నేటివిటీ కథలకు పెరుగుతున్న డిమాండ్.. టాలీవుడ్ లో మరో కొత్త మూవీ!
సాధారణంగా ఒక జానర్ లో ఒక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది అంటే ఇక దాదాపుగా చాలామంది దర్శకులు అలాంటి జానర్లోనే కథలు రాసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.
By: Madhu Reddy | 10 July 2026 12:10 PM ISTసాధారణంగా ఒక జానర్ లో ఒక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది అంటే ఇక దాదాపుగా చాలామంది దర్శకులు అలాంటి జానర్లోనే కథలు రాసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఇకపోతే మిగతా జానర్ల విషయానికే వస్తే.. ఈ మధ్య నేటివిటీ కథలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని కథలు రాసి ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులు.. ఇప్పుడు ఆ ప్రాంతాల ప్రాముఖ్యతలను.. భాషా సంస్కృతిని, జీవనశైలిని ప్రతిబింబించే కథలను తెరపై చూపిస్తూ మరిన్ని విజయాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అలా ఇప్పటికే నేటివిటీని దృష్టిలో పెట్టుకొని కాంతార, బలగం, దసరా , రాజు వెడ్స్ రాంబాయి ఇలా ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నవే.
మరోవైపు ఎల్లమ్మ, ఇడుపు కాయితం వంటి చిత్రాలు కూడా తెలంగాణ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటీటీ వేదికలపై కూడా తెలంగాణ మూలాలు ఉన్న కథలకి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే చిన్న సినిమాలను మొదలుకొని పెద్దపెద్ద స్టార్ హీరోల ప్రాజెక్టు వరకు ఇప్పుడు ఎక్కువగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే కథలపై చర్చలు జరుగుతున్నాయట. ముఖ్యంగా ఇలాంటి ప్రాంతీయ సంస్కృతికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుండడంతో దర్శక నిర్మాతలు కూడా వీటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ శకుంతల, జయప్రకాష్ రెడ్డి లాంటి నటీనటులు అద్భుతమైన తెలంగాణ, కర్నూల్ యాసలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. నిజానికి ఒకప్పుడు ఇలాంటి యాసలతో సినిమాలు చేయడానికి వెనుకంజ వేసిన దర్శకులు కేవలం పాత్రలకు మాత్రమే యాసను పరిమితం చేశారు. అయితే ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి మారిపోయిన నేపథ్యంలో అదే యాసను సినిమాకు బలంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. మరొకవైపు టాలీవుడ్ లో మరో కొత్త సినిమా తెలంగాణ నేటివిటీ కి అనుగుణంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. వారెవరో కాదు నటుడు రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో గ్రామీణ నేపథ్యం కలిగిన రంగస్థలం సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు తెలంగాణ నేటివిటీ కథలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో సాగే పక్కా రూటెడ్ స్టోరీగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కి మంచి ఆదరణ అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ నేటివిటితో కూడిన కథలో కనిపిస్తారా? అనే ఆసక్తి అభిమానులలో నెలకొంది. మొత్తానికి అయితే వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడంతోనే అంచనాలు పీక్స్ కి చేరిపోగా.. ఇప్పుడు తెలంగాణ నేటివిటితో సినిమా రాబోతోందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.
