వీడియో: ఇద్దరిలో నాన్న ఎవరు? క్లిన్ కారా కన్ఫ్యూజన్!
అయితే చరణ్ తన మైనపు విగ్రహంతో ఫోటోలు దిగే సమయంలో క్లిన్ కారా చేసిన అల్లరి అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 12 May 2025 5:55 PMలండన మ్యాడమ్ టుస్సాడ్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఆవిష్కరణ కోసం రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు లండన్ కు వెళ్లారు. వీరితో పాటు ఇద్దరు స్పెషల్ గెస్టులు ఉన్నారు. ఒకరు రైమ్ కాగా, మరొకరు క్లిన్ కారా. రైమ్ పెట్ డాగ్.. చరణ్- ఉపాసన దంపతుల గారాల పట్టీ క్లిన్ కారా .. పోటీపడి ఈ వేదిక వద్ద సందడి చేయడం కనిపించింది.
రైమ్ చరణ్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసింది.. ఫోటోలు దిగింది. మైనపు విగ్రహంలో రైమ్ ఒక భాగం.. చరణ్ తో పాటు బిగ్ సెలబ్రిటీ అయింది. ఈ వేదికపై చరణ్ చెంత రైమ్ ప్రధానంగా హైలైట్ అయింది. విగ్రహావిష్కరణ అనంతరం చరణ్ వ్యాక్స్ స్టాట్యూ తో ఫోటోషూట్ కార్యక్రమం జరిగింది. ఈ ఫోటోషూట్ లో మైనపు విగ్రహంతో ఉపాసన, సురేఖ కూడా విడివిడిగా ఫోటోలు దిగారు.
అయితే చరణ్ తన మైనపు విగ్రహంతో ఫోటోలు దిగే సమయంలో క్లిన్ కారా చేసిన అల్లరి అందరి దృష్టిని ఆకర్షించింది. వేదికపై ఉన్న చరణ్ పై ఫ్లాష్ లు మెరుస్తుంటే, అదేమీ పట్టని చిన్నారి క్లిన్ కారా డాడీ చెంతకు వెళ్లి చేరుకుంది. అతడితో కలిసి ఫోటోలు దిగింది. వేదిక కింది నుంచి క్లిన్ బుడి బుడి అడుగులు వేస్తూ డాడీ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే ఉపాసన తనను ఆపేందుకు చాలాసార్లు కారా కారా అంటూ పిలిచారు. కానీ క్లిన్ కారా అదేమీ వినిపించుకోకుండా డాడీ చెంతకు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయింది. అయితే క్లిన్ నేరుగా ఫోటోలకు ఫోజులిస్తున్న డాడీని వదిలేసి మైనపు విగ్రహం చెంతకు వెళుతూ కనిపించింది.
ఆ సమయంలో క్లిన్ కారా `ఎవరు అసలు డాడీ?` అని వెతికింది. ఒకే రూపంతో ఇద్దరు డాడీలు వేదికపై తనను కన్ఫ్యూజ్ చేసారు. కానీ ఆ సమయంలో చరణ్ తన రెక్కను పట్టుకుని ఫోటో ఫ్లాష్‌లకు అడ్డు పడకుండా కారాను ఆపారు కాబట్టి గుర్తించగలిగింది. ఒకవేళ డాడీ ఆపకపోతే `విగ్రహాన్ని` అసలు డాడీ అని ఫిక్సయినట్టే కనిపించింది. నిజానికి అంత అద్భుతంగా లండన్ టుస్సాడ్స్ శిల్పులు దీనిని డిజైన్ చేసారని అంగీకరించాలి.
ఇక చిన్నారి క్లిన్ చరణ్ ని వదిలి క్షణమైనా ఉండలేదు. ఈ విషయాన్ని ఇంతకుముందు ఉపాసన కూడా చెప్పారు. ఇప్పుడు లండన్ మ్యూజియంలో అదే జరిగింది. ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన వీడియోని మెగాభిమానులు సోషల్ మీడియాల్లో వైరల్ గా షేర్ చేస్తున్నారు.