హీరోని మెప్పించిన ఫ్యాన్స్
విరాళాన్ని అందుకున్న రామ్ చరణ్, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పి, వారు చేసిన మంచి పనికి అందరినీ పేరుపేరునా అభినందించాడు.
By: Tupaki Desk | 12 May 2025 3:46 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఈ నెల 9వ తేదీన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చరణ్ లండన్ వెళ్లి అక్కడ విగ్రహావిష్కరణలో పాల్గొన్నాడు. చరణ్ తో పాటూ అతను ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కపిల్ల బొమ్మను కూడా మేడమ్ టుస్సాడ్స్ లో తయారుచేసి ఉంచారు.
విగ్రహ ఆవిష్కరణ తర్వాత రైమ్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చిన చరణ్ అక్కడి ఫ్యాన్స్ ను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. చరణ్ అభిమానులే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతమంది చరణ్ ను కలిశారు. యూకే లోని జనసేన మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ హీరో చరణ్ ను కలవడమే కాకుండా భారత రక్షణ నిధికి విరాళం కూడా అందచేశారు.
విరాళాన్ని అందుకున్న రామ్ చరణ్, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పి, వారు చేసిన మంచి పనికి అందరినీ పేరుపేరునా అభినందించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది అందరికీ తెలుసు.
భారత్- పాక్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు భారత సైనిక దళాలకు మద్దతుని ప్రకటించారు. ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కూడా తమ మద్దతుని తెలుపుతూ కొంత డబ్బుని ఇండియన్ ఆర్మీకి విరాళంగా అందించారు. ఇక చరణ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం అతను బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
