Begin typing your search above and press return to search.

పెద్ది ప్రీమియర్స్.. ఇది మామూలు తలనొప్పి కాదు..

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు విడుదలకు ముందు రోజు రాత్రి నుంచే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు వేయడం కొంతకాలంగా కామన్‌ గా మారింది.

By:  M Prashanth   |   26 May 2026 11:47 PM IST
పెద్ది ప్రీమియర్స్.. ఇది మామూలు తలనొప్పి కాదు..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్స్‌ పై క్లారిటీ వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు.. మేకర్స్‌ కు పెద్ద తలనొప్పిగా మారినట్లు చర్చ జరుగుతోంది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు విడుదలకు ముందు రోజు రాత్రి నుంచే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు వేయడం కొంతకాలంగా కామన్‌ గా మారింది. అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా స్పెషల్ పర్మిషన్ల కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. కానీ ఈసారి పెద్ది విషయంలో పరిస్థితి అంత సులభంగా కనిపించడం లేదు.

ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం థియేటర్ల రెంటల్ విధానం, పర్సంటేజ్ పద్ధటి అంశాలపై ఎగ్జిబిటర్లు-నిర్మాతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన షేర్ వ్యవహారంలో రెండు వర్గాల మధ్య ఒకే అభిప్రాయం కుదరడం లేదని చెప్పాలి. పెద్ది చిత్రాన్ని పర్సంటేజ్ పద్ధతిలోనే విడుదల చేయాలని కొంతమంది ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా.. నిర్మాతలు మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.

అంతేకాదు.. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వొద్దంటూ కొందరు ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణలో కొన్ని సినిమాల విషయంలో ప్రత్యేక షోలు, టికెట్ రేట్ల పెంపు అంశాలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా.. తరువాత కోర్టుల్లో పిటిషన్లు దాఖలవడంతో విడుదల సమయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పెద్ది టీమ్ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు.

ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ ప్రత్యేక షోలు, ప్రీమియర్స్‌ కు అనుమతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి పర్మిషన్లు కచ్చితంగా వచ్చేస్తాయని చెప్పాలి. అయితే ఇక్కడే మేకర్స్‌ కు అసలు చిక్కు వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఏపీలో మాత్రమే ప్రీమియర్స్ వేసి.. తెలంగాణలో వేయకపోతే అభిమానుల నుంచి అసంతృప్తి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట.

ముఖ్యంగా రామ్ చరణ్‌ కు తెలంగాణలో ఉన్న భారీ ఫ్యాన్ బేస్‌ ను దృష్టిలో పెట్టుకుంటే.. రెండు రాష్ట్రాల్లో ఒకే తరహా విడుదల వాతావరణం ఉండాలని నిర్మాతలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. లేదంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఫ్యాన్స్ అసహనం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారని సమాచారం. అందుకే ప్రస్తుతం పెద్ది టీమ్.. తెలంగాణ పరిస్థితులపై పూర్తి స్పష్టత వచ్చే వరకు తుది నిర్ణయం తీసుకోవద్దనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు పూర్తయితేనే ప్రీమియర్స్‌ పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మాత్రం పెద్ది ప్రీమియర్స్ వ్యవహారం.. మేకర్స్‌ కు మామూలు తలనొప్పి కాదనే మాట వినిపిస్తోంది.