Begin typing your search above and press return to search.

పెద్ది పర్సంటేజ్ సిస్టం వివాదం.. అసలేం జరిగింది?

టాలీవుడ్ లో ప్రస్తుతం పెద్ది సినిమా చుట్టూ పర్సంటేజ్ సిస్టం వివాదం హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   16 Jun 2026 10:51 AM IST
పెద్ది పర్సంటేజ్ సిస్టం వివాదం.. అసలేం జరిగింది?
X

టాలీవుడ్ లో ప్రస్తుతం పెద్ది సినిమా చుట్టూ పర్సంటేజ్ సిస్టం వివాదం హాట్ టాపిక్‌ గా మారింది. అయితే ఆ వ్యవహారంలో నిర్మాత కంప్లీట్ పర్సంటేజ్ విధానాన్నే వ్యతిరేకించారా? లేక ఇప్పటికే పూర్తయిన ఒప్పందాలపై కొత్త నిర్ణయాలు అమలు చేయడాన్నే అభ్యంతరం వ్యక్తం చేశారా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వాస్తవానికి ఆ వివాదం మే 15వ తేదీన తెలుగు ఫిలిం ఛాంబర్‌ లో జరిగిన సమావేశంతో మొదలైంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ షేరింగ్ విధానం అమలుపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మీటింగ్ నిర్వహించినట్లు ఛాంబర్ తెలిపింది. ఆ విషయంపై 21 మంది సభ్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు అనౌన్స్ చేశారు.

సబ్ కమిటీ చర్చల అనంతరం మే 26న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఛాంబర్ పేర్కొంది. వాటిలో ముఖ్యంగా పెద్ది సినిమాను ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల చేయాలని, ఆంధ్రప్రదేశ్‌ లో టికెట్ ధరలు పెరిగితే పెంచిన ధరల్లో 7.5 శాతం పర్సంటేజ్ అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అలాగే ప్రీమియర్ షోల కోసం ఏ సెంటర్‌ కు రూ.25 వేలు, బీ సెంటర్‌ కు రూ.15 వేలు, సీ సెంటర్‌ కు రూ.5 వేలు చెల్లించే విధానాన్ని సూచించింది.

ఆ నిర్ణయాలు చెబుతూ మే 27న పెద్ది నిర్మాత వెంకట సతీశ్ కిలారుకు ఛాంబర్ లెటర్ పంపినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 26న టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంతో ఆ నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుందని కూడా ఆ లేఖలో వివరించింది. అయితే దీనిపై జూన్ 13న ప్రొడ్యూసర్ వెంకట సతీశ్ కిలారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఛాంబర్‌ కు లేఖ రాశారు. మే 15న జరిగిన సమావేశానికి తనకు గానీ, తమ డిస్ట్రిబ్యూటర్లకు గానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదా ఇన్విటేషన్ అందలేదని ఆయన చెప్పారు.

తమకు తెలియకుండా, తమ అభిప్రాయం తెలుసుకోకుండా పెద్ది సినిమాకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో తాను హాజరై పెద్ది సినిమా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించామని, కొత్త షేరింగ్ విధానం నుంచి ఆ సినిమాను మినహాయించాలని క్లియర్ గా చెప్పినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఆ అంశాన్ని లెక్కలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా, సినిమా విడుదలై వారం రోజులు దాటిన తర్వాత ఇప్పటికే ఫిక్స్ అయిన బిజినెస్ అగ్రిమెంట్లు తిరిగి తెరవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని నిర్మాత లెటర్ లో పేర్కొన్నారు. ఇప్పటికే వారు పెట్టుబడులు పెట్టి రిస్క్ తీసుకున్నారని, ఇప్పుడు ఎక్స్ ట్రా భారం మోపడం సమస్యలకు దారితీస్తుందని వివరించారు.

అయితే మొత్తం వ్యవహారంలో గమనించాల్సిన అంశం ఏమిటంటే.. నిర్మాత వెంకట సతీశ్ కిలారు పర్సంటేజ్ సిస్టాన్ని వ్యతిరేకించలేదు. కానీ పెద్ది సినిమాకు సంబంధించిన అన్ని అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాత, విడుదల అనంతరం కొత్త నిర్ణయాలు అమలు చేయడానికి ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు అసలు వివాదం పర్సంటేజ్ విధానంపై కాదా? లేక వ్యాపార ఒప్పందాలపై కొత్త రూల్స్ విధించడంపైనేనా? అనే ప్రశ్నలు చర్చకు దారితీశాయి. మరి తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.