పెద్ది తర్వాత చరణ్ బిగ్ ప్లాన్.. లైన్ లోకి మరో స్టార్ దర్శకుడు!
పెద్ది సినిమాతో మళ్లీ మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
By: Tupaki Desk | 28 May 2025 12:48 PM ISTపెద్ది సినిమాతో మళ్లీ మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కానుంది. భారీ స్థాయిలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం ఒక పాన్ ఇండియా విజన్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇందులో చరణ్ క్యారెక్టర్ కూడా పూర్తి భిన్నంగా ఉండనుందని టాక్.
ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న పెద్ది సినిమా పూర్తయితే, తదుపరి ప్రాజెక్టులపై చరణ్ దృష్టి పెట్టనున్నాడు. ఈ సినిమాకి తర్వాత, సుకుమార్‌తో రామ్ చరణ్ మళ్లీ జతకట్టనున్నాడు. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌పై అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి. కథా పరంగా భారీ ఎమోషనల్ డ్రామా, ఊహించని లెవెల్లో మేకింగ్ ఉండబోతోందట. అయితే, సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉండటంతో, చరణ్ సినిమా ప్రారంభం ఆలస్యం కావొచ్చని టాక్. ఇదే సమయంలో చరణ్ మరొక స్టార్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం రామ్ చరణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా 2026 మధ్యలో సెట్స్ మీదకి వెళ్ళబోతోందట. ఈ ప్రాజెక్ట్‌కి కొత్త ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ వస్తోంది. ముందుగా వెంకటేశ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే చరణ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. అలా అయితే, త్రివిక్రమ్ అల్లు అర్జున్ పౌరాణిక చిత్రం మరింత ఆలస్యం కావడం ఖాయం.
చరణ్ ప్రాజెక్ట్ లైన్‌లోకి రావడం, సుకుమార్ సినిమా ఆలస్యం కావడం అన్నీ కలిస్తే, త్రివిక్రమ్ సినిమా ముందే సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందన్న చర్చ ఫిల్మ్ నగర్‌లో గట్టిగానే వినిపిస్తోంది. త్రివిక్రమ్ శైలిలో వినోదం, భావోద్వేగం, మాటల మేజిక్ ఉంటే, చరణ్ స్టైల్‌లో మాస్ యాక్షన్ మిక్స్ అవుతూ ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇచ్చేలా ప్లాన్ జరుగుతోందట. ఇప్పటి వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. కనుక ఇది మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
కథ పూర్తి కాగానే కాస్టింగ్ ఫైనల్ చేస్తారనే సమాచారం. చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ పూర్తిచేసేందుకు బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు, సుకుమార్, త్రివిక్రమ్.. ఇలా వరుసగా సుదీర్ఘ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకోవడం చూస్తుంటే, ఆయనకు రాబోయే రెండేళ్లు చాలా హెక్టిక్‌గా ఉండనున్నాయి. అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
