Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ ఆతిథ్యానికి ప‌ర‌వ‌శించిన హృతిక్ మాజీ భార్య‌

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తో క‌లిసి `వార్ 2`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 April 2025 10:21 AM IST
Ram Charan Hosts Sussanne Khan and Zayed Khan in Hyderabad
X

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తో క‌లిసి `వార్ 2`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి మాజీ భార్య సుసానే ఖాన్ ఇప్పుడు హైద‌రాబాద్ తో అనుబంధం కొన‌సాగించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సుసానే కింగ్ ఖాన్ షారూఖ్ భార్య గౌరీఖాన్ తో క‌లిసి భాగ‌స్వామ్య వ్యాపార‌ల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు త‌మ వ్యాపారాన్ని హైద‌రాబాద్ కి విస్త‌రించే ప‌నిలో ఉన్నారు. హైద‌రాబాద్ లో మొట్ట‌మొద‌టి చార్ కోల్ స్టోర్ ని సుసానే ప్రారంభించారు.


ఆస‌క్తిక‌రంగా ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా ఎవ‌రు హాజ‌ర‌య్యారో తెలుసా? నిస్సందేహంగా అతిథుల‌ను ఎంతో గౌర‌వంగా ప్రేమ‌గా ఆద‌రించే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ స్టోర్ లాంచ్ కి వెళ్లాడు. అంతేకాదు సుసానే, ఆమె సోద‌రుడు జాయేద్ ఖాన్ ల‌కు త‌న ఇంట్లో ఆతిథ్యం కూడా ఇచ్చాడు. దీనికి ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన సుసానే, జాయేద్ అత‌డి ప్రేమ ఆద‌రాభిమానాల‌కు ప‌ర‌వ‌శించి పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. రియ‌ల్ సూప‌ర్ స్టార్, లెజెండ్ అంటూ చ‌ర‌ణ్‌ని కీర్తించారు. అత్యుత్త‌మ ఆతిథ్యం ఇచ్చారు! అంటూ పొగిడేసారు.


నిజానికి చ‌రణ్ ఇటీవ‌ల ముంబై సెల‌బ్రిటీల‌తో ఎంతో స‌న్నిహితంగా మెలుగుతున్నాడు. ముంబైలో సొంత ఇల్లు కొనుక్కోవ‌డ‌మే కాదు.. త‌న వ్యాపార కార్య‌క‌లాపాల‌ను విస్త‌రించేందుకు ఆఫీస్ తెరిచాడ‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. అలాగే హైద‌రాబాద్ కి విచ్చేసే ముంబై ప్ర‌ముఖుల‌కు ఆతిథ్యం ఇవ్వ‌డం, వారికి తెలుగు వారి వంట‌కాల్ని రుచి చూపించ‌డంలోను చ‌ర‌ణ్ త‌న ప్రేమ‌ను ఆప్యాయ‌త‌ను చూపిస్తున్నాడు. అతిథుల్ని దేవుళ్ల‌లా చూడ‌టం మెగా హీరోల‌కు తొలి నుంచి అలవాటు. స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్ స‌హా ఎంద‌రో స్టార్లకు వారు ఆతిథ్యం ఇచ్చారు. ప్ర‌స్తుతం చార్ కోల్ స్టోర్ లాంచ్ లో సుసానే, ఆమె సోద‌రుడు జాయేద్, అత‌డి భార్య మ‌లైకా ప‌రేఖ్ ల‌తో రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.


స్టోర్ లాంచ్ లో పాల్గొన్న చ‌ర‌ణ్‌ని ఉద్ధేశించి సుసానే మాట్లాడుతూ.. మా నిజ జీవిత SUPERSTAR - లెజెండ్ రామ్ చ‌ర‌ణ్, ప్రియమైన ఉపాసనకు ధన్యవాదాలు. మ‌మ్మ‌ల్ని ఎంతో ప్రేమ‌గా ఆద‌రించారు అని కితాబిచ్చారు. జాయెద్ ఖాన్ రామ్ చరణ్‌ను కౌగిలించుకుని అతడితో మాట్లాడుతున్న‌ కొన్ని ఫోటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. అత‌డు గ్లోబల్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, నేను ఇప్పటివరకు కలిసిన అత్యంత అద్భుతమైన వ్య‌క్తుల్లో ఒకరు.. మీ ఇంట్లో ఒక అద్భుతమైన సాయంత్రం గడిపినందుకు ధన్యవాదాలు అని జాయేద్ సోష‌ల్ మీడియాలో రాసారు.