మెగా ఫ్యాన్స్ మ్యాజిక్ మూమెంట్‌కి ముహూర్తం ఖరారు
తాజాగా రామ్ చరణ్ మైనపు విగ్రహం తయారి పూర్తి అయింది. ఆ విషయాన్ని స్వయంగా మేడం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 27 April 2025 3:30 PMఇండియన్ సెలబ్రెటీల్లో పలువురి మైనపు విగ్రహాలు లండన్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ అమితాబ్ బచ్చన్ మొదలుకుని రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన వారి మైనపు విగ్రహాలు మాత్రమే కాకుండా క్రీడా రంగానికి చెందిన వారి మైనపు విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రముఖుల జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరబోతున్నాడు. కొన్ని నెలల క్రితం రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన కొలతలు తీసుకున్నారు. చాలా రోజులు కావడంతో ఆ విషయం గురించి జనాలు మర్చిపోయారు.
తాజాగా రామ్ చరణ్ మైనపు విగ్రహం తయారి పూర్తి అయింది. ఆ విషయాన్ని స్వయంగా మేడం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ విగ్రహంతో పాటు, ఆయన చేతిలో పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంటుంది. రైమ్‌తో ఉన్న సమయంలోనే రామ్ చరణ్ కొలతలు తీసుకున్నారు. రైమ్‌కి కూడా కొలతలు తీసుకోవడంతో పెట్‌తో ఉన్న సెలబ్రెటీ విగ్రహంను మొదటి సారి మేడం టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ చరణ్ విగ్రహ ప్రతిష్ట అనేది మెగా ఫ్యాన్స్‌కి కచ్చితంగా మ్యాజిక్ మూమెంట్. ఆ మ్యాజిక్ మూమెంట్‌కి సంబంధించిన ముహూర్తంను ఎట్టకేలకు ఖరారు చేసి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు.
లండన్ మేడం టుస్సాడ్స్‌లో రైమ్‌తో కూడిన రామ్ చరణ్ విగ్రహంను మే 9న ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత ఆ మైనపు విగ్రహంను సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారని తెలుస్తోంది. అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే దక్కిన ఈ అరుదైన గౌరవం రామ్ చరణ్‌కు దక్కడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ యొక్క మైనపు విగ్రహంను ఎప్పుడు చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్‌ల మైనపు విగ్రహాలు ఎంతో నేచురల్‌గా నిజంగా ఆ హీరో అక్కడ నిలబడ్డాడా అన్నట్లుగా ఉన్నాయి. కనుక చరణ్ విగ్రహం కూడా అదే తరహాలో నేచురల్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి.
రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే... ఈ ఏడాది ఆరంభంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పరచడంతో ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న 'పెద్ది' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే పెద్ది ఫస్ట్ షాట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన బుచ్చి బాబు అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. రామ్ చరణ్ ను గతంలో రంగస్థలంలో ఎలా అయితే చూశామో అంతకు మించిన రా కంటెంట్‌తో, మాస్ లుక్‌లో చూపించేందుకు గాను బచ్చిబాబు ప్లాన్ చేశాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.