Begin typing your search above and press return to search.

బుచ్చిబాబు కోసం 'పెద్ది' కానుక

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, భక్తి విషయంలో మాత్రం తగిన సమయాన్ని కేటాయిస్తాడు.

By:  Tupaki Desk   |   4 April 2025 11:26 AM IST
బుచ్చిబాబు కోసం పెద్ది కానుక
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, భక్తి విషయంలో మాత్రం తగిన సమయాన్ని కేటాయిస్తాడు. ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు సానాకు ఒక పవిత్రమైన కానుక పంపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ కానుకలో శ్రీ రాముని పాదుకలు, హనుమాన్ చలీసా పుస్తకం, హనుమంతుని బొమ్మతో కూడిన ప్రత్యేక బాక్స్ ఉంది. దీన్ని చూసినవారు ఆధ్యాత్మికతకి చరణ్ చూపిన విలువను ప్రశంసిస్తున్నారు.


ఈ బాక్స్‌పై ‘బుచ్చి’ అని పదాన్ని ముద్రించారు. అందులో ఉన్న పుస్తకంపై రామ్ చరణ్ ఒక లేఖ రాశారు. "హనుమంతునిపై నా నమ్మకం నాకు ఎన్నో కష్ట సమయాల్లో ధైర్యాన్నిచ్చింది. నేను నలభైఏళ్లకు చేరుకున్న ఈ సమయంలో నా ఆధ్యాత్మిక శక్తిని నువ్వు కూడా అనుభవించాలి" అని చరణ్ పేర్కొన్నారు. ఈ లేఖ చదివిన ప్రతి ఒక్కరికీ ఆత్మీయతను, ప్రేమను అనుభూతి చేసేలా ఉంది.


ఈ కానుకను స్వీకరించిన దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “రామ్ చరణ్, ఉపాసన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హనుమంతుడి ఆశీర్వాదాలు మీతో ఉండాలి” అని ట్వీట్ చేశారు. ఆయన ఈ కానుకను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు. అభిమానులూ ఈ కానుకకు అద్భుతంగా స్పందిస్తున్నారు.


రామ్ చరణ్ సినిమాల్లో మాస్ పాత్రలు పోషించడమే కాదు, వ్యక్తిగత జీవితం లో కూడా విలువలతో నడుచుకుంటారు. గతంలోనూ ఆయన చాలా ఆలయాలను దర్శించి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మికతతో కూడిన ఈ కానుక ద్వారా చరణ్ వ్యక్తిత్వం మరింత మెరిసిపోతోంది. ఇదే సందర్భంలో చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను శ్రీరామ నవమి రోజున విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ఈ గ్లింప్స్ కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ప్రత్యేకంగా నేపథ్య సంగీతాన్ని సిద్ధం చేసినట్టు టాక్. అభిమానుల కోసం చరణ్ ఇదే నిజమైన పండుగ కానుక అని చెప్పొచ్చు. అలాగే చరణ్ నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. ఇక ఈ లోపు చరణ్ పెద్ది సినిమా షూటింగ్ ను ఫినిష్ చేయనున్నారు.