Begin typing your search above and press return to search.

సీక్వెల్స్ ట్రెండ్ మధ్య సింగిల్ పార్ట్ కే మళ్లీ డిమాండ్?

అయితే ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ లో ఛేంజ్ కనిపిస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. సీక్వెల్స్ హవా కొనసాగుతున్నప్పటికీ, పూర్తి కథను ఒకే సినిమాలో చూసేయాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోందని టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   19 July 2026 1:25 PM IST
సీక్వెల్స్ ట్రెండ్ మధ్య సింగిల్ పార్ట్ కే మళ్లీ డిమాండ్?
X

ప్రస్తుతం స్టార్ హీరోల కొత్త చిత్రాలు అనౌన్స్ చేసినప్పుడల్లా ఫ్యాన్స్ లో.. "ఒకే పార్టులో వస్తుందా.. లేక రెండు భాగాలుగా వస్తుందా?" అనే ప్రశ్న ముందు వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు వరుసగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ లో ఛేంజ్ కనిపిస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. సీక్వెల్స్ హవా కొనసాగుతున్నప్పటికీ, పూర్తి కథను ఒకే సినిమాలో చూసేయాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోందని టాక్ వినిపిస్తోంది.

అందుకు లేటెస్ట్ గా రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో రూపొందనున్న RC 17 మూవీ కూడా కారణమైంది. ప్రారంభంలో ఆ చిత్రం రెండు భాగాలుగా ఉండొచ్చనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాను సింగిల్ పార్టుగా తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా ఆ అంశం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ బాగా పెరిగింది. ఒక సినిమా దాని కథను విస్తరించి మరో భాగం తీసుకురావడం సాధారణమైంది. కొన్ని సందర్భాల్లో కథకు నిజంగానే పెద్ద వరల్డ్ ఉండటం, రోల్స్ జర్నీని మరింత డెప్త్ గా చూపించాల్సిన అవసరం ఉండటం వల్ల రెండు భాగాల ఫార్మాట్ ఉపయోగపడుతోంది. అంతేకాదు, మొదటి భాగం సక్సెస్ అయితే రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడటం నిర్మాతలకు కలిసిస్తోంది.

అయితే మరోవైపు ప్రేక్షకుల ఆలోచనలో కూడా మార్పు కనిపిస్తోంది. ఒక కథను రెండు లేదా మూడు భాగాలుగా చెప్పడం కంటే, అదే కథను స్ట్రాంగ్ స్క్రీన్‌ ప్లేతో ఒకే సినిమాలో పూర్తి చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, సాధారణ సినీ ప్రియులు సినిమా ముగిసే సమయానికి పూర్తి సంతృప్తి పొందాలనే ఫీలింగ్ తో థియేటర్లకు వస్తున్నారు. దీంతో కథకు అవసరం ఉంటేనే సీక్వెల్, లేకపోతే సింగిల్ పార్ట్ అనే విధానాన్ని దర్శకులు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే కారణంగా ఇప్పుడు సినిమా ప్రకటించినప్పటి నుంచి కథ ఎంత పెద్దది అనే దానికంటే, అది ఎన్ని భాగాల్లో వస్తుందనే చర్చ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు రెండు భాగాలుగా వస్తేనే భారీ సినిమా అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు కథకు న్యాయం జరిగితే చాలు, ఒకే పార్టులో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే అభిప్రాయం బలపడుతోంది. దీంతో సింగిల్ పార్ట్ సినిమాలపై మళ్లీ దృష్టి పెరుగుతోందని తెలుస్తోంది.

ఇక్కడే సుకుమార్ లాంటి డైరెక్టర్స్ ప్లాన్ పై ఆసక్తి నెలకొంటోంది. బిగ్ కాన్వాస్, స్ట్రాంగ్ రోల్స్, వినూత్న కథనాలతో సినిమాలు రూపొందించే దర్శకులు కథకు ఏ ఫార్మాట్ సరిపోతుందనే అంశంపై మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వినికిడి. ఆడియన్స్ అంచనాలు, మార్కెట్ పరిస్థితులు, స్టోరీ నీడ్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నా, పూర్తి కథను ఒకే సినిమాలో చెప్పే ప్రయత్నాలపై ప్రేక్షకుల ఆసక్తి పెరుగుతోంది.