Begin typing your search above and press return to search.

మొన్న చ‌ర‌ణ్‌.. నిన్న ప్ర‌భాస్, ఇవాళ ఎన్టీఆర్..

అందుకే త‌మ క్రేజ్ ను పెంచుకోవ‌డానికి, త‌మ మార్కెట్ ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డానికి టాలీవుడ్ కు చెందిన హీరోలంతా వేరే భాష‌ల‌కు చెందిన డైరెక్ట‌ర్ల‌తో మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌తో జ‌ట్టు క‌ట్ట‌డానికి ఆస‌క్తి చూపించేవారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Aug 2025 6:00 AM IST
మొన్న చ‌ర‌ణ్‌.. నిన్న ప్ర‌భాస్, ఇవాళ ఎన్టీఆర్..
X

ఇప్పుడంటే తెలుగు సినిమా స్థాయి విప‌రీతంగా పెరిగి మిగిలిన భాష‌ల‌కు చెందిన వాళ్లంతా టాలీవుడ్ వైపు చూస్తున్నారు కానీ ఒక‌ప్పుడు తెలుగు సినిమాను మిగిలిన వారంతా ఎంతో చుల‌క‌నగా చూసేవాళ్ల‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందుకే త‌మ క్రేజ్ ను పెంచుకోవ‌డానికి, త‌మ మార్కెట్ ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డానికి టాలీవుడ్ కు చెందిన హీరోలంతా వేరే భాష‌ల‌కు చెందిన డైరెక్ట‌ర్ల‌తో మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌తో జ‌ట్టు క‌ట్ట‌డానికి ఆస‌క్తి చూపించేవారు.

జంజీర్ తో చ‌ర‌ణ్ బాలీవుడ్ డెబ్యూ

అలా ఎంతోమంది హీరోలు ప‌ర భాషా డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి ప‌ని చేశారు. అయితే అలా చేసిన వాళ్ల‌కు ఎక్కువ శాతం ఫెయిల్యూర్లే ఎదుర‌య్యాయి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌తో టాలీవుడ్ హీరోలు చేసిన సినిమాలైతే మ‌రీ దారుణమైన టాక్ ను తీసుకురావ‌డంతో పాటూ వారికి చాలా చేదు అనుభ‌వాన్ని మిగిల్చాయి. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ అక్క‌డి డైరెక్ట‌ర్ తో జంజీర్ తీయ‌గా అది డిజాస్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే.

ఆదిపురుష్ తో ప్ర‌భాస్ కు చుక్కెదురు

ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ చేస్తే అది కూడా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేక‌పోయింది. ఇక ఇప్పుడు తాజాగా వార్2 సినిమాతో ఎన్టీఆర్ కు కూడా అదే ప‌రిస్థితి ఎదురైంది. అయాన్ ముఖ‌ర్జీని మ‌రీ ఎక్కువ‌గా న‌మ్మేసి తార‌క్ వార్2తో ఎవ‌రూ ఊహించ‌ని షాక్ ను ఎదుర్కొన్నారు. అయితే ఈ విష‌యంలో టాలీవుడ్ లో ఓ ఇద్ద‌రు హీరోల ముందుచూపుని మాత్రం మెచ్చుకోవాల్సిందే.

వారి రూటే స‌ప‌రేటు

వాళ్లే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వారిద్ద‌రూ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఇన్నేళ్ల‌వుతున్నా ఎప్పుడూ బాలీవుడ్ డైరెక్ట‌ర్ల జోలికి పోలేదు. క‌నీసం మ‌హేష్ బాబు వేరే భాష‌కు చెందిన డైరెక్ట‌ర్ తో అయినా సినిమాలు చేశారేమో కానీ బ‌న్నీ మాత్రం అది కూడా చేయ‌లేదు. మ‌ధ్య‌లో బాలీవుడ్ డైరెక్ట‌ర్లు చెప్పిన క‌థ‌లు విన్న‌ప్ప‌టికీ, వారిని గుడ్డిగా న‌మ్మేసి ముందడుగు మాత్రం వేయ‌లేదు. బ‌న్నీ మొద‌టిసారి వేరే భాష‌కు చెందిన డైరెక్ట‌ర్ అయిన అట్లీతో ఇప్పుడే సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వేరే ఇండ‌స్ట్రీకి చెందిన డైరెక్ట‌ర్ తో వ‌ర్క్ చేయ‌లేదు. ఓ వైపు ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ బాలీవుడ్ కు వెళ్లి ఎదురుదెబ్బ‌లు తింటే మ‌హేష్, బ‌న్నీ మాత్రం సౌత్ ఈజ్ బెస్ట్ అనే ఫార్ములాని ఫాలో అవుతూ త‌మ కెరీర్లో ముందుకు ఎదుగుతున్నారు.