ట్రెండీ టాక్: రామ్ చరణ్‌పై 'దురంధర్' ఒత్తిడి
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్లకు అకస్మాత్తుగా సరికొత్త చిక్కులు, సవాళ్లు ఎదురవుతున్నాయి.
By: Sivaji Kontham | 24 May 2026 6:00 PM ISTటాలీవుడ్ పాన్ ఇండియా స్టార్లకు అకస్మాత్తుగా సరికొత్త చిక్కులు, సవాళ్లు ఎదురవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద దురంధర్, దురంధర్ 2 చిత్రాలు సృష్టించిన అసాధారణ ప్రభంజనం.. సాధించిన రికార్డు బ్రేకింగ్ వసూళ్లు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాయి. కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా.. ఆ సినిమాల స్క్రీన్ ప్లే ఫార్మాట్, మేకింగ్ స్టాండర్డ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ రేస్‌లో ఉన్న టాప్ స్టార్స్ అందరూ తమ తదుపరి చిత్రాలతో అవే ప్రమాణాలను అందుకోవాలని.. రికార్డులను అధిగమించాలని తపిస్తుండటంతో అది కాస్తా తీవ్ర ఒత్తిడిని పెంచడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
ఈ గట్టి పోటీలో అందరికంటే ముందుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `పెద్ది`పై అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాతో ఉత్తరాదిన బాక్సాఫీస్ వద్ద సరికొత్త వేవ్స్ క్రియేట్ చేయాలని చరణ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. దర్శకులు బుచ్చిబాబు సానా, సుకుమార్ అందించిన అద్భుతమైన కంటెంట్‌ను ఆయన బలంగా నమ్మారు. ఈ నమ్మకంతోనే నార్త్ ఇండియా మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు చరణ్ రంగంలోకి దిగారు.
హిందీ బెల్ట్‌లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా `పెద్ది` చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేయడం కోసం గతానికి భిన్నంగా విభిన్నమైన ఉత్తరాది నగరాలను ఎంచుకుని ప్రమోషన్స్ చేస్తుండటం విశేషం. అయితే `దురంధర్` సృష్టించిన రికార్డులను దాటడం అంత తేలికైన విషయం కాదు. ఆ సవాల్‌ను స్వీకరిస్తూ చరణ్ చేస్తున్న ఈ వినూత్న ప్రచార వ్యూహాలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు.. ఆ తర్వాత బాక్సాఫీస్ పోరులోకి రాబోయే ఇతర బాలీవుడ్ స్టార్ల సినిమాలతో పాటు, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి నలుగురు బిగ్ స్టార్లపై కూడా ఇదే తరహా ఒత్తిడి ఉండబోతోంది. ప్రస్తుత డిజిటల్ - ఓటీటీ యుగంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కేవలం కంటెంట్ బాగుంటే సరిపోదు. ఉత్తరాది, దక్షిణాదితో పాటు ఓవర్సీస్‌లోనూ జనాల్లో పూనకాలు పెంచేలా భారీ ఎత్తున ఎంతో తెలివిగా ప్రచార ప్రణాళికలను రచించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖించగలవు.
ప్రస్తుతం రామ్ చరణ్ `పెద్ది` సినిమా కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ గనుక ఫలిస్తే అది మునుముందు విడుదల కానున్న సినిమాలకు ఒక రోడ్ మ్యాప్‌లా మారుతుంది. భవిష్యత్తులో కేవలం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్లే కాకుండా, మిగిలిన దక్షిణాది హీరోలందరూ కూడా ఇదే బాటలో ప్రయాణించే ఆస్కారం ఉంటుంది. మరి `దురంధర్` తన ముందుంచిన సవాల్ ని మన పాన్ ఇండియా స్టార్లు ఏవిధంగా ఛేజ్ చేస్తారో వేచి చూడాలి.
