Begin typing your search above and press return to search.

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) .. సినిమా రంగం భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

By:  Sivaji Kontham   |   4 Nov 2026 6:45 PM IST
AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!
X

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) .. సినిమా రంగం భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే సినిమాను ఏఐ టెక్నాలజీ సహాయంతో కేవలం ల‌క్ష‌ల‌ ఖర్చుతోనే పూర్తి చేయవచ్చని ఆయన విశ్లేషించారు. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్నా సంప్రదాయ సినీ పరిశ్రమ మాత్రం ఏఐని సంపూర్ణంగా అంగీకరించడానికి ఇంకా మానసికంగా సిద్ధంగా లేదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.

ఫిల్మ్ మేకింగ్‌లోకి ఏఐ ప్రవేశంతో చిత్ర పరిశ్రమలో నిజమైన `ప్రజాస్వామ్యం` సాకారమైందని ఆర్జీవీ పేర్కొన్నారు. ఇకపై ఎస్.ఎస్. రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు లేదా తనలాంటి పేర్లున్న టాలెంట్ కోసం నిర్మాతలు ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఏ మూలన, మారుమూల గ్రామంలో ఉన్న సామాన్యుడు కూడా తన ప్రతిభతో పూర్తి స్థాయి డైరెక్టర్, ఫిల్మ్‌మేకర్ కాగలిగే సులభతరమైన వాతావరణం ఏఐ ద్వారా ఏర్పడుతుందని.. ఫలితంగా లక్షలాది మంది కొత్త క్రియేట‌ర్లు పుట్టుకొస్తారని ఆయన విశ్లేషించారు.

అయితే ఈ విప్లవాత్మక మార్పును సినీ ఇండస్ట్రీ సులభంగా స్వీకరించలేకపోవడానికి కారణం పాత పద్ధతులు- నిర్మాణ సంస్థల భయమేనని ఆయన స్పష్టం చేశారు. ఏఐ ప్రభావం కేవలం షూటింగ్ మేకింగ్‌పైనే కాకుండా,.. పోస్ట్-ప్రొడక్షన్ ల్యాబ్స్‌పై కూడా తీవ్రంగా పడుతుందని ఆర్జీవీ హెచ్చరించారు. భ‌విష్య‌త్‌ కాలంలో ఈ టెక్నాలజీ ధాటికి స్టూడియోలు, ల్యాబ్‌లు పూర్తిగా మూతపడే పరిస్థితి వస్తుందని ఆయన అంచనా వేశారు.

మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ఏఐ సినిమాలకు ఫిల్మ్ ఫెస్టివల్స్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయని ఆర్జీవీ గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్రోత్సవాలు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలను, కంటెంట్‌ను ఎండార్స్ చేస్తున్నాయంటే భవిష్యత్ సినిమా రంగం ఏ దిశగా వెళ్తుందో ఇండస్ట్రీ వర్గాలు పరోక్షంగా అంగీకరించినట్లేనని ఆయన విశ్లేషిస్తున్నారు.

ఆర్జీవీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. సినిమా రంగంలో ఏఐ సృష్టిస్తున్న టెక్నాలజికల్ సునామీని ఎవరూ ఆపలేరని అర్థం చేసుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో ఆర్జీవీ చెప్పిన‌ట్టు ఇప్ప‌టికిప్పుడే ఏఐ సాంకేతిక‌త‌తో వంద‌శాతం స‌క్సెస్ రేటు సాధించ‌డం సులువేమీ కాదు. ఏఐ విజువ‌ల్స్ ని అంగీక‌రించ‌డానికి ఇంకా ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌కు స‌మయం పడుతుంది. ఇప్ప‌టికి ఏఐ ని ఇంకా స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్ గానే జ‌నం చూస్తున్నారు. వంద‌శాతం ప‌ర్ఫెక్ష‌న్ రావ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఆర్జీవీ అతిశ‌యోక్తిగా మాట్లాడుతున్నారా? లేదా ఆయ‌న చెప్పిన‌దే భవిష్య‌త్ అవుతుందా? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి.