడిపూడి రూపొందించిన తన ఏఐ- ఆధారిత డిజిటల్ క్లోన్ ద్వారా.. తాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత కూడా ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉంటానని ఆర్జీవీ వెల్లడించారు. అచ్చం వర్మ శైలిలోనే.. ఆయన సిద్ధాంతాలు -ఆలోచనా విధానాన్ని అనుసరిస్తూ లాజికల్ అంశాలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా ఈ డిజిటల్ వెర్షన్ సిద్ధమైంది. సాధారణంగా సినీ ప్రముఖులు తమ సినిమాలు- జ్ఞాపకాలను మాత్రమే వదిలి వెళ్తే.. వర్మ మాత్రం తనవైన మార్క్ సమాధానాలతో డిజిటల్ రూపంలో జీవించే ఉంటానని పెద్ద ప్లానే వేసారు.
అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన, వ్యంగ్యాత్మకమైన ప్రశ్న తలెత్తుతోంది! జీవితకాలం ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు.. సంచలన ట్వీట్లతో వార్తల్లో నిలిచిన ఆర్జీవీ కోసం గతంలో పోలీసులు వెతికారు..రాజకీయ నాయకులు ఆయనను గట్టిగా టార్గెట్ చేశారు.. అంతేకాదు ఒకప్పుడు ముంబైలో ఉన్నప్పుడు అండర్ వరల్డ్ మాఫియా సైతం ఆయనను ప్రశ్నించింది. మరి భౌతికంగా లేకపోయినా.. అచ్చం వర్మ వ్యక్తిత్వం.. ఆయనలోని వ్యంగ్యంతో తయారైన ఈ AI డిజిటల్ క్లోన్ మరణానంతరం కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రకంపనలు సృష్టిస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ వర్చువల్ వర్మ హద్దులు దాటి సంచలన స్టేట్‌మెంట్లు ఇస్తే.. ఆ డిజిటల్ క్లోన్‌ను అరెస్ట్ చేయడానికి లేదా విచారించడానికి అప్పటి వ్యవస్థలు ఏం చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
బహుశా ఆర్జీవీ డిజిటల్ క్లోన్‌ను అదుపు చేయాలంటే.. చనిపోయిన పోలీసుల, రాజకీయ నాయకుల లేదా మాఫియా డాన్‌ల జ్ఞాపకాలతో కూడిన ఒక `డిజిటల్ షాడో క్లోన్` వ్యవస్థను కూడా సమాంతరంగా రూపొందించాల్సి వస్తుందేమో! వర్చువల్ ప్రపంచంలో ఆర్జీవీ క్లోన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగానే.. మరోవైపు నుంచి ఆ `షాడో క్లోన్` పోలీసులు డిజిటల్ వారెంట్లతో రంగంలోకి దిగి... ఆల్గారిథమ్‌ల మధ్య ఛేజింగ్ చేస్తూ ఆర్జీవీ క్లోన్‌ను వెంటాడే దృశ్యాన్ని ఊహించుకుంటేనే భలే థ్రిల్లర్ సినిమాలాగా ఉంది. భౌతిక ప్రపంచంలోనే కాదు.. రేపటి డిజిటల్ లోకంలోనూ వర్మను వదిలిపెట్టకుండా ప్రశ్నించేందుకు ఒక ఆల్టర్నేట్ సైబర్ ఫోర్స్ సిద్ధంగా ఉండాలన్న సెటైర్లు ఇప్పుడు నెట్టింట పేలుతున్నాయి.
ఈ డిజిటల్ క్లోన్ అసలు సిసలైన రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వాన్ని.. అతడిలోని వ్యంగ్యాన్ని ఏ మేరకు ప్రతిబింబించగలదనేది వేచి చూడాలి. అయితే మరణం తర్వాత కూడా జనానికి సమాధానాలు చెప్పే ఒక ప్రతిరూపాన్ని సృష్టించుకోవాలనే ఆలోచన రావడం బహుశా ఒక్క వర్మకే సాధ్యమేమో! ఎప్పటిలాగే తనదైన కోణంలో జీవితాన్ని, సాంకేతికతను చూస్తూ ఆర్జీవీ మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఒకవేళ భవిష్యత్తులో నిజంగానే ఆర్జీవీ క్లోన్ వర్సెస్ షాడో పోలీస్ క్లోన్ల మధ్య సైబర్ యుద్ధం మొదలైతే.. అది వర్మ తీసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాల కంటే ఎక్కువ మజాను పంచడం ఖాయం!
